రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కూరగాయలు, పండ్లను కాలుష్యరహితం చేసే “క్రిమిసంహారక స్ప్రేలు” కొత్త టెక్నాలజీలను రూపొందించిన ఐ.పి.ఎఫ్.టి.



Posted On: 12 SEP 2020 11:45AM by PIB Hyderabad

కోవిడ్ వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేకెత్తించిన తరుణంలో క్రిమి సంహారక మందుల రూపకల్పనా సంస్థ (ఐ.పి.ఎఫ్.టి.) హానికరమైన సూక్ష్మజీవుల దాడినుంచి కాపాడే రెండు కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాలను విజయవతంగా రూపొందించింది. ఉపరితలాలపై పిచికారీ చేసేందుకు ఉయోగించే క్రిమిసంహారక స్ప్రేని, కూరగాయలు, పండ్లను కాలుష్యరహితంగా చేసే మరో క్రిమిసంహారక స్ప్రే మందును ఈ సంస్థ రూపొందించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రసాయనాలు, పెట్రో కెమికల్స్ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఐ.పి.ఎఫ్.టి. పనిచేస్తోంది.

తలుపుల హ్యాండిల్స్, కుర్చీల్లో చేతులు ఆనించే ప్రాంతాలు, కంప్యూటర్ కీ బోర్డులు, మౌస్ ట్యాపులు తదితర ఉపరితలాలు వాడినపుడు అవి నేరుగాగానీ, పరోక్షంగా గానీ సూక్ష్మక్రిములను ఆకర్షించే అవకాశం ఉందని ఐ.పి.ఎఫ్.టి. ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయా ఉపరితలాల్లో వాడేందుకు ఆల్కహాల్ ప్రాతిపదికగా పనిచేసే “సూక్ష్మ క్రిమి సంహారక స్ప్రే”ని ఐ.పి.ఎఫ్.టి. రూపొందించింది. సూక్ష్మజీవులు, బాక్టీరియా, వివిధ రకాల వైరస్ ల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు ఈ స్ప్రే ద్రావణం, క్రిమిసంహారకంగా సమర్థంగా పనిచేస్తుంది. సంస్థ రూపొందించిన ఈ స్ప్రే క్రిములను సంహరించిన అనంతరం త్వర త్వరగా ఆవిరై పోతుందని, స్ప్రేని చల్లిన ఉపరితలాల్లో ఎలాంటి మరకలు, వాసన ఉండబోవని ఐ.పి.ఎఫ్.టి. తెలిపింది.

పండ్లు, కూరగాయల ఉపరితలాలపై మిగిలి ఉండే క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించి, వాటని కాలుష్యరహితం చేసే మరో స్ప్రే ద్రావణాన్ని కూడా ఐ.పి.ఎఫ్.టి. రూపొందించింది. పండ్లు, కూరగాయలు అనేవి మన ఆహారంలో ప్రధాన భాగం. ప్రతిరోజూ మనం తీసుకునే పోషకాహారంలో అవి కీలకపాత్ర వహిస్తాయి. పండ్లు, కూరగాయల సాగులో
విచక్షణారహతంగా వాడిన క్రిమి సంహారకాల అవశేషాలు ఒక్కోసారి వాటి ఉపరితలాలపై అలాగే మిగిలిపోతాయి. ఆలాంటి పండ్లు, కూరగాయలను యధాతథంగా మనం ఆహారంగా
తీసుకున్నపుడు ఆరోగ్యపరమైన ముప్పు తలెత్తే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో పండ్లు, కూరగాయలను ఆహారంగా వందశాతం సురక్షితంగా తయారు చేసేందుకు నీటిని కలిపి వాడుకునే ఒక ద్రావణాన్ని ఐ.పి.ఎఫ్.టి. రూపొందించింది. ఈ ద్రావణాన్ని ఉపయోగించి పండ్లు కూరగాయలను కాలుష్యరహితంగా చేయడం ఎంతో సులభం. పలుచబరిచిన ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను 15నుంచి 20నిమిషాలవరకూ నానబెడితే వాటిపై మిగిలి ఉన్న క్రిమిసంహారక మందుల అవశేషాలు తొలగిపోతాయి. ఎంతో సునాయాసమైన ఈ ప్రక్రియ పండ్లు, కూరగాయాలను సంపూర్ణంగా కాలుష్యరహితంగా చేస్తుంది.

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1991లో ఐ.పి.ఎఫ్.టి.ని స్థాపించారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అజమాయిషీలో,..రసాయనాలు, పెట్రో కెమికల్స్ శాఖ పరిధిలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఇది పనిచేస్తోంది. సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన క్రిమిసంహారక మందులను రూపొందించే దిశగా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థకు పరిపాలనాపరంగా నాలుగు విభాగాలు ఉన్నాయి. ఫార్ములేషన్ టెక్నాలజీ విభాగం, జీవ విజ్ఞానశాస్త్ర విభాగం, విశ్లేషణా వైజ్ఞానిక విభాగం, ప్రక్రియ రూపకల్పనా విభాగం అంటూ నాలుగు విభాగాలు ఐ.పి.ఎఫ్.టి. తరఫున పనిచేస్తున్నాయి.

*****

 


(Release ID: 1653574) Visitor Counter : 275