రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణ; రక్షణ మంత్రి అధ్యక్షతన మంత్రుల సాధికార బృందం నియామకం సూచనల నిబంధనలు కూడా జారీ

प्रविष्टि तिथि: 11 SEP 2020 5:55PM by PIB Hyderabad

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును (ఓఎఫ్‌బీ)ను సంపూర్ణ ప్రభుత్వ యాజమాన్యంతో; ఒకటి, లేదా అంతకంటే ఎక్కువ కార్పొరేట్ సంస్థలుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన మంత్రుల సాధికార బృందాన్ని (ఈజీవోఎం) కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు సహా మొత్తం ప్రక్రియను మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. హోంమంత్రి అమిత్‌ షా; ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌; చట్టం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌; కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ ఈ బృందంలో సభ్యులు.

మంత్రుల బృందం సూచన నిబంధనలు:
(1) ఓఎఫ్‌బీని ఒకటి, లేదా అంతకంటే ఎక్కువ రక్షణ శాఖ ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చడంపై నిర్ణయం
(2) జీతాలు, పెన్షన్లు సహా ప్రస్తుతమున్న వివిధ విభాగాల ఉద్యోగుల సంబంధిత అంశాలు
(3)  లాభదాయకత, స్వావలంబన దిశగా ఆ సంస్థ/సంస్థలకు మద్దతు ఇవ్వడం
(4) ఓఎఫ్‌బీ చేతిలో ప్రస్తుతం ఉన్న ఆర్డర్లు లేదా ఓఎఫ్‌బీలో ఏర్పాటైన సౌకర్యాలకు మినహాయింపు
(5) ఓఎఫ్‌బీ భూ సంబంధిత అంశాలు

    మంత్రుల సాధికార బృందం నియామకంపై ఓఎఫ్‌బీ సహా అనేక ఫెడరేషన్లు, యూనియన్లు, సంఘాలకు సమాచారం  అందింది. ఓఎఫ్‌బీ కార్పొరేటీకరణపై వారి సలహాలు, సూచనలను మంత్రుల బృందానికి తెలియజేయాలని సూచనలు వెళ్లాయి. 

    ఓఎఫ్‌బీ కార్పొరేటీకరణ ప్రక్రియకు సంబంధించి కన్సల్టెన్సీ ఏజెన్సీగా, కేపీఎంజీ అడ్వైజరీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కన్సార్టియం ముఖ్య సంస్థ), ఖైతాన్&కో లిమిటెడ్‌ను రక్షణ విభాగం నియమించింది. వ్యూహాత్మక, నిర్వహణ సంప్రదింపుల సేవలను అందించడం ఈ ఏజెన్సీ విధి.

***


(रिलीज़ आईडी: 1653441) आगंतुक पटल : 343
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil