రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాణ్యతతో రాజీ పడకుండా రోడ్డు నిర్మాణ వ్యయం తగ్గింపుపై దృష్టి: నితిన్ గడ్కరీ
రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వ మద్దతు కోసం ప్రపంచ స్థాయి సాంకేతిక
పరిజ్ఞానాన్ని వాడాలని పారిశ్రామిక వర్గాలకు కేంద్రమంత్రి సూచన
Posted On:
10 SEP 2020 6:53PM by PIB Hyderabad
రహదారుల నిర్మాణ వ్యయం తగ్గేలా చూస్తూ, నాణ్యతను మరింత మెరుగు పరచడమే ప్రభుత్వ విధానమని కేంద్ర రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, మరెంతో ఇంకా చేయవలసి ఉందని చెప్పారు. బిటుమన్- రోడ్డు నిర్మాణం అనే అంశంపై ‘బిటూ-కాన్ 2020’ పేరిట ఈ రోజు ప్రారంభమైన రెండు రోజుల వర్చువల్ సమావేశం, ఎగ్జిబిషన్ సందర్భంగా గడ్కరీ ప్రసంగించారు. భారత పారిశ్రామిక వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, రబ్బర్ వ్యర్థాల వినయోగాన్ని పెంచాలని పారిశ్రామిక రంగాన్ని కేంద్రమంత్రి కోరారు. ఇది పర్యావరణ రక్షణకు కూడా దోహదపడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్లలో ముడి ఖనిజంనుంచి ఉక్కును వేరు చేసిన తర్వాత మిగిలే ఆయిల్ స్లాగ్ వంటి వ్యర్థ పదార్థాలను కూడా రహదారుల నిర్మాణంలో వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. స్థానిక ఉత్పత్తులైన జనపనార, కొబ్బరి పీచు, ఇతర వ్యర్థపదార్థాలను రోడ్డు నిర్మాణంలో వాడవచ్చని, దీనివల్ల రహదారుల మన్నిక కాలం పెరుగుతుందని, వాహనాల రాకపోకలు కూడా మరింత మెరుగ్గా సాగడానికి వీలుంటుందని కేంద్రమంత్రి అన్నారు. ప్రీకాస్ట్ పద్దతిలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక నమూనాను రూపొందించగలదన్నారు.
రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించవలసిందిగా ఆయన పారిశ్రామిక రంగానికి సూచించారు. తారు రోడ్ల నిర్మాణానికి పదేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ వ్యవధితో కూడిన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన పారిశ్రామిక రంగాన్ని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవధి ఐదేళ్లు మాత్రమే ఉందన్నారు.
రహదారుల నిర్మాణంలో సంస్థలకు ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం అరమరికలు లేని విశాల దృక్పథాన్ని అనుసరిస్తుందని, ఫలితాలతో కూడిన, కాలబద్ధమైన, నాణ్యత కూడిన పనులకు మద్దతు ఇస్తుందని గడ్కరీ చెప్పారు. అనుమతులు ఇచ్చేదుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, తన ప్రతిపాదనలపై పారిశ్రామిక రంగమే ప్రభుత్వాన్ని ఒప్పించాలని అన్నారు. రోడ్ల నాణ్యత మెరుగుపడిన పక్షంలో, తారు రోడ్ల వాటా గ్రామపంచాయతీలనుంచి జిల్లా రహదారులకు, రాష్ట్ర రహదారులకు, జాతీయ రహదారులకు విస్తరిస్తుందని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం తలెత్తినప్పటికీ, ప్రభుత్వం వేగంగానే రోడ్ల నిర్మాణం సాగిస్తోందని, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులకు వేగంగానే ఆమోదం తెలుపుతూ వస్తోందని మంత్రి అన్నారు. ఈ కష్టకాలంలో కూడా రోడ్ల నిర్మాణ వేగం తగ్గలేదన్నారు.
రహదారుల నిర్మాణం వేగంగా సాగుతూండటంపట్ల ఫిక్కీ అధ్యక్షురాలు డాక్టర్ సంగీతా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, దేశంలో రహదారుల నిర్మాణం విషయంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తన లక్ష్యాలను అధిమించిపోయిందన్నారు.
***
(Release ID: 1653154)
Visitor Counter : 129