ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ వీధి వ్యాపారులతో ప్రధానమంత్రి సంభాషణ
Posted On:
09 SEP 2020 2:38PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిర్గ సహచరుడు శ్రీ హర్ దీప్ సింగ్ పూరీ జీ! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ సింగ్ జీ! రాష్ట్ర మంత్రివర్గంలోని మిగతా సభ్యులకు, పరిపాలనా యంత్రాగంతో ప్రమేయం ఉన్న అందరికీ, ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులందరికీ,మధ్యప్రదేశ్ నుంచి, మిగతా ప్రాంతాలనుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా ప్రియమైన సోదర, సోదరీమణులకు...
మొట్టమొదటగా, ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంత సేపటి కింద, కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. వారి భావాల వ్యక్తీకరణలో ఎంతో దృఢమైన నమ్మకం కనిపించింది. వారిలో ఆశాభావం కూడా తొణికిసలాడింది. ఇది,..ప్రధామంత్రి స్వనిధి పథకం సాధించిన అతిగొప్ప విజయం. పథకం బలంకూడా అదే. ఈ సందర్భంగా మీ శ్రమబలానికి, మీ ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి నేను గౌరవపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను.
ప్రధానమంత్రి స్వనిధి పథకంతో కలసి ముందుకు సాగుతున్న దేశంలోని నా మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రత్యేకించి, శివరాజ్ జీ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే,..మధ్యప్రదేశ్ లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే లక్షమందికిపైగా వీధి వ్యాపారులు స్వనిధి పథకం ద్వారా ప్రయోజనం పొందారు. వారి కృషివల్లనే ఇది సాధ్యమైంది.
కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం ఉన్నప్పటికీ అంత తక్కువ వ్యవధిలో నాలుగున్నర లక్షల వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు అందించడం ఎంతో గొప్ప కార్యక్రమం. ఈ విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని, ఉత్సాహంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాను. భారతదేశంలోని అన్ని నగరాల్లో వీధి వ్యాపారులుగా ఉంటున్న మన సోదర, సోదరీమణులందరికీ బ్యాంకులనుంచి డబ్బు అందేలా మిగతా రాష్ట్రాలన్నీ నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నాను.
మిత్రులారా,! ప్రపంచంలో ఇలాంటి సంక్షోభం సంభవించినపుడు.., లేదా ఏదైనా అంటువ్యాధి ప్రబలినపుడు, అందరికంటే ముందుగా, తొట్టతొలిసారిగా ప్రభావం పడేది మన పేద సోదరులు, సోదరీమణులపైనే. అత్యధికంగా వర్షాలు కురిసినా, చలి పెరిగినా, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినా పేదలే బాధలు పడతారు. ఉద్యోగం, ఉపాధి, ఆహార వస్తువుల విషయలో సంక్షోభం ఎదుర్కొంటారు. వారు ఎంతో కొంత ఆదా చేసుకున్న పొదుపు సొమ్మును కూడా పోగొట్టుకుంటారు. మహమ్మారి వైరస్ కూడా తనతపాటుగా ఈ సమస్యలన్నింటినీ తీసుకువచ్చింది. వైరస్ మహమ్మారి దాడితో మన పేద సోదరులు, సోదరీమణులు, కార్మిక మిత్రులు, మన సహచర వీధి వ్యాపారులు ఎంతో తీవ్రమైన బాధలు పడ్డారు.
తమ సొంత ప్రాంతాల్లో కాకుండా ఇతర నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది పేదలు మహమ్మారి దాడితో తమ స్వగ్రామాలకు తిరిగి రావలసి వచ్చింది. అందువల్ల, పేదల బాధలను నిర్మూలించేందుకు కరోనా మహమ్మారి వ్యాపించిన తొలి రోజునుంచి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవలసి వచ్చింది. తీవ్రమైన బాధల్లో ఉన్న ప్రజలకు ఆహారం, రేషన్ సరకులు అందించే బాధ్యతను దేశం తీసుకుంది. వారికి ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను కూడా అందించవలసి వచ్చింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. పేదలకోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఉన్నప్పటికీ, ఒక భారీ ప్రజా సమూహం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడింది. వారే,. వీధి వ్యాపారులుగా ఉంటున్న మన సోదర సోదరీమణులు. కరోనా కారణంగా మార్కెట్లు మూతబడ్డాయి. ప్రజలు బతుకు భయంతో తమ ఇళ్లకే పరమితం కావలసి వచ్చింది. దీనితో, వీధి వ్యాపారులైన మన సోదర, సోదరీమణుల వ్యాపారం అతి తీవ్రంగా దెబ్బతినింది. ఈ బాధలనుంచి వారిని గట్టెక్కించే లక్ష్యంతో ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆవిష్కృతమైంది.
ప్రజలు తాజాగా జీవితం మొదలుపెట్టి, తమ పనిని తిరిగి ప్రారంభించేందుకు వీలుగా వారికి సులభంగా పెట్టుబడిని అందుబాటులోకి తేవడమే ఈ పథకం ఉద్దేశం. వారు ఎక్కువ వడ్డీతో అప్పు కోసం వెళ్లకూడదన్నదే ఈ పథకం లక్ష్యం. లక్షలాది మంది వీధి వ్యాపారుల వ్యవస్థకు కొత్త గుర్తింపు లభించడం, ఒక సరైన మార్గంలో వ్యవస్థకు అనుసంధానం కావడం దేశంలో తొలిసారిగా జరిగింది. స్వయం ఉపాధికి స్వయం ఆర్థిక సహాయం అందించే ప్రయాణంలో స్వనిధి పథకం ముఖ్యమైన మైలురాయి వంటిది. స్వయం ఉపాధినుంచి, సొంత సామర్థ్యంపై నిలబడటం, చివరకు ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం ఇలాంటి మజిలీల్లో స్వనిధి పథకం ఒక ముఖ్యమైన మైలురాయి వంటిది.
మిత్రులారా!, స్వనిధి పథకం గురించి మీకు తెలియజెప్పాను. నాతో మాట్లాడిన వారందరికీ ఈ పథకం గురించి ఇపుడు బాగా తెలుసు. అయితే,..అవసరమైన వారంతా, అంటే ప్రతి వీధి వ్యాపారీ ఈ పథకంలోని ప్రతి అంశంపై అవగాహన ఏర్పరుచుకోవడం చాలా ఆవశ్యకం. అపుడు మాత్రమే మన పేద సోదర సోదరీమణులు ఈ పథకంతో ప్రయోజనం పొందగలుగుతారు.
ప్రతి సామాన్యుడూ ఈ పథకంతో అనుసంధానయ్యేలా స్వనిధి పథకాన్ని సరళతరం చేశారు. ఈ విషయంలో తన పని ఎంత సులభంగా పూర్తయిందో మన సోదరి అర్చనా జీ కూడా ఇంతకు ముందే చెప్పారు. తనకు ఎలాంటి కష్టం కూడా ఎదురుకాలేదు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో అలాంటి వ్యవస్థను రూపొందించారు. తమ దరఖాస్తును సమర్పించేందుకు వీధ వ్యాపారులెవరూ పొడవాటి క్యూలలో నిలుచుకోవాల్సిన అవసరమే లేకుండా ఈ వ్యవస్థను రూపొందించారు. రుణంకోసం మున్సిపాలిటీ, లేదా బ్యాంకు శాఖలోని కామన్ సర్వీస్ సెంటర్లలో మీ దరఖాస్తును అప్ లోడ్ చేయవచ్చు. అంతే కాదు...బ్యాంకు అధికారులు, లేదా మున్సిపల్ అధికారులు స్వయంగా మీ దగ్గరకే వచ్చి కూడా మీ దరఖాస్తులు స్వీకరిస్తారు. మీకు ఏ సదుపాయం ఉపయోగపడుతుందనుకుంటే దాన్నే వాడుకోవచ్చు. ఇలా.. వ్యవస్థను పూర్తి సరళతరం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
మిత్రులారా, మీరు మొత్తం గా వడ్డీ భారాన్ని వదిలించుకోగలిగిన పథకం ఇది. ఏమైనా, ఈ పథకం కింద వడ్డీపై 7 శాతం రిబేటు ఉంది. మీరు చాలా చిన్న , మౌలిక మైన అంశాలను మనసులో ఉంచుకుంటే , మీరు ఇదికూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదెలా అంటే, మీరు బ్యాంకుకు మొత్తాన్నిఏడాదిలోగా తిరిగి చెల్లించినట్టయితే మీకు వడ్డీలో రాయితీ లభిస్తుంది. అంతేకాదు, మీరు డిజిటల్ చెల్లింపులు చేస్తే, అంటే మొబైల్ ఫోన్ ద్వారా డబ్బు అందుకుంటూ చెల్లింపులు చేస్తే , హోల్ సేల్ వర్తకులకు లేదా మీరు సరుకు కొనుగోలు చేసిన వారికి మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేస్తే రివార్డు రూపంలో కొంత మొత్తం క్యాష్ బ్యాక్‌గా మీ ఖాతాలో జమ అవుతుంది. అలా కొంత మొత్తాన్ని ప్రభుత్వం విడిగా మీ ఖాతాలో జమ చే్స్తుంది. ఈ రకంగా మీ మొత్తం పొదుపు వడ్డీకంటే ఎక్కువ అవుతుంది.
అంతేకాదు, మీరు రెండోసారి రుణం తీసుకున్నట్టయితే, మీకు మరింత రుణ సదుపాయం కూడా ఉంటుంది. మీరు మొదటి సారి పది వేల రూపాయలు తీసుకుని, మీ పనితీరు సంతృప్తికరంగా ఉండి, మీకు రెండోసారి 15వేల రూపాయలు కావాలంటే , మీకు 15 వేల రూపాయలు వస్తుంది. ఆ రకంగా అది రూ 20,000, 25,000, 30.000కూడా కావచ్చు.ఈ సందర్భంగా మన చగన్‌లాల్‌జీ దీనిని పది రెట్లు అంటే, 1,00,000 వరకూ తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇది విని నాకు ఎంతో సంతోషం వేసింది.
మిత్రులారా, దేశంలో గత 3-4 సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపుల ధోరణి గణనీయంగా పెరిగింది.కరోనా సమయంలో దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో మనమందరం గ్రహిస్తూనే ఉన్నాము. ఇప్పుడు కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు చేయకుండా , నేరుగా మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అందువల్ల మన వీధి వ్యాపార మిత్రులు ఈ డిజిటల్ చెల్లింపుల విషయంలో వెనకబడకూడదు. మీరు దీనిని చేయగలరు. మనం చూశాం కుష్వాహ్‌జి తన చేతిలో క్యుఆర్ కొడ్ కార్ట్ ఉంచుకోవడాన్ని. ఇప్పుడు పెద్ద మాల్సులో కూడా (నగదు లావాదేవీలు) జరగడం లేదు. మన పేద ప్రజలు కొత్తది ఏది వచ్చినా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల బ్యాంకుల సహాయంతో , డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్ల సహాయంతో మపం కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు బ్యాంకులు, సంస్థల ప్రతినిధులు మీ చిరునామాకు, మీ బండ్ల వద్దకు వచ్చి మీకు క్యుఆర్ కోడ్ ఇస్తారు. దీనిని ఎలా వాడాలో కూడా వారు మీకు వివరిస్తారు. మీరు వీలైనంత ఎక్కువ లావాదేవీలను డిజిటల్‌గా చేసి, ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణగా నిలవాల్సిందిగా నేను వీధి వ్యాపార మిత్రులను కోరుతున్నాను.
మిత్రులారా, వీధులలో ఆహారపదార్ధాలు అమ్మే వెండర్ల వ్యాపార అవసరాలు తీర్చేందుకు , టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసేందుకు మేం ఒక పథకాన్నిసిద్ధం చేశాం. వీధులలోని ఆహారపదార్దాల విక్రయదారులు తమ కస్టమర్లకు పెద్ద పెద్ద రెస్టరెంట్‌ల లాగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఆహారపదార్ఢాలను పంపేలా కృషి జరుగుతోంది. త్వరలోనే మేం దీనిని ముందుకు తీసుకుపోతాం. వీధివ్యాపారులు,హాకర్ల వ్యాపారం బాగా పెరుగుతుందని, ఈ చర్యల వల్ల వారి రాబడి పెరుగుతుందని నేను గట్టి గా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా, వీధివ్యాపారులకు సంబంధించి మేం మరో పథకాన్ని వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం..
ప్రధానమంత్రి స్వనిధి పథకంతో అనుసంధానమైన వీధివ్యాపారులందరి జీవితాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరు కనీస మౌలిక సదుపాయాలు పొందుతారు. వీధివ్యాపార సోదర సోదరీమణులందరికీ ఉజ్వల పథకం కింద గ్యాస్ కనక్షన్ ఉందా లేదా చూస్తారు.అలాగే వీరికి విద్యుత్ కనక్షన్ ఉందా లేదా చూస్తారు. వీరు ఆయుష్మాన్ భారత్ యోజనతో అనుసంధానమై ఉంటే వారికి రోజుకు 90 పైసలు,నెలకు రూపాయి ఇన్సూరెన్సు పథకం ప్రయోజనాలు పొందుతున్నారా లేదా గమనిస్తారు. వారికి ఉండడానికి కాంక్రీటు ఇల్లు ఉందా లేదా అని చూస్తారు. ఈ పథకాలు అందడంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేస్తారు. ఇవేవీ లేని వారికి అవి దక్కేట్టు ప్రాధాన్యతనిస్తారు.
మిత్రులారా, మన దేశంలో పేదల గురించి ఎన్నో సార్లు చెబుతూ వచ్చారు. కానీ గత ఆరు సంవత్సరాలలో పేదలకు సంబంధించిన పనులు ఒక ప్రణాళిక ప్రకారం అమలుచేయడం జరుగుతోంది. అలా పేదలు ఒక పథకం నుంచి మరో పథకానికి అనుసంధానమయ్యేట్టు చూడడం జరుగుతోంది. దీనివల్ల పేదరికంపై పోరాడేందుకు వారికి సాధికారత కల్పించడం జరుగుతోంది. ఆరకంగా పేదరికాన్ని ఓడించి పేదరికం నుంచి బయటపడడానికి వారికి వీలు కల్పించడం జరుగుతోంది.ఈ దిశగా పలు చర్యలు ,పలు చొరవలు చేపట్టడం జరిగింది. ఇంతకు ముందు ఇలాంటివి జరగలేదు. ప్రతి ప్రాంతంలో,ప్రతి రంగంలో పేదలు బాధితులు, దోపిడీకి గురౌతున్నవారు,దళితులు, గిరిజనులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు వారికి అండగా నిలుస్తున్నాయి.
మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశంలోని పేదలు బ్యాంకులలో లావాదేవీలకు బోలెడు పేపర్ వర్కుకు భయపడి బ్యాంకు కు వెళ్లకపోయేవారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద 40 కోట్ల మంది పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం జరిగింది. ఈ జన్ ధన్ ఖాతాల ద్వారా మన పేదలు బ్యాంకులతో అనుసంధానమయ్యారు. ఫలితంగా వారు తక్కువ వడ్డీకి రుణాలు పొందగలుగుతున్నారు. తద్వారా వారు వడ్డీ వ్యాపారుల ఉచ్చునుంచి బయటపడ్డారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా పేదలు ఎలాంటి లంచం ఇవ్వకుండా ఇళ్లు పొందుతున్నారు. రైతులు నేరుగా తమ బ్యాంకు ఖాతాల ద్వారా ప్రత్యక్ష నగదు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో 20కోట్ల మంది సోదరీమణుల జన్‌ధన్‌ఖాతాలలో ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. జన్‌ధన్ యోజన ద్వారానే ఇది సాధ్యమైంది. అలాగే పది కోట్లకు పైగా రైతుకుటుంబాల ఖాతాలలో నేరుగా 94,000 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది.
మిత్రులారా !
ఇటీవలి కాలంలో, మన పేదలు తమనుతాము జన-ధన్ ఖాతాలతో మరియు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించుకోవడం ద్వారా కొత్త జీవితాలను ప్రారంభించారు. అతి త్వరలో, మన గ్రామాలు నగరాల తరహాలో ఆన్‌లైన్ మార్కెట్లతో కూడా అనుసంధానమవుతాయి, అప్పుడు, ప్రపంచ మార్కెట్ మన గ్రామాలకు చేరుకుంటుంది. ఈసారి, ఆగస్టు 15వ తేదీన, దేశం దీనికి సంబంధించి ప్రతిజ్ఞ చేసింది. రాబోయే 1,000 రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం కానున్నాయి. ప్రతి గ్రామం, ప్రతి ఇల్లూ, వేగంగా పనిచేసే ఇంటర్నెట్ ను కలిగి ఉంటాయి. డిజిటల్ విప్లవం యొక్క ప్రయోజనాలు గ్రామాలకు మరియు పేదలకు కూడా వేగంగా చేరుతాయి. ఇదే విధంగా దేశం డిజిటల్ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. ప్రతి జాతీయునికి ఒక ఆరోగ్య గుర్తింపు కార్డు లభిస్తుంది. మీ సమాచారం అంతా అక్కడ సురక్షితంగా ఉంటుంది. ఈ గుర్తింపు కార్డు ద్వారా, మీరు మీ వైద్యుడితో ఆన్ లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మీ ఆరోగ్య నివేదికలన్నీ, ఆన్ లైన్‌లో చూపించడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని ఇలా చూస్తారు. మొదట, ప్రధానమంత్రి సురక్షా బీమ యోజన ఉంది, ఆ తర్వాత, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా బీమా రక్షణ ఉంది. దీనితో పాటు, ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయల విలువైన ఉచిత చికిత్స కూడా ఉంది. ఇప్పుడు డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా సులభమైన చికిత్స అందించబడుతుంది.
మిత్రులారా
ప్రతి పౌరుని జీవితాన్నీ సులభతరం చేయాలని దేశం ప్రయత్నిస్తోంది, ప్రతి పౌరుడు అధికారం పొందుతాడు, అన్నింటికంటే ఎక్కువగా అతను స్వావలంబన కలిగి ఉంటాడు. నగరాల్లో మీలాంటి స్నేహితులకు సరసమైన అద్దెకు మంచి వసతి కల్పించడానికి ఇటీవల ప్రభుత్వం ఒక పెద్ద పథకాన్ని ప్రారంభించింది. ఒక దేశం, ఒక రేషన్ కార్డ్ పథకం ద్వారా, మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా మీ రేషన్ వాటాను మీరు పొందగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ హక్కు మీకు తోడుగా ఉంటుంది.
మిత్రులారా !
ఇప్పుడు, మీరు, మీ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నారు, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాకు వ్యాక్సిన్ లేనంత కాలం, దాని ప్రమాదాలు అక్కడే ఉంటాయి. అందువల్ల, మీరు మీ రక్షణతో పాటు, మీ కొనుగోలుదారుల రక్షణను కూడా గుర్తుంచుకోవాలి. మాస్కులు ధరించడం కానీ, చేతులు శుభ్రపరచుకోవడం కానీ, మీ చుట్టుపక్కల శుభ్రత కానీ, లేదా రెండు గజాల దూరం పాటించడం విషయంలో కానీ మీరు వేటితోనూ రాజీ పడవలసిన అవసరం లేదు. ఒక సారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా కూడా ప్రయత్నం చేయాలి. మీ బండి లేదా పేవ్ మెంట్‌పై కరోనా వ్యాప్తి చెందకుండా గరిష్ట రక్షణను మీరు నిర్ధారిస్తే, మీపై ప్రజల నమ్మకం పెరుగుతుంది, తద్వారా మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఈ నియమాలను మీరు పాటించాలి, వాటిని పాటించమని ఇతరులను కూడా అభ్యర్థించాలి. మరోసారి, మీ క్రొత్త జీవిత ప్రారంభానికి చాలా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీరు, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలననే ఈ ఆకాంక్షతో, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
అనేకానేక శుభాకాంక్షలు.
మీకు అనేక ధన్యవాదములు.
*****
(Release ID: 1653016)
Visitor Counter : 184
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam