కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 1 మొదలు సంక్షోభ సమయంలో 94.41 లక్షల పిఎఫ్ క్లెయిమ్ ల చెల్లింపు

15,000 లోపు వేతనదారులకు 75% కోవిడ్ అడ్వాన్సులు, 79% అనారోగ్య క్లెయిమ్ లు చెల్లింపు

Posted On: 08 SEP 2020 3:39PM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభ సమయంలో అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పెద్దమొత్తంలో  94.41 లక్షల క్లెయిమ్ లను పరిష్కరిస్తూ ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో సభ్యులకు రూ. 35,445  కోట్లు చెల్లించింది. ఇదే సమయంలో భవిష్యనిధి సంస్థ నిరుడు ఇదే సమయం ( ఏప్రిల్-ఆగస్టు 2019) కాలంలో కంటే 32% అధికంగా క్లెయిమ్ లు పరిష్కరించింది. ఆవిధంగా చెల్లింపు మొత్తం విషయానికొస్తే సుమారు 13%.శాతం అధికంగా చెల్లించింది.

సంక్షోభ సమయంలో సభ్యుల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారు సమస్యలనుంచి బైటపడటానికి వీలు కల్పిస్తూ క్లెయిమ్ ల పరిష్కారాన్ని వేగవంతం చేసింది,. కోవిడ్ అడ్వాన్సులతోబాటు అనారోగ్య సంబంధమైన క్లెయిమ్ లను సత్వరం పరిష్కరించింది. ఈ రెండు రకాల అడ్వాన్సులనూ ఆటోమేటిక్ పద్ధతిలో తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివలన క్లెయిమ్ పంపుకున్న మూడు రోజుల్లోనే చెల్లింపు జరపటానికి వీలైంది. మామూలుగా అయితే చట్టబద్ధంగా సెటిల్ చేయటానికి 20 రోజుల వ్యవధి ఉంటుంది.  గమనించాల్సిన విషయమేంటంటే ఏప్రిల్-ఆగస్టు మధ్య పరిష్కరించిన క్లెయిమ్ లలో 55% ఈ రెండు రకాల అడ్వాన్సులకు సంబంధించినవే. వీటిని కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టారు. 31% శాతం అడ్వాన్సులు ఈ కాలంలో అనారోగ్యానికి సంబంధించినవి.


వేతనాల వారీగా విశ్లేషించినపుడు కోవిడ్ అడ్వాన్సులలో దాదాపు 75%, అనారోగ్య సంబంధమైన క్లెయిమ్ లలో  79% పరిష్కారం పొందినవారు రూ. 15,000లోపు నెలవారీ జీతం అందుకుంటున్నవారే. సకాలంలో పి ఎఫ్ అడ్వాన్సులు లభించటం వలన చాలామంది అప్పులబారిన పడకుండా తమను తాము కాపాడుకోగలిగారు. ఆ విధంగా శ్రామికులలో ఆర్థికంగా బలహీనులైనవారికి కష్టకాలంలో సామాజిక భద్రత దొరికినట్టయింది. పాక్షికంగా ఉపసంహరించుకున్నవారు లేదా అడ్వాన్స్ పొందినవారి సంఖ్య ఈ కాలంలో రెట్టింపయింది. ఇపిఎఫ్ సమాచారాన్ని బట్టి చూస్తే నిరుడు ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలం కంటే ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో అడ్వాన్సులు 212% ఎక్కువకావటం కనిపించింది.

అడ్వాన్స్ క్లెయిమ్ ల సంఖ్య పెరగగా, పూర్తి స్థాయి సెటిల్మెంట్ కోరినవారి సంఖ్య దాదాపు 35% తగ్గటం గమనించవచ్చు. నిరుడు ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంతో పోల్చినప్పుడు ఈ ఏడాది అదే సమయంలో తగ్గటం గమనార్హం. పూర్తి స్థాయి అంతిమ సెటిల్మెంట్ అంటే ఉద్యోగులు తమ ఉద్యోగం మానివేసినప్పుడు, లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు చేసే చెల్లింపు. భవిష్యనిధి అడ్వాన్సుల చెల్లింపులు మూడు రోజుల్లోనే పూర్తి చేయటంతో ఇప్పుడు వచ్చి చేరుతున్న పి ఎఫ్ వసూళ్ళన్నీ  ద్రవ్య ఆస్తుల రూపంలో ఉంటున్నాయి. అందువలన సంక్షోభ సమయంలో చందాదారుల అవసరాలకు సకాలంలో చెల్లించగలిగే వీలుంటున్నది. సభ్యులు  భవిష్యనిధి సంస్థ పట్ల తమకున్న విశ్వాసానికి నిదర్శనంగా ఆర్థిక అవసరాలకోసం పూర్తి స్థాయి ఉపసంహరణ కంటే అడ్వాన్సులకే ఎక్కువగా మొగ్గు చూపారు.

పూర్తి స్థాయి సెటిల్మెంట్స్ కోరేవారి సంఖ్య తగ్గటం, అడ్వాన్సులు అడిగేవారు పెరగటానికి కారణాలు పరిశీలిస్తే భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు అవగాహన కల్పించటానికి  ప్రింట్, డిజిటల్ మాధ్యమాల ద్వారా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఫలితాల నిచ్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. పైగా ఈ సంక్షోభ సమయంలో 4880 వెబినార్లు కూడా నిర్వహించింది. ఆటోమేటిక్ క్లెయిమ్ ల పరిష్కార విధానం, ఉద్యోగాల మార్పిడి సమయంలో ఆటోమేటిక్ నిధుల బదలీ, బహుళ ప్రదేశాలలో క్లెయిమ్ ల పరిష్కార వెసులుబాటు, సభ్యుల కెవైసి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయటం, ఉమాంగ్ యాప్ ద్వారా క్లెయిమ్ చేసే వీలు, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యాధునిక వ్యవస్థ లాంటివి కూడా దానికి తోడయ్యాయి. సమూలమైన మార్పులతో కూడిన ఇలాంటి చర్యల ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన చందాదారులకు ఈ కష్టకాలంలో అండగా నిలబడటం, వారి విశ్వాసాన్ని చూరగొనటం సాధ్యమైంది.

***


(Release ID: 1652456) Visitor Counter : 190