ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్ఇపి 2020 అంశం పై గవర్నర్ల సమావేశం లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం

Posted On: 07 SEP 2020 2:16PM by PIB Hyderabad

నమస్కారం, 

గౌరవనీయులైన రాష్ట్రపతి, మంత్రిమండలి లో నా సహచరులు శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ నిశంక్ గారు, సంజయ్ ధోత్రే గారు, గౌరవనీయులైన గవర్నర్లు, లెఫ్టెనంట్ గవర్నర్లు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేయడంలో ఒక ముఖ్య పాత్ర ను పోషించిన డాక్టర్ కస్తూరి రంగన్ గారు, ఆయన బృందం, వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యావేత్తలు, ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్న మహిళలు మరియు సజ్జనులారా..

అన్నింటి కంటే ముందు, మాన్య రాష్ట్రపతి కి నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకొంటున్నాను.  
జాతీయ విద్యా విధానం సందర్భం లో, ఈ కార్యక్రమం నిర్వహణ ఎంతో ప్రాసంగికంగా, మహత్వపూర్ణమైందిగా ఉంది.  విద్యారంగం లో వందల సంవత్సరాల అనుభవం, ఒకే చోట కేంద్రీకృత‌మైంది.  సభాసదులందరికీ నేను స్వాగతం పలుకుతూ, వారిని అభినందిస్తున్నాను.

సర్,

దేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో విద్యావిధానం, విద్యా వ్యవస్థ ఒక ప్రధాన మాధ్యమంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇవన్నీ  విద్యావ్యవస్థకు ఉన్న బాధ్యత తో సంబంధాన్ని కలిగివుంటాయి. అయితే విద్యావిధానంలో ప్రభుత్వ జోక్యం, ప్రభావం అత్యంత కనిష్ఠంగా ఉండాలన్నది కూడా వాస్తవమే. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు విద్యావిధానం లో ఎంత అధికంగా భాగస్వాములు అయితే విద్యావిధానం ప్రాధాన్యం, ప్రాముఖ్యత లు కూడా అంతగా పెరుగుతాయి. 

జాతీయ విద్యావిధానం రూపకల్పన కోసం కృషి నాలుగైదు సంవత్సరాల క్రితమే ప్రారంభమయింది. దేశ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, విద్యారంగంలో అనుభవజ్ఞులైన వారు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు. విద్యావిధానం ముసాయిదాలోని భిన్న అంశాలపై కూడా రెండు లక్షల మంది కి పైగా వారి సలహాలను అందించారు. అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యారంగం మేనేజర్లు, వృత్తినిపుణులు అందరూ తమ సూచనలు అందించారు. విభిన్న వర్గాల ఆసక్తితో విస్తృత స్థాయిలో జరిగిన చర్చ నుంచి, మథనం నుంచి పుట్టిన జాతీయ విద్యావిధానాన్ని ప్రతి చోటా ఆహ్వానిస్తున్నారు. 

గ్రామీణ స్థాయిలో ఉపాధ్యాయుడు కావచ్చు లేదా పేరు ప్రతిష్ఠలు గడించిన విద్యావేత్త కావచ్చు, ప్రతి ఒక్కరూ జాతీయ విద్యా విధానాన్ని తమ సొంత విద్యావిధానంగా భావిస్తున్నారు. గతంలోని విద్యావిధానంలో తాము చూడాలని కోరుకున్న సంస్కరణలు ఇవే అని వారు అనుకొంటున్నారు. జాతీయ విద్యావిధానానికి సర్వత్రా ఆమోదం లభించడానికి గల ప్రధాన కారణం ఇదే.

విద్యావిధానం స్వభావాన్ని నిర్ణయించిన తరువాత జాతి మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ విద్యావిధానం, దాని అమలుపై దేశంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. విద్యావిధానం అనేది కేవలం పాఠశాలల ధోరణులకు సంబంధించిన సంస్కరణ కాకపోవడం వల్ల దానిపై సమగ్ర చర్చ అవసరం. 21వ శతాబ్దిలో సామాజిక అంశాలకు, ఆర్థికాంశాలకు కూడా ఈ విధానం ఒక కొత్త దిశ ను అందిస్తుంది. 

స్వయంసమృద్ధ భారత్ సంకల్పం, పోటీ సామర్థ్యాన్ని కూడా ఈ విధానం తీర్చి దిద్దుతుంది. ఆ అద్భుతమైన సంకల్పానికి దీటుగానే ప్రయత్నాలు, చైతన్యం అనుసంధానం కావాలి. మీలో చాలా మంది విద్యావిధానంలోని సూక్ష్మమైన అంశాలను అధ్యయనం చేసే ఉంటారు. ఇంత విస్తృతి గల సంస్కరణ ప్రయోజనం, లోతుపాతులపై నిరంతరాయంగా చర్చ జరగడం కూడా అవసరమే. అందరిలోనూ ఉన్న అనుమానాలను, ప్రశ్నలను నివృత్తి చేసిన అనంతరమే జాతీయ విద్యావిధానాన్ని దేశం లో విజయవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. 

సర్,
 
ఉపాధి రంగంలో శరవేగం గా చోటు చేసుకుంటున్న స్వాభావికమైన మార్పులను గురించి యావత్తు ప్రపంచం ఇవాళ విస్తృతంగా చర్చిస్తోంది. ఈ విధానం జ్ఞానాన్ని, నైపుణ్యాలను  పెంచి యువతను భవిష్యత్ అవసరాలకు దీటుగా సంసిద్ధులను చేస్తుంది.  చదవడం కన్నా నేర్చుకోవడానికి ఈ విద్యావిధానం పట్టం కడుతుంది. పాఠ్యాంశాలకు భిన్నమైన విమర్శనాత్మక ఆలోచన పెంచుతుంది. కేవలం ప్రక్రియలే కాకుండా ఆసక్తి, ఆచరణీయత, సాధనకు అధిక ప్రాముఖ్యత కల్పిస్తుంది. మౌలిక బోధన, భాషలు;  అధ్యయన ఫలితాలు, ఉపాధ్యాయ శిక్షణ అన్నింటి పైన దృష్టి సారిస్తుంది. ఈ విధానంలో సౌలభ్యం, మదింపు కోణంలో కూడా విస్తృతమైన సంస్కరణలు జరిగాయి. ప్రతి ఒక్క విద్యార్థి కి సాధికారత ను సమకూర్చే పద్ధతి ని ఈ విధానం సూచిస్తుంది. 

ఒక రకంగా మన విద్యావిధానాన్ని అన్నింటికీ ఒకే మంత్రం అనే ధోరణి నుంచి ఈ విధానం బయటకు తెస్తుంది. ఇది ఒక సాధారణమైన ప్రయత్నం కాదు, అసాధారణ ప్రయత్నం అని మీ వంటి ప్రముఖులందరూ కూడా భావిస్తారు. దశాబ్దాల నుంచి అమలుజరుగుతున్న మన విద్యావిధానంలో లోటుపాట్లను, సమస్యలను తొలగించేందుకు కూడా ఈ విధానంలో సమగ్ర చర్చ జరిగింది. బాలలు స్కూల్ బ్యాగ్ ల భారంతో కుంగిపోతున్నారని, బోర్డు పరీక్షలు కుటుంబానికి, సమాజానికి కూడా ఒక భారంగా మారాయని చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. సమర్థవంతమైన మార్గంలో ఈ విధానం ఆ సమస్యకు పరిష్కారం అందిస్తుంది. మన సంప్రదాయంలో ‘సా విద్యా యా విముక్తో’ అనే నానుడి ఉంది; ఈ మాటల కు మన మనసు ను విముక్తం చేసేదే జ్ఞానం అని భావం. 
  
పిల్లలు తమ సంస్కృతి, భాష, సాంప్రదాయాల తో ప్రాథమిక స్థాయి నుంచి అనుసంధానం అయితే ఆ విద్య అత్యంత సమర్థవంతం, సరళం కావడమే కాకుండా పిల్లలకు దానితో అనుబంధం ఏర్పడుతుంది. జాతీయ విద్యా విధానం లో ఎలాంటి ఒత్తిడులు, విరామం, ప్రభావం లేకుండా ప్రజాస్వామిక విలువలతో కూడిన బోధనా విలువల ను వాస్తవిక దృక్పథంతో జోడించే ప్రయత్నం జరిగింది. వివిధ అంశాల పట్ల విద్యార్థులపై ఉండే ఒత్తిడి ని పూర్తిగా తొలగించడం జరిగింది. 
 
ఇప్పుడు మన యువత కు తమ ఆసక్తి, యోగ్యతలకు అనుగుణంగా చదువుకునే వీలుంటుంది. గతంలో విద్యార్థులు ఒత్తిడికి లోనై తమ సామర్థ్యాలకు అతీతమైన విభాగాన్ని ఎంచుకోవలసి వచ్చేది. వారికి ఇది అర్ధం అయ్యే సమయానికి జాప్యం అయిపోయేది. దాని ఫలితంగా విద్యార్థి మధ్యలోనే దాన్ని వదులుకుని బయటకు వెళ్లడమో, లేదా ఏదో ఒక రకంగా డిగ్రీ పూర్తి చేశాడనిపించుకోవడమో జరిగేది. అది నేను అర్ధం చేసుకోగలిగాను. మన దేశం లో ఏర్పడిన సమస్యల పై మరింత అవగాహన నాకన్నా మీకు ఉంది. జాతీయ విద్యా విధానం లో ఆ సమస్యకు పరిష్కారం ఉన్నందు వల్ల  విద్యార్థులకు అధిక ప్రయోజనం కలుగుతుంది.

సర్, 

భారతదేశం స్వయంసమృద్ధం కావాలంటే యువల నిపుణులైన మానవ వనరులు కావడం అత్యంత ప్రధానం. బాల్య దశ నుంచి వృత్తి విద్యతో అనుసంధానం కావడం వల్ల యువత భవిష్యత్ అవసరాలకు మెరుగ్గా సిద్ధం అవుతారు. ఆచరణీయ బోధన వల్ల మన యువ మిత్రుల ఉపాధి సామర్థ్యం పెరగమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్ లో కూడా వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ‘ఆ నో భద్రాః క్రతవే యన్తు విశ్వతః’ అనే నానుడి ఒకటుంది. ఎవరి నుంచి వచ్చాయన్న అంశం తో సంబంధం లేకుండా కొత్త ఆలోచనల ను ప్రతి ఒక్కరూ అనుమతించాలన్నదే దాని అర్ధం. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ స్థాయి లో జ్ఞానానికి కేంద్రంగా భారతదేశం భాసిల్లింది. 21వ శతాబ్ది లో భారతదేశాన్ని మేథో సంపత్తి కేంద్రం గా తీర్చి దిద్దేందుకు మేం శ్రమిస్తున్నాం. ఈ సంకల్పం దిశ గా కొత్త విద్యావిధానం ఒక పెద్ద అడుగు అవుతుంది.

సాధారణ కుటుంబాలకు చెందిన యువత కోసం అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థల ఏర్పాటు కు, మేధావుల వలస నివారణ కు ఈ విద్యావిధానం ద్వారాలు తెరిచింది. అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థలు, క్యాంపస్ లు దేశంలో ఏర్పడినట్లయితే విద్యాభ్యాసం కోసం విదేశీలకు వెళ్లే ధోరణి తగ్గుతుంది. మన విశ్వవిద్యాలయాలు, కళాశాలల పోటీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆన్ లైన్ విద్య మరో ప్రధానాంశం. అది స్థానికం, అంతర్జాతీయం వంటి అన్ని పరిమితులను చెరిపేస్తుంది.

సర్, 

ఏ వ్యవస్థలో అయినా విస్తృతమైన మార్పులకు శ్రీకారం చుట్టినా, ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగు వేసినా అనుమానాలు, భయాలు కూడా ఏర్పడడం సహజం. వివిధ కోర్సులు పూర్తిగా రద్దయిపోతే విద్యార్ధులకు స్వేచ్ఛ ఉంటుందా?, వారికి కళాశాలల్లో ప్రవేశం లభిస్తుందా?, వారి కెరీర్ ఏమైపోతుంది? అని తల్లిద్రండులు భయపడిపోతారు. ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల మనసు లో కొత్త మార్పులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడం ఎలా?, కొత్త పాఠ్యప్రణాళిక ను నిర్వహించడం  ఎలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. 

 అనేక ప్రశ్నలు వస్తాయి.  మరి మీరు వాటిపై కూడా చర్చిస్తున్నారు.  చాలా వరకు ప్రశ్నలు ఈ విధానం అమలు కు సంబంధించినవే.  అవి ఎలాంటివంటే, పాఠ్యాంశాల ను ఎలా రూపొందించాలి?, సిలబస్ ను, కంటెంట్ ను స్థానిక భాషల్లో ఎలా తయారుచేయాలి?, దాని అమలు ఎలా? అనేటటువంటివి.  గ్రంథాలయాల విషయానికి వస్తే, ఈ విధానం లో ప్రతిపాదించిన డిజిటల్ విద్య, విద్య కు సంబంధించిన ఆన్ లైన్ కంటెంట్ ను ఎలా తయారుచేయడం ఎలా సంభవం అనేవి కీలక ప్రశ్నలు. వనరులు తగినంతగా లేకపోతే, లక్ష్యాలను మనం సాధించలేమేమో అనే భయాలు కూడా ఉన్నాయి. పాలనాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు కూడా మీ మనసుల్లో చెలరేగడం సహజమే. ఈ ప్రశ్నలు అన్నీ అత్యంత ప్రధానమైనవి కూడా.

ఈ ప్రశ్నలలో ప్రతి ఒక్క ప్రశ్న ను పరిష్కరించేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. విద్యా మంత్రిత్వ శాఖ స్థాయిలో నిరంతర చర్చ జరుగుతోంది. రాష్ట్రాల స్థాయి లో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను, ప్రతి ఒక్కరి సూచనలను విశాల దృక్పథం తో వినడం జరుగుతోంది. అంతిమంగా, మనం ఆ అనుమానాలను, భయాలను అన్నిటినీ తొలగించగలగాలి. దృక్పథంలో ఎంత మృదుత్వాన్ని ప్రదర్శించామో, అమలులో కూడా అంతే సరళత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంది. 

ఈ విద్యావిధానం ప్రభుత్వ విద్యావిధానం ఏమీ కాదు. ఇది ఈ దేశ విద్యావిధానం. దేశ రక్షణ, విదేశాంగ విధానాలు ఏ ఒక్క ప్రభుత్వానికి చెందనవిగా ఉండవో, విద్యావిధానం కూడా అధికారం లో ఉన్న ప్రభుత్వం ఏది అన్న దానితో సంబంధం లేకుండా యావత్తు దేశానిది అవుతుంది. 30 సంవత్సరాల అనంతరం వచ్చిన ఈ విద్యావిధానం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదు, ఇది దేశ ఆకాంక్షల కు ప్రాతినిధ్యం వహిస్తుంది.

సర్, 

త్వరిత గతి న మారుతున్న మార్పుల కు దీటు గా జాతీయ విద్యావిధానం లో భవిష్యత్తు ను పరిగణన లోకి తీసుకుని సమగ్ర ప్రతిపాదనలు చేయడం జరిగింది. గ్రామాలకు, నిరుపేదలకు, నిరాదరణకు గురవుతున్న వారికి, వెనుకబడిన, గిరిజన తెగల వారికి సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సమాచారం, జ్ఞానం పరిధి కూడా పెరుగుతున్నాయి. 

ఈ రోజున మన యువ మిత్రబృందాలు తమ వీడియో బ్లాగ్ లలోని వీడియో స్ట్రీమింగ్ సైట్ ల ద్వారా ప్రతి సబ్జెక్టు లోను మెరుగైన కోచింగును ఇవ్వడం నేను గమనించాను. ఒక పేద బాలుడు లేదా బాలిక ఊహకైనా రాని అంశం ఇది. సాంకేతిక పరిజ్ఞానం చేరడంలో ప్రాంతీయ, సామాజిక అసమతుల్యతలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయం, కళాశాల లో గరిష్ఠ స్థాయి లో సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత.

సర్,

నిర్వహణ నమూనా ఎలా ఉందనే దాన్ని బట్టి ఏ వ్యవస్థ సమర్థత, సమ్మిళితత్వం అయినా ఆధారపడి ఉంటాయి. నిర్వహణపరమైన అంశాల్లో కూడా అదే వైఖరి ని ఈ విధానం అనుసరించింది. సాంకేతిక లేదా వృత్తి విద్యారంగం ఏదైనా కావచ్చు విద్యావిభాగం అంతటినీ ప్రత్యేకించి ఉన్నత విద్యలోని అన్ని విభాగాలను చుట్టూ కమ్ముకుని ఉన్న బంధాల నుంచి విముక్తం చేసే ప్రయత్నం జరిగింది. పాలనా విభాగం లో కూడా పలు  అంచెల ను కనిష్ఠ స్థాయి కి తగ్గించి మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు ఈ విధానం కృషి చేసింది. ఈ విధానం ద్వారా ఉన్నత విద్య లో నియంత్రణ ను తొలగించి సరళతరం గా మార్చే ప్రయత్నం కూడా జరిగింది.  పనితీరు ఆధారంగా వాటిని ప్రోత్సహించడం లక్ష్యంగానే విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అంచెలంచెలుగా స్వయంప్రతిపత్తి ని కల్పించే  ప్రతిపాదన వచ్చింది. జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి-2020) లోని అంశాలన్నింటినీ తు.చ. తప్పకుండా అమలులోకి తేవడం మనందరి ఉమ్మడి బాధ్యత.

సెప్టెంబర్ 25 లోగా మీ రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాల్లో మరిన్ని వర్చువల్ సమావేశాలను నిర్వహించవలసిందిగా మీకు నేను ప్రత్యేకం గా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త జాతీయ విద్యా విధానం పై మెరుగైన అవగాహన ను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మీ అందరూ సమయం కేటాయించి హాజరైనందుకు మీ అందరికీ నేను మరో సారి నా కృత‌జ్ఞ‌త‌లను తెలియజేస్తున్నాను. 


మాననీయ రాష్ట్రపతి కి నేను మరో సారి నా కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తున్నాను. మీకు అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. 

ధన్యవాదాలు.


***



(Release ID: 1652249) Visitor Counter : 155