అంతరిక్ష విభాగం
చంద్రునిపై భూ వాతావరణ ప్రభావాన్ని సూచిస్తున్న చంద్రయాన్-1 చిత్రాలు
Posted On:
06 SEP 2020 6:12PM by PIB Hyderabad
చంద్రుడి ధృవాల వద్ద తుప్పు ఏర్పడుతున్నట్లు చంద్రయాన్-1 పంపిన చిత్రాల ద్వారా తెలుస్తోందని అంతరిక్ష శాఖ మంత్రి (స్వతంత్ర్య బాధ్యత) డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. చంద్రుడిపై ఇనుము పుష్కలంగా ఉన్న రాళ్లు ఉన్నట్లు మనకు తెలిసినా, నీరు, ఆక్సిజన్ ఉనికి గురించి ఇప్పటివరకు తెలీదని అన్నారు. ఇనుమును తుప్పు పట్టించడానికి నీరు, ఆక్సిజన్ అవసరమైన అంశాలని వెల్లడించారు.
భూ వాతావరణం చంద్రుడికి సాయం చేస్తోందని, అంటే భూ వాతావరణం చంద్రుడిని రక్షించగలదని చంద్రయాన్-1 చిత్రాల ద్వారా అర్ధమవుతోందని "నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్" (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే, చంద్రుని ధృవాలపై నీరుందని చంద్రయాన్-1 పంపిన సమాచారం సూచిస్తోంది. ఇలాంటి సమాచారం కోసమే శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2021 ప్రారంభంలో చేపట్టవచ్చని డా.జితేంద్ర సింగ్ చెప్పారు. చంద్రయాన్-2 తరహాలోనే చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ ఉంటాయని, ఆర్బిటర్ మాత్రం ఉండదని వెల్లడించారు.
మన దేశ మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం సన్నాహాలు సాగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. శిక్షణ, ఇతర ప్రక్రియలు కొనసాగుతున్నాయన్నారు.
కొవిడ్ కారణంగా గగన్‌యాన్ ప్రణాళికకు అవాంతరాలు ఎదురైనా, నిర్దేశిత 2022 నాటికి ప్రయోగం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డా.జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
***
(Release ID: 1651886)
Visitor Counter : 244