సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖద్దరు మాస్కులకు పెరిగిన ఆదరణ; రెడ్‌ క్రాస్‌ నుంచి పదిన్నర లక్షల మాస్కులకు మరోమారు ఆర్డర్‌ పొందిన కేవీఐసీ

Posted On: 31 AUG 2020 5:38PM by PIB Hyderabad

ఖద్దరు, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ), ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) నుంచి పదిన్నర లక్షల ఫేస్‌ మాస్కుల కోసం మరోమారు ఆర్డర్‌ పొందింది. కేవీఐసీకి ఇప్పటివరకు ఇదే పెద్ద ఆర్డర్‌. వేరే సంస్థకు 1.8 లక్షల ఆర్డర్‌ అందించిన నెలరోజుల్లోనే రెడ్‌ క్రాస్‌ నుంచి ఈ ఆర్డర్‌ వచ్చింది. రెడ్‌ క్రాస్‌కు ఇప్పటికే 1.6 లక్షల మాస్కులను కేవీఐసీ అందించింది.

    కొత్త ఆర్డర్‌ విలువ 3.3 కోట్ల రూపాయలు. ఈ వారంలోనే రెండో ఆర్డర్‌ పంపిణీ ప్రారంభమవుతుంది. మొదటి ఆర్డర్‌ను రెండు రోజుల్లో కేవీఐసీ పూర్తి చేస్తుంది. మొదటి ఆర్డర్‌లో ఇచ్చిన తరహాలోనే రెండో ఆర్డర్‌ ఫేస్‌ మాస్కులు ఉంటాయి. మొదటి ఆర్డర్‌ను ఉత్తమ నాణ్యతతో గడువులోగా అందిస్తుండడం వల్లే రెండో ఆర్డర్‌ వచ్చింది.

    మాస్కుల తయారీ ద్వారా దేశంలో స్థిర ఉపాధి సృష్టించినందుకు, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ కేవీఐసీని అభినందించారు. కరోనాను అడ్డుకోవడంలో సమర్థవంత సాధనంగా మాస్కులు మారడం వల్ల, వాటి తయారీ భారీ స్థాయి ఉపాధిని సృష్టించిందని అన్నారు.

    ఫేస్‌ మాస్కుల తయారీ, ఖద్దరు పనివారికి దాదాపు 50 వేల అదనపు పని దినాలను కల్పించింది. ప్రస్తుత ఆర్డర్‌ కోసం దాదాపు లక్ష మీటర్ల చేనేత ఖద్దరు వస్త్రం అవసరం. దీనిని వివిధ రాష్ట్రాల్లోని ఖద్దరు సంస్థలు సరఫరా చేస్తాయి. స్పిన్నింగ్‌, నేత కార్యక్రమాలకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది. నేతన్నలకు ఉపాధి దొరుకుతుంది.

    రెడ్‌ క్రాస్‌ నుంచి వచ్చిన కొత్త ఆర్డర్‌ను కేవీఐసీ ఛైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా స్వాగతించారు. "ఆర్థిక స్వాతంత్ర్యానికి రాట్నం ఒక సాధనం. ఇలాంటి కష్ట సమయంలో వచ్చిన ఆర్డర్‌, స్పిన్నింగ్‌, నేత పనిని ముందుకు తీసుకెళ్తుంది. ఖద్దరు పనివారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది" అని చెప్పారు.

    కేవీఐసీకి ఇప్పటివరకు ఇదే అతి పెద్ద ఆర్డర్‌. ఇంతకుముందు, జమ్ము&కశ్మీర్‌ ఏడు లక్షల మాస్కులు కొనుగోలు చేసింది. రాష్ట్రపతి భవన్‌, ప్రధాని కార్యాలయం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సాధారణ ప్రజల నుంచి ఈ పోర్టల్‌ ద్వారా కేవీఐసీ పునరావృత ఆర్డర్లు పొందుతూనే ఉంది.

    రెడ్‌ క్రాస్‌కు అందించే మాస్కులు వంద శాతం పత్తితో, రెండు పొరలతో, గోధుమ రంగులో, ఎరుపు రంగు పట్టీలతో ఉంటాయి. రెడ్‌ క్రాస్‌ అందించిన నమూనాల ఆధారంగా వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మాస్కుల ఎడమ వైపున రెడ్‌ క్రాస్‌ ముద్ర, కుడి వైపున ఖాదీ ఇండియా టాగ్‌ ఉంటాయి. ఇతర ఖద్దరు మాస్కుల్లాగానే, ఐఆర్‌సీఎస్‌కు అందించే మాస్కులను ఉతికి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఇవి శరీరానికి హాని కలిగించవు. మట్టిలో కలిసిపోతాయి.

 

******


(Release ID: 1650093) Visitor Counter : 161