పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఒడిశా కేంద్ర విశ్వవిద్యాలయంలో కొత్త సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేసిన పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పోఖ్రియాల్
Posted On:
29 AUG 2020 5:08PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ కలిసి.. ఒడిశా కోరాపుట్‌లోని కేంద్ర విశ్వవిద్యాలయం (సీయూవో)లో కొత్త సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేశారు. తరగతి గదుల సముదాయం, గ్రంథాలయం, సిబ్బంది నివాస సముదాయాలను ఇక్కడ నిర్మించనున్నారు.
ఒడిశాలో ఉన్నతస్థాయి విద్యకు ప్రధాన కేంద్రంగా సీయూవో మారుతోందని సంతోషం వ్యక్తం చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. ఒడిశాలో ఉన్నత స్థాయి విద్యపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారన్న కేంద్రమంత్రి.., ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సీఐపీఈటీ, ఎన్‌ఐఎస్‌ఈఆర్, ఐసీటీ-ఐవోసీఎల్ వంటి ప్రఖ్యాత విద్యాకేంద్రాలను ఒడిశాలో ఏర్పాటు చేశామన్నారు. ఒక ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమ-విద్య-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కొత్త విద్యావిధానం బలోపేతం చేస్తుందని చెప్పారు. కొరాపుట్‌లో గిరిజన వైవిధ్యం గొప్పదని కేంద్రమంత్రి చెప్పారు. విస్తృత, సృజనాత్మక బోధనలపై ఎన్‌ఈపీ-2020 దృష్టి పెట్టిందని, వెనుకబడిన విద్యార్థులకు మరిన్ని అవకాశాలను అందించేలా సీఈవోను ముందుకు నడిపిస్తుందని, పరిశోధన ఆధారిత గిరిజన, మానవ శాస్త్ర అధ్యయనాలను ప్రోత్సహిస్తుందని అన్నారు.
వ్యవసాయ పరిశోధనలు పెంచినందుకు, కోరాపుట్ అల్లం వంటి ప్రపంచ ప్రఖ్యాత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్తమ, పెద్ద మార్కెట్లను అన్వేషిస్తున్నందుకు శ్రీ ప్రధాన్ విద్యార్థులను అభినందించారు. ఒడిశాతోపాటు భారత్‌ను విజ్ఞాన మార్గంలోకి సీయూవో నడిపిస్తుందని, ఆత్మనిర్బర్ భారత్ సాధనలో మార్గదర్శి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా తన లక్ష్యాలు, పద్ధతులను మార్చుకున్న సీయూవోను చూసి సంతోషిస్తున్నా. సీయూవోలోకి ముఖ్యమైన విజ్ఞాన, సాంఘిక శాస్త్ర కోర్సుల చేరిక, ప్రస్తుత అధ్యాపకుల్లో నాణ్యతను మరింత పెంచుతుందని భావిస్తున్నా" అని కేంద్ర విద్యాశాఖ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశా కేంద్ర విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు, పాలన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 1649551)
Visitor Counter : 142