ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది - ఉపరాష్ట్రపతి
• వ్యవహారిక భాషాభివృద్ధి ద్వారా విజ్ఞానం అందరికీ అందాలని శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు ఉద్యమించారు
• తెలుగు భాషను కాపాడుకోవటమే శ్రీ గిడుగు వారికి అందించే నిజమైన నివాళి
• మాతృభాషా దినోత్సవం అంటే స్వాభిమాన దినోత్సవం
• పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరచిపోకూడదు
• యువతకు సంస్కృతిని, మాతృభాషను మరింత చేరువ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత
• సాంకేతిక రంగంలో నూతన మాతృభాషా పదాల సృష్టి జరగాలి
• నూతన జాతీయ విద్యావిధానం విద్యార్థుల సమగ్ర వికాసానికి ఊతమిస్తుంది
• శ్రీ గిడుగు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన “మన భాష – మన సమాజం – మన సంస్కృతి” అంతర్జాల సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
Posted On:
29 AUG 2020 3:24PM by PIB Hyderabad
ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష – మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ప్రారంభించిన ఆయన, శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవటం ముదాహమని తెలిపారు. మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లో ఉంటూ మాతృభాష కోసం తపిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు, అదే విధంగా ఈ కార్యక్రమ ఏర్పాటుకు చొరవ తీసుకున్న, పాల్గొన వారందరికీ అభినందనలు తెలియజేశారు.
బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపించిన శ్రీ గిడుగు వారు, విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో, వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారన్న ఉపరాష్ట్రపతి.. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని భావించారని.. పుస్తకాల్లోనూ సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని.. ఫలితంగా తెలుగు భాష దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతుందన్నదే వారి ఆకాంక్ష అని పేర్కొన్నారు. కొద్దిమందికే పరిమితమైన విద్య.. శ్రీ గిడుగు వారి ఉద్యమం కారణంగా అందరికీ చేరువైందని, పండితులకే పరిమితమనుకున్న సాహిత్య సృష్టి, సృజనాత్మకత ప్రజలందరి పరమయ్యాయని, మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహనీయుకి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.
మాతృభాష నేర్చుకోవడం మాట్లడటం కోసమే కాదన్న ఉపరాష్ట్రపతి, ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసిందని, మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు భాష లేకుండా పెంపొందలేవని తెలిపారు. భాష సమాజాన్ని సృష్టించి, జాతిని బలపరచి అభివృద్ధికి మార్గం వేస్తుందన్న ఆయన.. మన గతం, సంస్కృతి, చిరునామాలను భవిష్యత్ కు తెలియజేయడం భాష ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, చైనా, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయని, ఆయా దేశాల ఒరవడి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
20వ శతాబ్దం తొలినాళ్ళలో శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు, శ్రీ గురజాడ అప్పారావు, శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు, శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష వైభవాన్ని ఎలుగెత్తి చాటారన్న ఉపరాష్ట్రపతి, పిల్లలకు బోధించే విషయాలు వారి జీవితానికి వెలుగు చూపాలని, కేవలం పాండిత్యం కోసం ఉపయోగం లేని విషయాలను వారి చేత వల్లె వేయించటం ద్వారా కాలం వ్యర్థం అవుతుందన్న కొమర్రాజు వారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాని తెలిపారు. స్థానిక భాషల మీద ఆయా ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, నూతన జాతీయ విద్యావిధానం - 2020 సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ, భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా ఉందని అభిప్రాయపడ్డారు.
పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరువకూడదన్న పెద్దల సూక్తిని గుర్తు చేసిన ఉపరాష్ర్టపతి, మన సంస్కృతిని మరచిపోరాదని మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస.. మనమెప్పుడూ విడవరాదని, మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకుని, ఎక్కడ ఉన్నా శ్రద్ధగా జరుపుకోవాలని సూచించారు.
భాషను బట్టే జాతిని గుర్తిస్తారన్న ఉపరాష్ట్రపతి, సాంకేతిక రంగంలో నిపుణులుగా మారుతున్న విద్యార్థులు మాతృభాష పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ పరిజ్ఞానాన్ని సామాన్యులకు కూడా చేరువ చేయవచ్చని, ఫలితంగా శ్రీ గిడుగు వారు కలగన్న విజ్ఞాన, వికాసాలు సాధ్యమౌతాయని తెలిపారు. మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడమంటే ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదని, అన్ని భాషలను నేర్చుకుంటూ మాతృభాషను మనసులో నిలుపుకోవాలని తెలిపారు. భాష ద్వారా మంచి సంస్కృతి తద్వారా ఉన్నతమైన సమాజం సాకారమౌతాని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ శాసన సభ్యులు డా. రమేష్ చెన్నమనేని, తెలంగాణ జాగృతి సంస్థాపక అధ్యక్షులు శ్రీమతి కవిత, దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీ విక్రమ్ పెట్లూరు, జర్మనీలోని హైడల్‌బర్గ్ విశ్వవిద్యాలయ భాష, సాంకేతిక అంశాల శాస్త్రవేత్త శ్రీ గణేష్ తొట్టెంపూడి సహా వివిధ విశ్వవిద్యాలయాల సంచాలకులు, తానా, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్ బెర్రా – ఆస్ట్రేలియా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ – ఆస్ట్రేలియా, తెలుగు కళా స్రవంతి – అబుదాబి, కలోన్ తెలుగు వేదిక – జర్మనీ, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1649497)
Visitor Counter : 292