ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షణ సామగ్రి ఉత్పత్తిలో భారత స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్) అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
27 AUG 2020 7:06PM by PIB Hyderabad
నా మంత్రివర్గ సహచరుడు శ్రీ రాజనాథ్ గారు, సైనిక సిబ్బంది ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గారు, సైన్యం త్రివిధ దళాల అధిపతులు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు పరిశ్రమకు చెందిన మిత్రులు ... నమస్కారం
భారత రక్షణ ఉత్పత్తుల రంగంతో సంబంధం ఉన్న ముఖ్యమైన భాగస్వాములందరూ ఇక్కడ హాజరు కావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు రక్షణ మంత్రి రాజనాథ్ గానిని, ఆయన బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ సదస్సులో మీరంతా మీ మేధస్సుకు పదునుపెట్టి సమష్టిగా ఇచ్చే సలహాలు రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడుతాయి.
రక్షణ మంత్రి రాజనాథ్ గారు లక్ష్య సిద్ధితో పని చేయడం కూడా నాకు సంతోషాన్ని కలుగజేస్తోంది. ఆయన నిర్ణయాత్మక కృషి మంచి ఫలితాలు ఇవ్వగలదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను.
మిత్రులారా, గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో రక్షణ సామగ్రి దిగుమతి చేసుకొంటున్న ప్రధాన దేశాలలో ఇండియా ఒకటనే సంగతి దాపరికం లేని విషయం. స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో రక్షణ పరికరాల ఉత్పత్తిలో ఇండియాకు అపారమైన సామర్ధ్యం ఉండెడిది, ఇండియాలో 100 సంవత్సరాలకు పైబడిన రక్షణ ఉత్పత్తుల తయారీకి అవసరమైన స్థాపిత వ్యవస్థ ఉండేది. ఆ తరువాత ఎన్నో దశాబ్దాల పాటు ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం. ఒక రకంగా ఈ విషయంలో ఏమీ చేయకపోవడం పరిపాటి అయ్యింది. గట్టి ప్రయత్నం ఏదీ జరుగలేదు. మన తరువాత చాలా ఏళ్లకు మొదలైన దేశాలు గత 50 సంవత్సరాలలో ఎంతో ముందంజ వేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
గత కొన్ని సంవత్సరాలలో ఈ రంగాన్ని బంధవిముక్తం చేయడానికి సంకెళ్లను తొలగించడానికి గట్టి ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఉత్పత్తిని పెంచడం, కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం మరియు రక్షణ ఉత్పత్తుల క్షేత్రంలో ప్రయివేటు రంగం గరిష్ట ప్రగతిని సాధించడానికి కృషిచేయడం మా లక్ష్యం. అందువల్ల లైసెన్సింగ్ విధానంలో సంస్కరణలు, సమాన అవకాశాలు కల్పించడం, ఎగుమతి విధానం సరళతరం, వ్యవస్థాగత సంస్కరణలు మొదలైన పలు చర్యలు తీసుకోవడం జరిగింది.
మిత్రులారా, ఈ అన్ని చర్యల రక్షణ రంగాన్ని గురించి దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కొత్త అవగాహన పెంపొందగలదని నేను నమ్ముతున్నాను. దేశంలో ఒక కొత్త మైండ్సెట్ పుట్టుక మన అనుభవంలోకి రావడం మనం చూస్తున్నాం. స్వయం సమృద్ధ నవ భారతాన్ని నిర్మించడానికి రక్షణ రంగంలో ఆత్మవిశ్వాస స్ఫూర్తి ఉండటం సర్వోన్నతమైన విషయం. సైనిక సిబ్బంది ప్రధానాధికారి నియామకం గురించి దేశం చాలా రోజులుగా చర్చిస్తూ ఉంది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం నవభారతం ఆత్మ విశ్వాసానికి ప్రతీక.
చాలా కాలం పాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వలేదు. గౌరవనీయ అటల్ జీ ప్రభుత్వం తొలుత ఈ విషయంలో చొరవ చూపింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరిన్ని సంస్కరణలు తేవడం జరిగింది. ఇప్పుడు మొదటిసారిగా ఈ రంగంలో స్వయంచాలకంగా 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెట్టేందుకు ద్వారాలు తెరుస్తున్నాం. నవ భారతం పొందిన ఆత్మ విశ్వాసం వల్ల ఈ పరిణామం సాధ్యమైంది.
దశాబ్దాలుగా యుద్ధసామగ్రి ఫ్యాక్టరీలను ప్రభుత్వ శాఖల వాలే నడిపేవారు. ఆ రకమైన హ్రస్వ దృష్టి వల్ల దేశం ఇబ్బందులు పడటమే కాక అక్కడ పనిచేసే ప్రతిభావంతులు, కఠోర పరిశ్రమ చేసే అహుభవజ్ఞులైన శ్రామికవర్గం ఎంతో ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
కోట్లాది మందికి ఉపాధి కల్పించవలసిన ఈ రంగం కొద్దిమంది ఉద్యోగులకే పరిమితమై పోయింది. ఇప్పుడు మేము యుద్ధ సామాగ్రి ఫ్యాక్టరీలను కార్పోరేట్లుగా మార్చే దిశలో ముందడుగు వేస్తున్నాము. దీనివల్ల కార్మికులు మరియు సైన్యానికి ప్రేరణ లభిస్తుంది. నవ భారతం సాధించిన ఆత్మ విశ్వాసానికి ఇది రుజువు.
మిత్రులారా, రక్షణ ఉత్పత్తుల స్వావలంబన పట్ల మాకున్న కట్టుబాటు కేవలం చర్చలకు లేక కాగితాలకు మాత్రమే పరిమితం కాలేదు. వాటిని అమలు చేయడానికి అనేక నిర్దిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. సైనిక సిబ్బంది ప్రధానాధికారి (సి డి ఎస్) పదవిని సృష్టించడం వల్ల సామాగ్రి సేకరణలో త్రివిధ సైనిక దళాల మధ్య సమన్వయం పెరిగింది. అది రక్షణ సామగ్రి కొనుగోళ్లను పెంచడానికి తోడ్పడుతోంది. రానున్న రోజుల్లో దేశీయ పరిశ్రమకు ఆర్దర్లు పెరుగుతాయి. అది ఖశ్చితంగా అమలయ్యేలా చూసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టుబడిలో కొంత భాగం దేశంలో తయారైన సామగ్రి కొనుగోళ్ళకు కేటాయిస్తారు.
ఇటీవల రక్షణ సామగ్రిలో 101 వస్తువులను దేశీయంగా కొనుగోలు చేయాలని నిర్దేశించడాన్ని మీరు గమనించే ఉంటారు. రానున్న రోజుల్లో ఈ జాబితాను మరింత సమగ్రంగా మార్చి మరెన్నో వస్తువులను దానిలో చేర్చగలం. ఈ జాబితా తయారీ లక్ష్యం కేవలం దిగుమతులను పరిమితం చేయడం మాత్రమే కాదు ఈ చర్య ఉద్దేశం భారతీయ పరిశ్రమలను ప్రోత్సహించడం. ప్రయివేటు రంగం, ప్రభుత్వ రంగం, ఎం ఎస్ ఎం ఈ లేక అంకుర సంస్థలు ఏదైనా ప్రభుత్వ స్ఫూర్తి ఏమిటో, భవిష్యత్ అవకాశాలు ఏమిటో మిత్రులారా మీ అందరి ముందు తేటతెల్లం చేయడం జరిగింది.
అదేవిధంగా, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం , పరీక్షల యంత్రాంగం క్రమబద్ధం చేయడం మరియు నాణ్యతా అవసరాలను హేతుబద్ధం చేయడం గురించి మేము పనిచేస్తున్నాం. ఈ మా ప్రయత్నాలకు సైన్యంలోని త్రివిధ దళాల నుంచి సమష్టి సహకారం లభిస్తోంది. ఒక రకంగా వారిది క్రియాశీలక పాత్ర.
మిత్రులారా, అధునాతన సామగ్రిలో స్వావలంబన సాధించడానికి టెక్నాలజీ స్థాయిని పెంచడం తప్పనిసరి. తదుపరి తరం ఉత్పత్తులను తయారు చేయవలసిన ఆవశ్యకత ఉంది. దానిని సాధించడానికి రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ)తో పాటు ప్రయివేటు రంగాన్ని మరియు విద్యా సంస్థలలో పరిశోధన మరియు వినూత్న కల్పనలు పెంపొందించడాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతోంది. సాంకేతిక మార్పిడి సౌకర్యానికి బదులుగా విదేశీ భాగస్వాములతో ఉమ్మడి సంస్థలను ఏర్పాటు చేసి సహ ఉత్పత్తుల తయారీపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు విదేశీ భాగస్వామ్య సంస్థలు మార్కెట్ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియాలోనే ఉత్పత్తులు ప్రారంభించే ఉత్తమ వికల్పం ఉంది.
మిత్రులారా, మన ప్రభుత్వం మొదటి నుంచి సంస్కరణ, ఆచరణ, పరివర్తన అనే మంత్రంతో పని చేస్తోంది. రెడ్ టేపిజం తగ్గించి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో 2014 నుంచి చేపట్టిన సంస్కరణల తీరు, వ్యాపారం సౌలభ్యం మొత్తం ప్రపంచం గమనించింది. ఎంతో కష్టతరం మరియు సంక్లిష్టమైన మేధో హక్కులు, పన్నుల విధానం, దివాళా మరియు అప్పులు తీర్చలేని స్థితి, రోదసీ మరియు అణుశక్తి రంగాలలో కూడా మేము సంస్కరణలు తెచ్చాం. అంతేకాక ఇప్పుడు కార్మిక చట్టాలలో సంస్కరణల పరంపర కొనసాగుతున్న తీరు మీకు పూర్తిగా తెలిసిన సంగతి. అది నిరంతర ప్రక్రియ. .
కొన్నేళ్ల కిందటి వరకు వీటి గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు ఈ సంస్కరణలు ఆచరణాత్మకంగా మారాయి. సంస్కరణల ప్రక్రియ ఇక్కడితో ఆగదు. మేము మరింత ముందుకు సాగుతాం. అందువల్ల ఆగేది లేదు మరియు అలసట ఉండదు. నేను గాని మీరు గాని అలసట చెందాల్సిన పని లేదు. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మేము కట్టుబడి ఉన్నామని మా తరపున నేను మీకు చెప్తున్నాను.
మిత్రులారా, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి చూస్తే రక్షణ కారిడార్ల పని మెరుపు వేగంతో సాగుతోంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యంత అధునాతన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎం ఎస్ ఎం ఈ మరియు అంకుర సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మేము ప్రారంభించిన ఐడెక్స్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ వేదిక ద్వారా 50 అంకుర సంస్థలు సాయుధ దళాలకు అవసరమైన టెక్నాలజీని మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేశాయి.
మిత్రులారా, నేను మరొక విషయం స్పష్టం చేయదలిచాను. దేశంలో స్వావలంబన సాధించడం అంతర్ దృష్టితో కాదు. స్వావలంబన ఉద్దేశం వెనుక దేశాన్ని బలంగా మార్చడం ద్వారా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మరింత సుస్థిరంగా, ప్రతిఘాతుకంగా మార్చి ప్రపంచ శాంతికి పాటుపడాలన్న యోచన ఉంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన సాధించాలనే లక్ష్యం వెనుక కూడా అదే స్ఫూర్తి ఉంది. ఎన్నో మిత్ర దేశాలకు నమ్మకమైన రక్షణ సామాగ్రి సరఫరాదారు కాగల సామర్ధ్యం ఇండియాకు ఉంది. దానివల్ల వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలపడటమే కాక హిందూ మహా సముద్ర ప్రాంతంలో భద్రతను కల్పించేదిగా ఇండియా పాత్రను మరింత పటిష్టం చేయగలదు.
మిత్రులారా, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, కట్టుబాటు మీ ముందు ఉంది. అందరం కలసికట్టుగా సమష్టిగా కృషిచేసినప్పుడే స్వావలంబన ద్వారా ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిర్భవించాలన్న మన సంకల్పాన్ని నెరవేర్చుకోగలం. దేశం స్వావలంబన సాధిస్తే ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా లేక విదేశీ భాగస్వాములైనా అది అందరికీ గెలుపు దారులు తెరుస్తుంది. పని చేయడానికి అనువైన ఉత్తమ వ్యవస్థను కల్పించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది.
సదస్సులో మీ సూచనలు ఎంతో ఉపయోగకరం కాగలవు. రక్షణ సామాగ్రి తయారీ మరియు ఎగుమతుల ప్రోత్సాహక విధానం ముసాయిదాను మీ అందరికీ చూపినట్లు నాకు చెప్పారు. మీ ప్రతిపుష్టి ఈ విధానాన్ని సత్వరం అమలు చేయడానికి సహాయకారి అవుతుంది. ఇటువంటి సదస్సులు భవిష్యత్తులో కూడా జరగాలి. పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య నిరంతర చర్చలు, ప్రతిపుష్టి జరిగే స్వతస్సిద్ధ సంస్కృతి ఏర్పడాలి.
ఈ సమష్టి యత్నాల వల్ల మన సంకల్పం, తీర్మానాలు నెరవేరగలవని నేను నమ్ముతున్నాను. స్వయం సమృద్ధ భారత్ ఏర్పాటు కోసం మీ సమయాన్ని వెచ్చించి ఆత్మ విశ్వాసంతో ఈ సమావేశానికి హాజరైనందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు మనందరం మరింత మెరుగ్గా మన బాధ్యతలను నెరవేర్చగలమని నా నమ్మకం.
మరొక్కసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎన్నెన్నో ధన్యవాదాలు
****
(Release ID: 1649470)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam