భారత ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసకు ఘనంగా ఈసీఐ వీడ్కోలు

వివిధ న్యాయస్థానాల కీలక తీర్పుల ఆరో సంకలనాన్ని విడుదల చేసిన ఈసీఐ

Posted On: 28 AUG 2020 5:23PM by PIB Hyderabad

పదవికి రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసకు కేంద్ర ఎన్నిక సంఘం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడిగా మనీలాలో బాధ్యతలు చేపట్టనున్న కారణంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పదవికి రాజీనామా చేశారు. లావాస, 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈనెల చివరి వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

    లావాస మరిన్ని విజయాలు సాధించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుభాకాంక్షలు తెలిపారు. లావాసను కోల్పోవడం భారత్‌కు నష్టం, ఏడీబీకి లాభమని... కొవిడ్ తర్వాతి పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టే కష్టమైన విధి కోసం లావాస సామర్థ్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఆర్థిక శాఖలో పనిచేసినప్పుడు లావాసా కనబరిచిన ప్రతిభను కూడా అరోరా ప్రశంసించారు. కొవిడ్‌ సమయంలో ఎన్నికల నిర్వహణకు విస్తృత మార్గదర్శకాల రూపకల్పనలో లావాస మార్గదర్శనాన్ని అభినందించారు.

    ఎన్నికల సంఘంలో రెండున్నరేళ్ల ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా లావాస పేర్కొన్నారు. ఎన్నికల సంఘంలోనే కొనసాగాలా, లేదా ఏడీబీ వంటి అంతర్జాతీయ వేదికకు వెళ్లాలా అన్నది నిర్ణయించుకోవడం తనకు చాలా కష్టమైందన్నారు. డైరెక్టర్‌ విక్రమ్‌ బాత్రాకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఘనంగా వీడ్కోలు పలికింది.

    సుప్రీంకోర్టు సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన కీలక తీర్పుల ఆరో సంకలనాన్ని ఈసీఐ విడుదల చేసింది. 2017 జనవరి నుంచి 2019 మే వరకు, అంటే 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు ఇచ్చిన తీర్పులు ఈ సంకలనంలో ఉన్నాయి. ప్రజలందరికీ చేరడానికి, దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ వెర్షన్‌ https://eci.gov.in/ebooks/landmark-judgment/index.html ను కూడా ఈసీఐ విడుదల చేసింది. నామినేషన్లు, అఫిడవిట్లు, వీపీపాట్‌లు, ఎన్నికల నియమావళి, అవినీతి సహా ఇతర అంశాలపై న్యాయస్థానాలు ఇచ్చిన 29 కీలక తీర్పులు ఈ ప్రచురణలో ఉన్నాయి. గత ఐదు సంకలనాల్లో ప్రచురించిన తీర్పులను కూడా ప్రస్తుత ఆరో సంకలనంలో పొందుపరిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దాఖలైన 632 కేసులను కూడా చేర్చారు.

    "ఈ ప్రచురణ, ఎన్నికల చట్టం అమలులో మమ్మల్ని మరింత మెరుగుపరుస్తుందని, భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు ధైర్యాన్నిస్తుందని నేను ఆశిస్తున్నా” అని సీఈసీ సునీల్‌ అరోరా అన్నారు.

    ఈ ప్రచురణ, ఎన్నికల అమలు చట్టాలపై మరింత అవగాహన పెంచుతుందని లావాసా చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర అభిప్రాయపడ్డారు.

***



(Release ID: 1649334) Visitor Counter : 183