హోం మంత్రిత్వ శాఖ

ఈ రోజు పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగం స్వర్ణోత్సవం

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,..

చెక్కుచెదరని చిత్తశుద్ధితో దేశానికి 50ఏళ్ళకుపైగా సేవలందిస్తున్నందుకు అభినందనలు

పరిశోధన, అభివృద్ధి ద్వారా దేశ అంతర్గత భద్రత పటిష్టతకోసం

ఈ విభాగం కీలకపాత్ర పోషించిందన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

దేశ భద్రతలో కొత్త ఆలోచనా విధానం, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసు బలగాల సామర్థ్యం కీలకమని, ఆత్మనిర్భర భారత్ లక్ష్యసాధనకు చాలా ముఖ్యమని

కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

Posted On: 28 AUG 2020 4:46PM by PIB Hyderabad

పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం (బి.పి.ఆర్.అండ్ డి) రోజు స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. సందర్భంగా ఆన్ లైన్ లో వర్చువల్ గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం స్వర్ణోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగం యాబై ఏళ్లకు పైగా దేశసేవలో నిమగ్నమై ఉందని, చెక్కుచెదరని చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ భద్రతా భావనను, స్ఫూర్తిని కలిగించేలా ఆధునికమైన, పటిష్టమైన, సున్నితమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో ప్రశాంతతను, భద్రతను కాపాడే వ్యవస్థ నిర్వహణకు వేగంగా ముందుకు సాగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోటీపడి పనిచేయవలసి వస్తోందని, గతంలో పరిస్థితి లేదని మోదీ అన్నారుసాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ వనరులను సంతృప్త స్థాయిలో వినియోగించుకునేందుకు సృజనాత్మకత, పరిశోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని కూడా ప్రధాని అన్నారు. పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా, పౌరహితమైన పంథాలో పోలీసులు ముందుకు సాగేందుకు, తమ సామర్థ్యాలను పెంపొదించుకునేందుకు తమ నైపుణ్యాలను, పరిశోధనను, శిక్షణను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం చాలా ముఖ్యమన్నారు.

  స్వర్ణోత్సవం సందర్భంగా పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  అభినందనలు తెలిపారు. ఆయన ఒక సందేశమిస్తూ,..పరిశోధన, అభివృద్ధి రంగాల ద్వారా దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో  పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగం ఎంతో కీలకపాత్ర పోషించిందని అన్నారు. “దేశంలో బలమైన, అధునాతనమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటుకోసం నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగానికి సెల్యూట్ చేస్తున్నానుఅని అమిత్ షా తన సందేశంలో పేర్కొన్నారు.

  కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ,..కొత్త తరహా ఆలోచనా విధానం, ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భద్రతకు తగినట్టుగా పోలీసు బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నవ్య భారతావనికి, ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనకు చాలా ముఖ్యమన్నారు. వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో శాంతి భద్రతల మౌలిక సదుపాయాలను కూడా వేగవంతంగా మార్చుకోవలసిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. జైపూర్ లో కేంద్ర డిటెక్టివ్ శిక్షణా సంస్థను మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. స్టూడెంట్ పోలీస్ కేడెట్ల వెబ్ సైట్ ను ప్రారంభించారు. పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం స్వర్ణోత్సవం సందర్భంగా  ఒక తపాలా బిల్లనుసావనీర్ ను, ప్రత్యేక సంచికను కూడా  కేంద్రమంత్రి ప్రారంభించారు.

  కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా మాట్లాడుతూ, పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం గత ఐదు దశాబ్దాల్లో ఎంతో విలువైన సేవలు అందించిందని అన్నారు. నేరాల పరిశోధన, శాంతి భద్రతల వ్యవహారాలను అజమాయిషీ చేయడంలో భారతీయ పోలీసు బలగాలను మరింత వృత్తినైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు విభాగం ఎంతో కృషి చేసిందన్నారు. యువ విద్యార్థులు పోలీసు సంబంధమైన అంశాలను చేపట్టి, పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగంతో అనుబంధం సాగించేలా ప్రోత్సహించేందుకు రూపొందించిన శిక్షణా కార్యక్రమానికి (ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్.కు) కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగానికి అన్ని విషయాల్లో మార్గదర్శకంగా నిలిచేందుకు, తగిన మద్దతు ఇచ్చేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందన్నారు.

  పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగం డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె. కౌముది, తపాలా శాఖ కార్యదర్శి ప్రదీప్త కుమార్ బిసోయ్, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు, పోలీసు పరిశోధన అభివృద్ధి విభాగానికి చెందిన సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

  పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం 1970 ఆగస్టు 28 ఆవిర్భవించింది. భారత ప్రభుత్వం, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తీర్మానంతో విభాగం ఏర్పాటైంది. పోలీసింగ్.లో ప్రతిభ, పోలీసుల సమస్యలపై వేగంగా వ్యవస్థీకృతంగా అధ్యయనం చేయడం, పోలీసులు తమ విధి నిర్వహణలో అనుసరించే మెలకువల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన్ని వర్తింపజేయడం లక్ష్యాలుగా విభాగం ఏర్పాటైంది.

***

 


(Release ID: 1649328) Visitor Counter : 202