ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

35వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో డాక్టర్ హర్షవర్ధన్ డిజిటల్ ప్రసంగం

2022 నాటికి ప్రధాని ఆకాంక్షిస్తున్న నవభారత
సాఫల్యానికి లక్ష్యం నిర్దేశించుకొని పనిచేయాలి

Posted On: 25 AUG 2020 8:23PM by PIB Hyderabad

 

35వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా  న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ , జాతీయ నేత్ర నిధి ఏర్పాటు చేసిన వెబినార్ కు అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ డిజిటల్ విధానంలో ప్రసంగించారు.


ఢిల్లీ లోని ఎయిమ్స్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్తంగా చేపట్టిన జాతీయ అంధత్వం, దృష్టిలోపం సర్వే -2019 నివేదికను గుర్తు చేస్తూ, భారత్ లో 50 ఏళ్ళలోపు వాళ్లకు అంధత్వం రావటానికి కారణం కార్నియా అంధత్వమేనన్నారు. ఇలాంటి కేసులు 37.5% ఉన్నాయని, 50 ఏళ్ళు పైబడ్డవారిలో అంధత్వానికి ఇది రెండో పెద్ద కారణమని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 5% మంది కార్నియా జబ్బులవల్లనే అంధులవుతున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో సుమారు 68  లక్షలమంది కనీసం ఒక కంటిలో కార్నియా సంబంధ అంధత్వంతో బాధపడుతున్నారని, వాళ్లలో 10 లక్షలమందికి రెండు కళ్లలోనూ అంధత్వం ఉన్నదని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.


కార్నియా సంబంధ అంధత్వానికి కార్నియా మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం గనుక అవసరాలకూ, అందుబాటుకూ మధ్య అంతరాన్ని తగ్గించగలిగేలా జనంలో అవగాహన పెంచాలని ఈ వెబినార్ లో పాల్గొన్నవారికి మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం, ఫలితంగా ఏర్పడ్డ భయాల కారణంగా కొద్ది నెలలుగా నేత్రదానాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ, " అత్యవసరేత్యర వైద్య కార్యకలాపాలలో బాగా దెబ్బతిన్నది నేత్ర నిధుల వ్యవస్థే. అందుకే ఈ సంక్షోభం ప్రభావం దీనిమీద చాలా ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ సమయంలో భారత్ సహా వివిధ దేశాల నేత్రనిధి సంస్థల మార్గదర్శకాలు తాత్కాలికంగా దాతల కార్నియా సేకరణ నిలిపి వేయాలని సూచించాయి. అదే విధంగా కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలను సైతం నిలిపివేశాయి. దీనివలన కార్నియాల సేకరణ ఏప్రిల్, మే నెలల్లో దాదాపు శూన్యం కాగా కార్నియా మార్పిడు శస్త్ర చికిత్సలు 90% పడిపోయాయి" అన్నారు. కార్నియా దాతలనుంచి వైరస్ వ్యాపించే అవకాశమే లేదన్న వైద్యుల సలహాను డాక్టర్ హర్ష వర్ధన్ మరోమారు గుర్తు చేశారు.
కోవిడ్ సేవలతో సంబంధం లేని ఆస్పత్రుల ద్వారా కార్నియా సేకరణ కార్యక్రమం, నేత్రదాన కార్యకలాపాలు పునరుద్ధరించటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భారత నేత్ర నిధి సంఘం కార్నియా సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, అందులో పాల్గొనే వారు పాటించాల్సిన జాగ్రత్తలు  తెలియజేస్తూ సలహాలు, సూచనలతో కూడిన సమాచారం రూపొందించి పంపిణీ చేసినందుకు డాక్టర్  హర్ష వర్ధన్ అభినందించారు. 
అయితే భారత్ లాంటి అధిక జనాభా ఉన్నదేశంలో ప్రస్తుత గణాంకాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. గడిచిన ఆరు దశాబ్దాలకాలంలో సాధించని లక్ష్యాలను సాధించటానికి ప్రధానమంత్రి చేస్తున్న కృషి నుంచి అందరూ స్ఫూర్తిపొందాలని, నేత్ర దానాల్లోనూ, కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సల్లోనూ మరింత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. " అత్యవసర వైద్య విభాగాలు, మార్చురీల వంటి చోట వ్యూహాత్మకంగా కార్నియా సేకరణ బృందాలను నియమించటంతో సహా సమగ్రమైన వ్యూహం అనుసరించటాన్ని ప్రోత్సహించాలి" అన్నారు.  ఒక లక్ష్యం నిర్దేశించుకొని సుస్థిర ఫలితాలు సాధించటం ద్వారా ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నట్టు 2022 నాటికి నవభారతాన్ని నిర్మించాలన్నారు.


ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ లోని రాజేంద్ర ప్రసాద్ నేత్ర కేంద్రం చీఫ్ డాక్టర్ అతుల్ కుమార్, జాతీయ నేత్ర నిధి చైర్మన్ డాక్టర్ జీవన్ ఎస్ తితియాల్, పలువురు డాక్టర్లు, వివిధ వైద్య సంఘాల, సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి డిజిటల్ విధానంలో హాజరయ్యారు.

****



(Release ID: 1648700) Visitor Counter : 145