రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్రజా రవాణాలో ఆధునిక పద్ధతులు అనుసరించాలని; జీవ ఇంధనం, విద్యుత్‌, సీఎన్‌జీ వినియోగించాలని శ్రీ గడ్కరీ పిలుపు

Posted On: 24 AUG 2020 6:36PM by PIB Hyderabad

జీవ ఇంధనం, విద్యుత్‌, సీఎన్‌జీలను ఇంధనంగా వినియోగించడం ద్వారా ప్రజా రవాణాను ఆధునీకరించవచ్చని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ అన్నారు. 'నాలుగవ యూఐటీపీ ఇండియా బస్‌ సెమినార్‌' వెబినార్‌లో గడ్కరీ మాట్లాడారు. చాలా 'రాష్ట్ర రహదారి రవాణా సంస్థలు' (ఎస్‌ఆర్‌టీయూలు) సంప్రదాయ ఇంధనాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయని, అవి ఖరీదైనవని చెప్పారు. జీవ ఇంధనం, విద్యుత్‌, సీఎన్‌జీని రవాణా ఇంధనంగా వాడాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది ఇంధన వ్యయాన్ని తగ్గించడమేగాక, ఆర్థిక వ్యవస్థకు, కాలుష్య నియంత్రణకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం, ముడిచమురు లేదా హైడ్రోకార్బన్ల దిగుమతుల కోసం భారత్‌ భారీగా వ్యయం చేస్తోందని, దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని గడ్కరీ సూచించారు.

    జీవ ఇంధనం లేదా సీఎన్‌జీ వంటివాటి సామర్థ్యం గురించి చెబుతూ, 450 బస్సులను బయో ఇంధనానికి మార్చే ప్రక్రియను నాగ్‌పుర్‌ చేపట్టిందన్నారు. ఇప్పటికే 90 బస్సులను మార్చిందన్నారు. బస్సు సేవల నష్టం ఏటా రూ.60 వరకు ఉంటోందన్న గడ్కరీ, సీఎన్‌జీకి మారడం వల్ల ఆ నష్టం ఉండదని అన్నారు. మురుగునీటి నుంచి సీఎన్‌జీ ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. నష్టాలు తగ్గించుకోవడానికి ఈ తరహా విధానాలు అవలంబించాలని ఆర్‌టీసీలకు సూచించారు. సీఎన్‌జీ తయారీకి ఇతర మార్గాలైన ఎండుగడ్డి వంటివాటిని ఎంచుకోవాలని, దీనివల్ల రైతులు, రవాణా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు లాభమని కేంద్రమంత్రి చెప్పారు.

    ప్రజా రవాణాలో ప్రైవేట్ పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకునేలా 'లండన్‌ బస్‌' నమూనాను ఆచరించాలని గడ్కరీ సూచించారు. 'పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్' (పీపీపీ)ను కూడా కొనసాగించవచ్చన్నారు. బస్టాండ్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రజా రవాణా సమర్థతను పెంచుతాయన్నారు. సమయపాలన, బస్సుల్లో సంగీతం, సినిమాలు వంటివి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయని కేంద్ర మంత్రి గడ్కరీ వెబినార్‌లో తెలిపారు.

***(Release ID: 1648370) Visitor Counter : 138