ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సేతు ‘ఓపెన్ ఎపిఐ సేవ’ను ప్రవేశపెట్టింది; ప్రజలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు దోహదపడే సరికొత్త అంశం ఇది
50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఇండియాలో నమోదైన సంస్థలు, వ్యాపార వ్యవస్థలు ఈ సేవను పొందవచ్చు
సంస్థలు తమ ఉద్యోగుల లేదా ఇతర ఆరోగ్య సేతు యాప్ వినియోగదారుల ఆరోగ్య స్థితిని, వారి సమాచార గోప్యతా హక్కును ఉల్లంఘించకుండా, తెలుసుకునేందుకు ఓపెన్ ఎపిఐ అనుమతిస్తుంది
Posted On:
22 AUG 2020 3:08PM by PIB Hyderabad
కోవిడ్-19తో సహా కలసి జీవించడాన్ని నేర్చుకుంటున్న సరికొత్త సాధారణ స్థితికి మనం వెళ్తున్నందున ‘ఆరోగ్య సేతు’ బృందం ఓ సరికొత్త ఫీచర్ కోసం కృషి చేసింది. దాని పేరే ‘ఓపెన్ ఎపిఐ సేవ’. సురక్షితంగా ఉంటూ తమ వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించడానికి సంస్థలకు ఓపెన్ ఎపిఐ సేవ ఉపయోగపడుతుంది. ఆరోగ్య సేతు స్థితిని పరిశీలించుకోవడానికి, దానిని ‘ఇంటి నుంచి పని’ ఫీచర్లు అనేకంతో అనుసంధానించడానికి ఈ సరికొత్త ఫీచర్ ఆయా సంస్థలకు అవకాశం ఇస్తుంది. ఆరోగ్య సేతు యాప్ లోని ఓపెన్ ఎపిఐ ఫీచర్ కోవిడ్-19 సంక్రమణ భయాన్ని/ ప్రమాదాన్ని ఉద్ధేశించి పని చేస్తుంది. ప్రజలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి తిరిగి రావడానికి దోహదపడుతుంది.
ఆరోగ్య సేతు యాప్ 2020 ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్-19 వ్యతిరేక పోరాటాన్ని శక్తిమంతం చేస్తూ వచ్చింది. 15 కోట్లకు పైగా వినియోగదారులతో ‘ఆరోగ్య సేతు’ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కాంటాక్టు ట్రేసింగ్ యాప్ గా అవతరించింది. ప్రజలు ఇచ్చిన ఈ అసాధారణ మద్ధతు... కోవిడ్-19 వ్యాప్తి నిరోధ చర్యలు, నిర్వహణా కృషిలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్నవారికి, ప్రభుత్వానికి సహాయం చేయడంలో ఆరోగ్య సేతుకు ఎంతగానో ఉపయోగపడింది. 66 లక్షలకు పైగా బ్లూటూత్ సంబంధాలను కనిపెట్టడం జరిగింది. అందులో పరీక్షలు నిర్వహించినవారిలో సుమారు 27 శాతానికి కోవిడ్-19 పాజిటివ్ తేలింది. అందువల్ల ఆరోగ్య సేతు కేంద్రిత బ్లూటూత్ సంబంధాల వేట, పరీక్షల నిర్వహణ అత్యంత సమర్ధవంతమూ, ప్రభావవంతమూ అయ్యాయి. అదే విధంగా అనేక మంది ఇతరులకు జాగ్రత్తలు చెప్పడం, క్వారంటైన్ కు వెళ్లాలని సూచించడం జరిగింది. వైరస్ వ్యాప్తి గొలుసు కట్టును ఛేదించడానికి, ప్రాథమిక దశలోనే గుర్తించడానికి, ఇండియాలో మరణాల మోతాదు కనిష్టాలలో ఒకటిగా ఉండేలా చూడటానికి ఈ చర్యలు దోహదపడ్డాయి. ఆరోగ్య సేతు లోని ఇతిహాస్ (ITIHAS) సంకర్షణ ఫీచర్ ప్రదేశాల సమాచారాన్ని, ఆరోగ్య సేతు విశ్లేషణలను ఉపయోగించుకొని కొత్తగా అవతరిస్తున్న హాట్ స్పాట్లను సబ్ పిన్ కోడ్ స్థాయిలో అంచనా వేసింది. ఆరోగ్య విభాగపు అధికారులు, పరిపాలనా యంత్రాంగం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఈ సమాచారం చాలా ప్రభావవంతంగా ఉపయోగపడింది. అతి సూక్ష్మ స్థాయిలో.. అంటే 300 మీటర్లు x 300 మీటర్ల పరిధితో 30,000కు పైగా హాట్ స్పాట్లను గుర్తించి, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలతో పంచుకోవడం జరిగింది.
ఆరోగ్య సేతు యాప్ ప్రారంభించిన నాటి నుంచి... ఇ-పాస్ అనుసంధానం, క్యు ఆర్ కోడ్ స్కానింగ్, వ్యక్తి ఆరోగ్య స్థితిని కుటుంబం/ తెలిసిన వ్యక్తులతో పంచుకోవడం వంటి అనేక సరికొత్త ఫీచర్లను ఆవిష్కరించడం, ప్రవేశపెట్టడం నిరంతర ప్రక్రియగా సాగింది. ‘ఆరోగ్య సేతు- నేను సురక్షితం, మేము సురక్షితం, ఇండియా సురక్షితం’ అనే నినాదానికి అనుగుణంగా ఇండియాను, భారతీయులను భద్రంగా ఉంచడానికి ఈ అన్ని అంశాలూ చాలా ప్రభావవంతంగా దోహదపడ్డాయి.
ఓపెన్ ఎపిఐ సేవ
50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులతో ఇండియాలో నమోదైన సంస్థలు, వ్యాపార వ్యవస్థలు ఆరోగ్య సేతు యాప్ లోని ఓపెన్ ఎపిఐ సేవను ఉపయోగించుకోవచ్చు. తమ సంస్థలోని ఉద్యోగుల ఆరోగ్య స్థితిని లేదా తమ ఆరోగ్య సమాచారాన్ని పంచడానికి అంగీకారం తెలిపిన మరే ఆరోగ్య సేతు వినియోగదారు ఆరోగ్య స్థితినైనా... వాస్తవ సమయంలో తెలుసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ లో ప్రశ్నించడం ద్వారా ఓపెన్ ఎపిఐ సేవను పొందవచ్చు. ఆరోగ్య సేతు వినియోగదారు స్థితిని, పేరును మాత్రమే ఒపెన్ ఎపిఐ అందిస్తుంది (ఆ వినియోగదారు ఆమోదంతో). ఇతర వ్యక్తిగత సమాచారం ఏదీ ఈ ఎపిఐ ద్వారా లభించదు.
ఓపెన్ ఎపిఐ సేవ కోసం https://openapi.aarogyasetu.gov.in లింకులో నమోదు చేసుకోవచ్చు.
ఓపెన్ ఎపిఐకి సంబంధించిన సాంకేతిక ప్రశ్నలకు openapi.aarogyasetu[at]gov[dot]in లో సమాధానాలు పొందవచ్చు.
******
(Release ID: 1647952)
Visitor Counter : 312