సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ పేరును మోసపూరితంగా ఉపయోగించుకుంటున్నందుకు

‘ఖాదీ ఎస్సెన్షియల్స్’ & ‘ఖాదీ గ్లోబల్’ లకు
కె.వి.ఐ.సి. లీగల్ నోటీసులు జారీ చేసింది

Posted On: 21 AUG 2020 3:46PM by PIB Hyderabad

‘ఖాదీ ఎస్సెన్షియల్స్’, ‘ఖాదీ గ్లోబల్’ అనే రెండు సంస్థలకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) చట్టబద్ధంగా నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు ‘ఖాదీ’ అనే బ్రాండ్ పేరును ‘‘అనధికారికం’’గా, ‘‘మోసపూరితం’’గా ఉపయోగించుకుంటున్నాయని కెవిఐసి పేర్కొంది. ఆ రెండు సంస్థలూ ‘‘ఖాదీ’’ అనే బ్రాండ్ పేరును ఉపయోగించి అనేక రకాల సౌందర్య సాధనాలను, ఉత్పత్తులను పలు ఇ- కామర్స్ వేదికల ద్వారా విక్రయిస్తున్నాయని, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని కెవిఐసి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘ఖాదీ’’ బ్రాండ్ పేరుతో వాటి ఉత్పత్తులను అమ్మడం లేదా ప్రచారం చేసుకోవడం తక్షణమే నిలిపివేయాలని ఖాదీ ఎస్సెన్షియల్స్, ఖాదీ గ్లోబల్ సంస్థలకు ఆగస్టు మొదటి వారంలో పంపిన నోటీసులలో కెవిఐసి కోరింది. అలాగే ఆయా సంస్థల వైబ్ డొమైన్ పేర్లు www.khadiessentials.com, www.khadiglobalstore.com ను రద్దు చేయాలని సూచించింది. దాంతోపాటు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్, పింటరెస్ట్ వంటి సామాజిక మాధ్యమ వేదికలపై ఆయా సంస్థలకు ఉన్న అకౌంట్లను నిలిపివేయాలని కూడా ఆ రెండు సంస్థలకు కెవిఐసి స్పష్టం చేసింది.

‘‘ఆన్ లైన్ లో మీ ఉత్పత్తుల అమ్మకానికి వాడుకుంటున్న ఆ గుర్తు.. తప్పుడు ఉద్ధేశంతో పాల్పడిన అనుకరణేనని స్పష్టమవుతోంది. ఖాదీ ట్రేడ్ మార్కుకు ఉన్న మంచి పేరును, ప్రతిష్ఠను దుర్వినియోగం చేయడమే లక్ష్యమనీ స్పష్టమవుతోంది. ‘‘ఖాదీ’’ ట్రేడ్ మార్కును ఖాదీ ఇండియాతో పాటు సంస్థ అధికారిక లైసెన్సీ లేదా ఫ్రాంచైజీ పొందినవారు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది.’’ అని ఆ లీగల్ నోటీసులలో పేర్కొన్నారు. ‘‘కెవిఐసి ట్రేడ్ మార్కును కలిపేసుకున్నట్లుగా ఉన్న చిహ్నాన్ని ఉపయోగించి... ఆ సంస్థ ఉత్పత్తులను పోలిన ఉత్పత్తులనే విక్రయించడం నిస్సందేహంగా మార్కెట్లో గందరగోళానికి, మోసానికి దారి తీస్తుంది. మీరు ఆ చిహ్నాన్ని వినియోగించడం... ‘‘ఖాదీ’’ ట్రేడ్ మార్కును దుర్వినియోగం చేయడమూ, కనికట్టు చేయడమూ అవుతుంది.’’ అని ఆ నోటీసులలో స్పష్టం చేశారు.

‘‘ఖాదీ’’ బ్రాండ్ పేరు వాడుకొని చేస్తున్న ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని, ఖాదీ ఎస్సెన్షియల్స్, ఖాదీ గ్లోబల్ బ్రాండ్ పేర్లు ఉపయోగించిన ఉత్పత్తుల ప్యాకేజింగ్ సామాగ్రి, లేబుల్స్, ప్రచార సామాగ్రి, సైన్ బోర్డులు, ఇతర వ్యాపార స్టేషనరీ మొత్తాన్ని ధ్వంసం చేయాలని ఈ రెండు సంస్థలకు కెవిఐసి కచ్చితంగా చెప్పింది. ఏడు రోజుల లోపల ఈ సూచనలను అమలు చేయడంలో విఫలమైతే... ఆ రెండు సంస్థలపైనా చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని కెవిఐసి తెలిపింది.

‘‘ఖాదీ’’ పేరును దుర్వినియోగం చేయడం... ఇండియాలోని మారుమూల ప్రాంతాల్లో నిజమైన హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తున్న తమ కళాకారుల జీవనోపాధిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు. ‘‘ఖాదీ బ్రాండ్ పేరును దుర్వినియోగం చేసే ఏ సంస్థలు, వ్యక్తులపైన అయినా కెవిఐసి కఠిన చర్యలు తీసుకుంటుంది. ఖాదీ కళాకారుల ప్రయోజనాలు కాపాడటానికి, ఖాదీ పేరిట నకిలీ ఉత్పత్తుల అమ్మకాలను నిరోధించడానికే ఈ చర్యలు’’ అని సక్సేనా పేర్కొన్నారు.

గత కొద్ది సంవత్సరాల్లో తమ బ్రాండ్ పేరు ‘‘ఖాదీ ఇండియా’’ను దుర్వినియోగం చేసినవారికి, తమ ట్రేడ్ మార్కు విషయంలో ఉల్లంఘనలకు పాల్పడినవారికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించినట్లు కెవిఐసి తెలిపింది. తమ బ్రాండ్ పేరును దుర్వినియోగం చేసి ‘ఖాదీ’ పేరిట ఉత్పత్తులను అమ్మినందుకు కెవిఐసి ఇప్పటివరకు ‘ఫ్యాబ్ ఇండియా’ సహా 1000 కి పైగా ప్రైవేటు సంస్థలకు లీగల్ నోటీసులు పంపింది. ఫ్యాబ్ ఇండియా నుంచి రూ. 500 కోట్ల పరిహారాన్ని కెవిఐసి కోరింది. ఈ కేసు ఇప్పుడు బాంబే హైకోర్టు ఎదుట పెండింగ్ లో ఉంది.

తన ప్రతిష్టను దెబ్బ తీస్తూ నకిలీ ఖాదీ దుస్తులను అమ్మడం ద్వారా నిజమైన ఖాదీ కళాకారుల వేతనాలను నష్టపరిచినందుకు కెవిఐసి ఈ సంస్థల నుంచి నష్ట పరిహారాన్ని కూడా కోరింది. అయితే, గతంలో లీగల్ నోటీసులు జారీ అయ్యాక మెజారిటీ సంస్థలు ‘కెవిఐసి’కి క్షమాపణలు చెప్పి... మోసపూరితంగా ఖాదీ పేరు ఉపయోగించి అమ్ముతున్న ఉత్పత్తులను, వ్యాపార ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి.

ఖాదీ ఫేస్ మాస్కులుగా చెబుతూ అనధికారికంగా ఫేస్ మాస్కులు అమ్ముతున్న ఛండీగడ్ కు చెందిన ఒక వ్యక్తిపైన కెవిఐసి జూలై 27న ఎఫ్ఐఆర్ నమోదు కోసం ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఫేస్ మాస్కు ప్యాకెట్లపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను కూడా ఉపయోగించారు. అంతకు ముందు ఈ ఏడాది మే నెలలో, ఖాదీ బ్రాండ్ పేరుతో నకిలీ పిపిఇ కిట్లు అమ్ముతున్నందుకు ఢిల్లీకి చెందిన ముగ్గురికి కెవిఐసి లీగల్ నోటీసులు జారీ చేసింది.

*****


(Release ID: 1647670) Visitor Counter : 219