మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యార్థుల అభ్యాస వృద్ధి మార్గదర్శకాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన - కేంద్ర విద్యా మంత్రి.

Posted On: 19 AUG 2020 7:06PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు న్యూఢిల్లీ లో విద్యార్థుల అభ్యాస వృద్ధి మార్గదర్శకాలను, ఆన్ లైన్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో, పాఠశాల విద్యను ఇంట్లో పిల్లలకు డిజిటల్ మార్గాల ద్వారా తీసుకెళ్లడానికి, విద్యా మంత్రిత్వ శాఖలోని సంస్థలు కలిసి పనిచేశాయి.  ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్, ప్రజ్ఞాతా మార్గదర్శకాలు, డిజిటల్ విద్య - ఇండియా నివేదిక, నిష్ట-ఆన్ ‌లైన్ మొదలైన పత్రాలను, పిల్లలకు పాఠశాల విద్యలో కొనసాగింపును అమలుచేయడం కోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది.  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యార్థులకు పాఠశాల విద్యను అందించే ప్రయత్నాలు చేస్తూండగా, డిజిటల్ వనరులకు అందుబాటులో లేని పిల్లల అభ్యాసం గురించి వివిధ భాగస్వాముల నుండి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు, ఇంట్లో పాఠశాల విద్యను పొందడానికి డిజిటల్ వనరుల లభ్యత అసమానంగా ఉన్నట్లయితే, సమదృష్టి మరియు చేరిక యొక్క ఆందోళనలు పిల్లల అభ్యాసంలో లోపాలకు దారితీస్తాయని కూడా వెల్లడైంది.

 

ప్రస్తుత పరిస్థితులు మరియు కోవిడ్ #COVID19 ) అనంతర పరిస్థితుల్లో విద్యార్థుల ఉపయోగం కోసం ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి #NCERT ) రూపొందించిన విద్యార్థుల అభ్యాస వృద్ధి మార్గదర్శకాలను ప్రారంభించడం జరిగింది.   pic.twitter.com/hePrHAihCH 

— డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ (@DrRPNishank) 2020 ఆగష్టు ( August 19, 2020 )

ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల కోసం మరియు కోవిడ్ అనంతర పరిస్థితుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, విద్యార్థుల అభ్యాస వృద్ధి మార్గదర్శకాలను ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. సిద్ధం చేసింది.   ఈ మార్గదర్శకాలు, నమూనాలను ఈ క్రింద పేర్కొన్న మూడు రకాల పరిస్థితులకు అనుగుణంగా సూచించినట్లు మంత్రి తెలియజేశారు. మొదట, డిజిటల్ వనరులు లేని విద్యార్థులకోసం.  రెండవది, పరిమిత డిజిటల్ వనరులు అందుబాటులో ఉన్న విద్యార్థుల కోసం.  చివరగా, ఆన్‌ లైన్ విద్య కోసం డిజిటల్ వనరులు అందుబాటులో ఉన్న విద్యార్థులకోసం. 

వర్క్ బుక్సు, వర్క్ షీట్లు మొదలైన అభ్యాస సామగ్రిని ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద సేవకుల ద్వారా పిల్లల ఇంటి వద్ద పంపిణీ చేయడం ద్వారా, పాఠశాలతో కలిసి సమాజం పనిచేయాలని ఈ మార్గదర్శకాలు నొక్కి చెబుతాయని మంత్రి పేర్కొన్నారు.  కమ్యూనిటీ సెంటర్ల‌లో టెలివిజన్ల‌ను ఏర్పాటు చేసి, సామాజిక దూరం నిబంధనలను పాటించడం ద్వారా స్వచ్ఛంద సేవకులు లేదా ఉపాధ్యాయులు స్థానిక విద్యార్థులకు విద్య నేర్పించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

కమ్యూనిటీ సభ్యులు మరియు పంచాయతీ రాజ్ సహాయంతో కమ్యూనిటీ సెంటర్ల ‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు గురించి కూడా ఈ మార్గదర్శకాలలో ప్రస్తావించినట్లు శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు.  పిల్లల అభ్యాసానికి మద్దతు ఇవ్వడానికి మరియు పాల్గొనడానికి వీలుగా వారి  తల్లిదండ్రుల ధోరణిని ఇది  సిఫార్సు చేస్తుంది.  ఈ మూడు పరిస్థితులలోనూ, ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ వినియోగం మరియు అమలును సూచించడం జరిగింది.  ఈ మార్గదర్శకాలలో ఇచ్చిన సిఫార్సులు కేంద్రీయ విద్యాలయ సంగథన్, నవోదయ విద్యాలయ సమితి మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ వనరులపై ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. నిర్వహించిన సర్వే ఆధారంగా మరియు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కోసం తయారుచేసిన నిరంతర అభ్యాస ప్రణాళికపై ఆధారపడి ఉన్నాయి.

డిజిటల్ వనరులు లేని పిల్లలకు తమ ఉపాధ్యాయులతో లేదా వాలంటీర్లతో ఇంట్లో నేర్చుకునే అవకాశాలను పొందడానికి ఈ మార్గదర్శకాలు సహాయపడతాయని మంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు.   వీటితో పాటు, రేడియో, టీవీ, స్మార్ట్ ఫోన్ మొదలైనవి ఉపయోగించడం వంటి  వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంట్లో నేర్చుకుంటున్న విద్యార్థులందరి అభ్యాస లోపాలను అధిగమించడానికి మనం చేసే ప్రయత్నాలకు కూడా ఇది సహాయపడుతుంది.

విద్యార్థుల అభ్యాస వృద్ధి మార్గదర్శకాల కోసం ఇక్కడ "క్లిక్" చేయండి.    

*****



(Release ID: 1647174) Visitor Counter : 253