సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
నిర్మాణ పరికరాల తయారీలో అంతర్జాతీయ కేంద్రంగా మారటం మన లక్ష్యం: శ్రీ నితిన్ గడ్కరీ
చిన్నపరిశ్రమల బకాయిలు చెల్లించాలని పెద్ద పరిశ్రమలను కోరిన శ్రీ గడ్కరీ
చిన్న పరిశ్రమలు విడిభాగాల తయారీ యూనిట్లు పెంచాలని సూచన
Posted On:
18 AUG 2020 4:03PM by PIB Hyderabad
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ రంగ పరికరాలకు మన దేశాన్ని కేంద్రబిందువుగా మార్చటం మన లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రోడ్డు రవాణా, హైవేల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ( సిఐఐ) "నిర్మాణ రంగ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు, సమీకరణ" అనే వర్చువల్ ఎగ్జిబిషన్ మీద ఏర్పాటు చేసిన వెబినార్ లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్వావలంబన లక్ష్యం సాధించటం కోసం దిగుమతులు తగ్గించుకొని, ప్రస్తుతం దిగుమతులమీద ఆధారపడుతున్న ఆటోమొబైల్ రంగంలో అనేక విడి భాగాల తయారీని వేగవంతం చేయాలన్నారు. ఈ రంగంలో ఉన్న పరిశ్రమలు పారిశ్రామిక క్లస్టర్లు, టెక్నాలజీ కేంద్రాలు, పరిశోధన శాలలు అభివృద్ధి చేయాలని, నైపుణ్యాలను టెక్నాలజీని మెరుగుపరచాలని పిలుపునిచ్చారు.
భారత్ అంతటా టెక్నాలజీ కేంద్రాల అభివృద్ధికి అవసరమైన సహాయం చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పరిశ్రమలోని వారికి శ్రీ గడ్కరీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ధర తగ్గేలా పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు.
కోవిడ్ సంక్షోభం విసిరిన సవాళ్ళను ఎదుర్కోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి పిలుపునిచ్చారు. "యావత్ పారిశ్రామిక రంగం ఈ రోజు కోవిడ్ విసిరిన సవాళ్ళను ఎదుర్కుంటోంది. కానీ మనం ఆ సవాళ్ళను సానుకూల దృక్పథంతో ఎదుర్కొని ఆటోమొబైల్ పరిశ్రమను నిర్మాణ రంగ పరికరాల తయారీ కేంద్రంగా మార్చాలి. " అన్నారు. దీన్ని సాధించటానికి నాణ్యతతో రాజీపడకుండా ధర తగ్గించగలిగే పరిస్థితికోసం కృషి చేయటం తప్పనిసరి అను కూడా మంత్రి అన్నారు.
పరిశోధన, నవకల్పన, టెక్నాలజీ పెంపుదల అవసరాన్ని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో అవసరమైన చోట జాయింట్ వెంచర్లకు, విదేశీ భాగస్వామ్యాలకు సైతం మొగ్గు చూపాలన్నారు. అప్పుడే ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం , సులువుగా తగిన టెక్నాలజీ అందుబాటు సాధ్యమవుతుందన్నారు. ద్రవీకృత సహజవాయువు, సంపీడిత సహజవాయువు, జీవ ఇంధనాలు ఎక్కువగా వాడటం ద్వారా ఖర్చు బాగా తగ్గించుకోవచ్చునని సూచించారు. ప్రభుత్వం కూడా జల, వాయు, రైలు, రోడ్డు రవాణా మార్గాలన్నిటినీ సమీకృతం చేయటం మీద దృష్టి సారించటాన్ని శ్రీ గడ్కరీ గుర్తు చేశారు. దీనివలన పరిశ్రమలకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు.
ప్రధాని నిర్దేశించిన విధంగా స్వావలంబన (ఆత్మ నిర్భరత) సాధించటం కోసం విధానాలలో తగిన మార్పులు చేయటానికి ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించటంకోసం ఆ నిర్వచనాన్ని మార్చామన్నారు. దానివలన ఋణ సౌకర్యం, నిధుల అందుబాటు పెరుగుతుందని గుర్తు చేశారు. రవాణా రంగంలో కొత్త విధాన రూపకల్పన పనులు చురుగ్గా సాగుతాయన్నారు. పరిశ్రమలకు సాధ్యమైనంతగా సహకరించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమయంలో సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు రావాలని కోరారు. అప్పుడే మనం ఆటొమొబైల్ రంగంలో తయారీ హబ్ గా మారాలన్న కలను సాకారం చేసుకోగలుగుతామని మంత్రి శ్రీ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
పెద్ద పరిశ్రమలు తమకు అనుబంధంగా పనిచేస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల బకాయిలు చెల్లించటానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీన్ని పెద్ద పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ముఖ్యమైన అంశంగా పరిగణించాలని కోరారు. పెద్ద పరిశ్రమలకు అండగా విడిభాగాలు తయారు చేసి అందించే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సిఐఐ సభ్యులకు పిలుపునిచ్చారు.
***
(Release ID: 1646733)
Visitor Counter : 174