కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మరో 1000 రోజుల్లో దేశంలోని ప్రతి గ్రామాన్ని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వ్యవస్థతో అనుసంధానిస్తాము: ప్రధాని నరేంద్ర మోడీ
-లక్షద్వీప్ ను కూడా సముద్ర గరతో రానున్న వెయ్యి రోజుల్లో అనుసంధానిస్తామని ప్రకటించిన ప్రధాని
Posted On:
15 AUG 2020 4:55PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి గ్రామాన్ని రానున్న 1000 రోజుల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వ్యవస్థతో అనుసంధానిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు చేసిన తన ప్రసంగంలో ప్రకటించారు. 2014 సంవత్సరం కంటే ముందు దేశంలోని కేవలం ఐదు డజన్ల గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ ఉండేదని మోడీ అన్నారు . గత ఐదేళ్ల కాలంలో దేశంలోని దాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీల్లో ఈ కేబుల్ వ్యవస్థతో అనుసంధానించడం జరిగిందని అయన వెల్లడించారు . దేశ సంతులిత అభివృద్ధి కొరకు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో గ్రామీణ భారతదేశ భాగస్వామ్యం చాలా ముఖ్యమని దీన్ని సాధించడానికి అవసరమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తామని మోడీ అన్నారు . ఈ వ్యవస్థ దేశంలోని 6 లక్షల గ్రామాలకు రానున్న వెయ్యి రోజుల్లో చేరుకుంటుందని అయన అన్నారు . ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేసిన ఈ ప్రకటనపై తన కృతజ్ఞతను కేంద్ర ఎలెక్ట్రానిక్స్ , ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు . ' ఈ రోజు మీరు ( ప్రధాని మోడీ ) రానున్న వెయ్యి రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే బాధ్యతను టెలీకమ్యూనికేషన్ శాఖకు అప్పగించారు . ఈ కార్యక్రమం డిజిటల్ ఇండియా సాధనలో ఒక గేమ్ చేంజర్ కానుంది . మిమ్ముల్ని ప్రేరణగా తీసుకొని మేము మీరప్పగించిన లక్ష్యాన్ని సాదిస్తాము' అని అయన తన ట్వీట్ లో అన్నారు.
అంతేకాకుండా రానున్న వెయ్యి రోజుల్లో లక్షద్వీప్ ను సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థతో అనుసంధానిస్తామని కూడా ప్రధాని మోడీ తన 74 వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వెల్లడించారు . ' మన దేశంలో 1300 ద్వీపాలున్నాయని దేశాభివృద్ధిలో ఈ ద్వీపాల భౌగోళిక ప్రాంతం , ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త ప్రాజెక్టులను ఆయా ద్వీపాల్లో చేపట్టడానికి అవసరమైన ప్రక్రియ నడుస్తోందని అయన అన్నారు . ఈ ప్రక్రియలో భాగంగానే ఇటీవలే అండమాన్ నికోబర్ దీవుల్లో నాణ్యమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి సముద్ర గర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థతో అనుసంధానించడం జరిగిందని ఇలాంటి వ్యవస్థనే లక్షద్వీప్ లో కూడా ఏర్పాటు చేస్తామని' చారిత్రక ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో మోడీ అన్నారు . ఈ వారం ప్రారంభంలో దేశంలోనే తొలిసారిగా చెన్నై-అండమాన్ నికోబర్ దీవుల మధ్య ఢిల్లీ , చెన్నై వంటి నగరాల్లో ఉన్నటువంటి వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కేంద్రపాలిత ప్రాంతమైన నికోబర్ దీవుల్లో అందించడానికి ఏర్పాటు చేసిన సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వ్యవస్థను అయన ప్రారంభించారు . లక్షద్వీప్ లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి అవసరమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి శ్రీ ప్రసాద్ స్పందిస్తూ ' అండమాన్ నికోబర్ దీవుల్లో ఏర్పాటు చేసిన విధంగానే సముద్రగర్భ ఓఎఫ్సీ వ్యవస్థను లక్షద్వీప్ లో కూడా రానున్న వెయ్యి రోజుల్లో ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను తమ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ముమ్మరం చేస్తుంద'ని అయన తన ట్వీట్లో అన్నారు .
గ్రామాలను ఓఎఫ్సీ వ్యవస్థతో అనుసంధానించడం, లక్షద్వీప్ లాంటి ప్రాంతంలో సముద్రగర్భ ఓఎఫ్సీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు, లక్షద్వీప్ వాసులకు చౌకైన నాణ్యతతో కూడుకున్న ఇంటర్నెట్ సేవలను అందించే వీలు కలుగడంతో పాటు డిజిటల్ ఇండియా ద్వారా లభించే ఇతర ప్రయోజనాలైనటువంటి ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ ట్రేడింగ్, టూరిజం అభివృద్ధి నైపుణ్యాభివృద్ధి వంటి ప్రయోజనాలను కూడా పొందే అవకాశం లభిస్తుంది .
***
(Release ID: 1646351)
Visitor Counter : 311