ఆయుష్
రోగనిరోధక శక్తిపై ఆయుష్ నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన
Posted On:
14 AUG 2020 5:04PM by PIB Hyderabad
రోగనిరోధకశక్తి ఆవశ్యకతపై మూడునెలల అవగాహనా కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రారంభించింది. వెబినార్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 50వేలమంది పాలుపంచుకున్నారు. ప్రముఖ ఆధ్వాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన కీలక ప్రసంగం విశేషంగా నిలిచింది. ఆయుష్ అందించే పరిష్కార మార్గాలు ప్రపంచాన్నిమరింత ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా తీర్చిదిద్దగలవని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా, ఫిట్ నెస్ ఐకాన్, సెలెబ్రిటీ మిలింద్ సోమన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) సాంకేతిక వ్యవహారాల అధికారి డాక్టర్ గీతా కృష్ణన్, అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఎ.ఐ.ఐ.ఎ) డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ ఈ వెబినార్ లో ప్రధానంగా ప్రసంగించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ వర్చువల్ కన్వెన్షన్ సెంటర్ అనే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వేదికపై ఈ వెబినార్ నిర్వహించారు. ఆయుష్ మంత్రిత్వ శాక అధికారిక ఫేస్ బుక్ హ్యాండిల్ పై ఈ వెబినార్ ప్రత్యక్షంగా ప్రసారమైంది. మొత్తం 60వేలమంది ఈ వెబినార్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.
గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఈ వెబినార్ లో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంపొందంచుకోవలసిన అవసరాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. జీవిత కాలాన్ని పెంచడంలో ఆయుర్వేద, ఆయుష్ వైద్యవిధానాలకు ఉన్న శక్తి సామర్థ్యాలను కూడా ఆయన వివరించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, వెబినార్ ఇతివృత్తాన్ని, వివరించారు. ఆయుష్ పరిష్కార మార్గాల ద్వారా అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే అంశాన్ని ఆయన వివరించారు. రోగనిరోదక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రజలు తమ వ్యవహార శైలిని మార్చుకోవలసిన అవసరాన్ని గురించి పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సంప్రదాయ వైద్య విధానం నిర్వహించిన నిర్మాణాత్మక పాత్రను సోదాహరణంగా వివరించారు.
రోగనిరోధక శక్తికోసం ఆయుష్ వైద్య విధానాలు అన్న శీర్షికన మంత్రిత్వ శాఖ చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను రాజేశ్ కొటేచా వివరించారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ అనే అంశాలపై మిలింద్ సోమన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఎ.ఐ.ఐ.ఎ) డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ మాట్లాడుతూ,..కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో భాగంగా, తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి ఎ.ఐ.ఐ.ఎ. అనుభవాలను వెబినార్ సభ్యులతో పంచుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక పరిజ్ఞాన వ్యవహారాల అధికారి డాక్టర్ గీతా కృష్ణన్ మాట్సాడుతూ, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య అంశాలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. వ్యాధులు, అనారోగ్యం ప్రబలకుండా నివారించేలా వైద్యపరమైన మంచి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడమెలా? అన్న అంశాన్ని కూడా విపులంగా వివరించారు.
ప్రజలు విస్తృత స్థాయిలో పాలుపంచుకోవడం, వక్తల ప్రసంగాలకు మధ్య ప్రశ్నలు, జవాబుల రూపంలో అభిప్రాయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఈ వెబినార్ లో విశేషాలుగా నిలిచాయి. వెబినార్ లో సభికులనుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ప్యానెల్లో పలువురు నిపుణులు పాలుపంచుకున్నారు. కేంద్ర ఆయుర్వేద పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్,..ప్రొఫెసర్ వి.డి. కె.ఎస్. ధిమాన్, మురార్జీ దేశాయ్ జాతీయ యోగా అధ్యయన సంస్థ డైరెక్టర్,..డాక్టర్ ఈశ్వర్ వి. బసవరాద్ది, జాతీయ ప్రకృతివైద్యవిద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి కొమర్రాజు, సోవా-రిగ్పా జాతీయ పరశోధనా సంస్థ డైరెక్టర్ పద్మా గుర్మెత్, కేంద్రీయ యోగ, ప్రకృతివైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్ర ఎం. రావు, కేంద్ర యునానీ ఔషధ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీఖాన్, కేంద్ర సిద్ధ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. కనకవల్లి, హోమియో పతి పరిశోధనా కేంద్రీయ మండలి ఇన్ చార్జి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ ఖురానా ఈ ప్యానెల్ సభ్యులుగా ఉండి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సరళమైన విధానాల ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చున్న కీలక అంశాలను తమ సమాధానాల ద్వారా చక్కగా వివరించారు. ఆరోగ్య రక్షణ రంగంలో తాము కనుగొన్న అంశాలను, తమ అనుభవాలను వారు ప్రజలతో పంచుకున్నారు.
రోగనిరోధక శక్తి పెంపుదలకు, వ్యాధుల నిరోధానికి ఆయుష్ ఆధారంగా రూపొందిన వివిధ పరిష్కార మార్గాలపై విలువైన సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ వెబినార్ ను నిర్వహించారు. వెబినార్ ముగింపు సందర్భంగా రోగనిరోధక శక్తిపై ప్రజలకు ఇచ్చే సందేశాన్ని ప్రతి వైద్య నిపుణుడూ వినిపించారు. దైనందిన జీవితంలో అతి సరళమైన, సునాయాసమైన మార్గాలను అనుసరించడంద్వారా రోగాలనుంచి ఎలా దూరంగా ఉండవచ్చునే అంశాన్ని ఈ సందేశాలు తెలియజెప్పాయి.
***
(Release ID: 1645926)
Visitor Counter : 287