రాష్ట్రపతి సచివాలయం
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగ పాఠం
Posted On:
14 AUG 2020 7:30PM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా!
నమస్కారాలు!
1) 74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశ, విదేశాల్లో నివసించే భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు పదిహేను.. నాకు మువ్వన్నెల జెండా ఎగురవేసి, వేడుకలలో పాల్గొని, దేశభక్తి గీతాలను వినడం మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ రోజు దేశ యువత ఒక స్వతంత్ర దేశపు పౌరులుగా ఉన్నందుకు గర్వపడాలి. ఈ రోజు మనందరం ఒక స్వతంత్ర దేశంలో నివసించేలా చేసిన స్వాతంత్య్ర సమరయోధుల, అమరవీరుల త్యాగాలను మనం కృతజ్ఞతతో స్మరించుకోవాలి.
2) స్వాతంత్య్ర పోరాటపు స్ఫూర్తే ఆధునిక భారతానికి పునాది. దూరదృష్టి కలిగిన మన నేతలు ప్రపంచంలోని భిన్న ఆలోచనలను తెచ్చి ఒక్క ఉమ్మడి జాతీయ స్ఫూర్తిని నిర్మించారు. వారు అణచివేతకు గురిచేసే విదేశీ పాలన నుంచి భారత మాతను విముక్తం చేసేందుకు నిబద్ధులై పని చేశారు. మన పిల్లల భవిష్యత్తును మెరుగు పరిచేందుకు పని చేశారు. వారి ఆలోచనలు, ఆచరణలే భారత్ ను ఒక ఆధునిక దేశంగా తీర్చి దిద్దాయి.
3) మహాత్మా గాంధీ మన స్వాతంత్ర సమరానికి దారి దీపం కావడం మనందరి అదృష్టం. ఆయన రాజకీయ నాయకుడే కాకుండా మహాఋషి కూడా. ఆయన ఈ దేశంలో మాత్రమే అవతరించిన ఒక మహావ్యక్తి. సామాజిక సంఘర్షణలు, ఆర్థిక సమస్యలు, వాతావరణ మార్పులతో సతమతమౌతున్న ప్రపంచం ఆయన బోధనల నుంచి ఊరటను పొందుతోంది. న్యాయం, సమానత్వాల గురించి ఆయన జరిపిన అన్వేషణ మన గణతంత్రానికి ఒక మంత్రం. యువతరం గాంధీజీని మళ్లీ అన్వేషిస్తుండటం చూసి ఆనందం కలుగుతోంది.
ప్రియమైన తోటి పౌరులారా..
4) ఈ సంవత్సరం స్వాతంత్య్రోత్సవాలు పరిమితుల మధ్య జరుగుతున్నాయి. యావత్ ప్రపంచం అన్ని కార్యకలాపాలను స్తంభింపచేసి, అనేక ప్రాణాలను బలికొన్న ప్రమాదకర వైరస్ ను ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి రావడానికి ముందు మనం జీవించిన ప్రపంచాన్ని ఈ వైరస్ పూర్తిగా మార్చివేసింది.
5) ఈ భయంకరమైన సవాలును ముందుగానే ఊహించి, కేంద్ర ప్రభుత్వం ప్రభావవంతంగా, సకాలంలో స్పందించడం చాలా నిబ్బరాన్నిస్తుంది. ఇంత సువిశాలమైన, వైవిధ్యభరితమైన, భారీ జనాభాతో కూడిన దేశం ఈ సవాలును ఎదుర్కోవాలంటే చాలా పెద్ద ప్రయత్నాలు అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తమ స్థానిక పరిస్థితుల మేరకు చర్యలు తీసుకున్నాయి. ప్రజలు కూడా దీనిని మనస్ఫూర్తిగా సమర్థించారు. నిబద్ధతతో కూడిన మన ప్రయత్నాల వల్ల మనం మహమ్మారి తీవ్రతను నియంత్రించడంలోనూ, ప్రాణనష్టాన్ని తగ్గించడంలోనూ సఫలమయ్యాం. ఇది ప్రపంచానికే అనుసరణీయం.
6) ఈ జాతి వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నిరంతరాయం ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు జాతి ఋణపడి ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారితో పోరాడుతూ వీరిలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. వారు మన జాతీయ కథానాయకులు. కరోనా పోరాట వీరులందరూ భూరి ప్రశంసలకు అర్హులు. వారు తమ వృత్తిధర్మాన్ని దాటి వెళ్లి పని చేశారు. అత్యవసర సేవలను అందించారు. ఈ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, విపత్తు నిర్వహణ బృందాల సభ్యులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, డెలివరీ సిబ్బంది, రవాణా, రైల్వే, వైమానిక రంగ సిబ్బంది, వివిధ సేవలను అందించేవారు, ప్రభుత్వోద్యోగులు, సామాజిక సేవా సంస్థలు, ఉదారులైన పౌరులు సాహసం, నిస్వార్థ సేవల ప్రేరణాస్పద గాథలను రచిస్తున్నారు. నగరాలు, పట్టణాలు నిశ్శబ్దం అయిపోయినప్పుడు, వీధులు ఖాళీ అయిపోయినప్పుడు కూడా వారు అలసట లేకుండా పని చేస్తున్నారు. ప్రజలకు వైద్య సేవలు, ఊరట, నీటి సరఫరా, ప్రసార వ్యవస్థలు, పాలు, కూరగాయలు, ఆహార పదార్థాలు, కిరాణా సరకులు, మందులతోపాటు, ఇతర అత్యవసర సేవలను అందిస్తున్నారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన జీవితాలను, జీవికలను కాపాడేందుకు పని చేస్తున్నారు.
7) ఈ సంక్షోభం కొనసాగుతూండగానే అంఫన్ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశాలను తాకింది. విపత్తు నిర్వహణ బృందాలు, కేంద్ర, రాష్ట్ర సంస్థలు, జాగరూకులైన పౌరుల సమన్విత ప్రయత్నాల వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగాం. వరదలు ఈశాన్య భారతం, తూర్పు ప్రాంత రాష్ట్రాల ప్రజా జీవనాలను చిన్నాభిన్నం చేశాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల దాడిలోనూ అన్ని వర్గాల వారూ ముందుకు వచ్చి బాధితులకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం ఆనందకరం.
ప్రియమైన తోటి పౌరులారా..
8) నిరుపేదలు, దినసరి కూలీలు ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ సంక్షోభ దశలో వారికి చేయూతనందించేందుకు వైరస్ నియంత్రణ ప్రయత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి పొందగలిగేలా, మహమ్మారి ఫలితంగా ఉపాధి కోల్పోవడాన్ని, వలసలను, పూర్తి విచ్ఛిన్నాన్ని ఎదుర్కొనేలా చేసింది. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజం, పౌరుల పూర్తి సహకారంతో వివిధ కార్యక్రమాలను అందిస్తూ చేయూతనిచ్చే ప్రక్రియను కొనసాగిస్తుంది.
9) ఒక్క కుటుంబం కూడా ఆకలితో పస్తులుండకుండా అవసరం ఉన్నవారికి ఆహారధాన్యాలను అందించడం జరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార పంపిణీ పథకాన్ని నవంబర్ 2020 చివరి వరకూ పొడిగించి ప్రతి నెలా 80 కోట్ల మందికి సహాయాన్ని అందించడం జరుగుతోంది. వలసదారులైనవారు దేశంలోని ఏ చోటనైనా రేషన్ ను పొందేందుకు వీలుగా రాష్ట్రాలన్నిటినీ “ఒక దేశం-ఒకే రేషన్ కార్డు” పథకం పరిధిలోకి తేవడం జరిగింది.
10) ప్రపంచంలోని ఏ మూలనైనా చిక్కుబడిపోయిన మన వారి సంక్షేమాన్ని కోరుతూ, పది లక్షల మందికి పైగా ప్రజలను ‘వందేభారత్ మిషన్’ కింద స్వదేశానికి తీసుకురావడం జరిగింది. భారతీయ రైల్వే ఈ క్లిష్ట సమయంలోనూ ప్రజలను చేరవేసేందుకు, సరకుల రవాణా చేసేందుకు సేవలను నిర్వహిస్తోంది.
11) మన బలాలపై ఉన్న ఆత్మవిశ్వాసంతో మనం కోవిడ్ 19 తో పోరాడుతున్న ఇతర దేశాలకు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాం. ఇతర దేశాల నుంచి ఔషధాల కోసం పిలుపు రాగానే మనం తక్షణమే స్పందించి కష్టకాలంలో విశ్వసముదాయానికి భారత్ బాసటగా నిలుస్తుందని చూపించాం. మహమ్మారిని ప్రభావవంతంగా తట్టుకునే దిశగా ప్రాంతీయ, ప్రపంచస్థాయి వ్యూహాలను రూపొందించడం లో మనం ముందున్నాం. అంతర్జాతీయంగా మన పట్ల ఉన్న సౌహార్ద భావానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం విషయంలో మనం పొందిన అద్భుతమైన మద్దతే ఇందుకు తార్కాణం.
12) మన కోసం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం సంక్షేమం కోసం జీవించడం భారతీయ సంస్కృతి. భారత్ స్వావలంబన అంటే ఎవరినీ దూరం చేసుకోకుండా, ఇతరుల నుంచి వేరు కాకుండా స్వయం సమృధ్ధిని సాధించడమే. దీని అర్థం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉంటూనే మన ఉనికిని కొనసాగించగలగడమే.
ప్రియ దేశపౌరులారా..
13) మన ఋషులు చాలా కాలం క్రితమే చెప్పిన “ప్రపంచమంతా ఒకే కుటుంబం. వసుధైవ కుటుంబకం ...” అన్న మాటలను ప్రపంచం ఈ రోజు అర్థం చేసుకుంటోంది. అయితే ఒకవైపు మానవాళి ముందున్న అతి పెద్ద సవాలును ఎదుర్కోవడంలో ప్రపంచ సముదాయమంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉండగా, మన ఇరుగుపొరుగులో ఉన్న కొందరు మాత్రం విస్తరణవాదంతో దుస్సాహసానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. మన వీర జవాన్లు మన సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను అర్పించారు. ఆ భారతమాత సుపుత్రులు దేశ గౌరవం కోసమే బ్రతికారు. మరణించారు. జాతి యావత్తూ గల్వాన్ లోయలోని అమరులకు జోహార్లు అర్పిస్తోంది. వారి కుటుంబాలకు ప్రతి భారతీయుడూ కృతజ్ఞుడై ఉంటాడు. మనం శాంతి కాముకులమే అయినా ఎలాంటి దురాక్రమణ యత్నాన్నైనా సమర్థవంతంగా ఎదుర్కోగలమని పోరాటంలో వారి సాహసం నిరూపించింది. మన సరిహద్దులను కాపాడుతూ, అంతర్గత భద్రతను అందిస్తున్న మన సైనిక బలగాలు, పారామిలటరీ దళాలు, పోలీసు బలగాల సభ్యులందరినీ చూసి మనం గర్విస్తున్నాం.
14) కోవిడ్ 19 వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జీవితం, ఆజీవిక ఈ రెండూ చాలా అవసరమని నా నమ్మకం. ప్రస్తుత సంక్షోభాన్ని మన ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవనానికి అవసరమైన సంస్కరణలను చేపట్టే అవకాశంగా, అందరి మేలు కోసం - ముఖ్యంగా రైతులు, చిన్నతరహా వ్యాపారుల లబ్ది కోసం ఉపయోగకరమైన అవకాశంగా చూస్తున్నాం. వ్యవసాయ రంగంలో గణనీయమైన సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు రైతులు అవరోధాలు లేని వాణిజ్యం ద్వారా తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకుని, వాటికి అత్యుత్తమ ధరను పొందే అవకాశం లభించింది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించి రైతులపై ఉన్న కొన్ని నియంత్రణల నిబంధనలను తొలగించడం జరిగింది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
ప్రియమైన తోటి పౌరులారా..
15) 2020 లో మనం కొన్ని కఠినమైన పాఠాలను నేర్చుకున్నాం. కంటికి కనిపించని ఒక వైరస్ మనిషి ప్రకృతికి అధిపతి అన్న భ్రమను పటాపంచలు చేసింది. ఇప్పటికైనా మనిషి సరిదిద్దుకుని, ప్రకృతితో సామరస్యంగా జీవించే విషయంలో ఇప్పటికీ సమయం ఉందని నా నమ్మకం. వాతావరణ మార్పు లాగానే ఈ మహమ్మారి మనందరి ఉమ్మడి భవిత విషయంలో ప్రపంచ సముదాయానికి మేలుకొలుపు వంటిది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థ కేంద్రిత చేరిక కన్నా మానవ కేంద్రిత సహకారం చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. ఈ మార్పు ఎంత ఎక్కువగా జరిగితే మానవాళికి అంత మేలు జరుగుతుంది. 21 వ శతాబ్దం మానవాళి తమ విభేదాలను విడనాడి, భూగోళాన్ని రక్షించేందుకు సహకరించుకున్న శతాబ్దంగా గుర్తుండిపోవాలి.
16) రెండవ పాఠం ఏమిటంటే ప్రకృతి మాత ముందు మనమందరం సమానులమే. మన ఎదుగుదలకు, మనుగడగు మనం ప్రాథమికంగా ఇతరులపై ఆధారపడి ఉంటాం. కరోనా వైరస్ మానవాళి సృష్టించిన కృత్రిమ విభజనలను గుర్తించదు. మనుషులు సృష్టించిన విభేదాల నుంచి, దురభిప్రాయాలు, అవరోధాల నుంచి మనం పైకెదగాలన్న నమ్మకాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశంలో ప్రజలు దయ, సహకారాలను మౌలిక విలువలుగా స్వీకరించారు. మన ప్రవర్తన ద్వారా ఈ విలువను మరింత బలోపేతం చేయాలి. అప్పుడే మనందరి కోసం మనం బంగారు భవిష్యత్తును రూపొందించుకోగలుగుతాం.
17) మూడవ పాఠం వైద్య వసతులను మరింత సుదృఢపరచుకోవడం. కోవిడ్ 19 కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రయోగశాలలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రజా వైద్య సేవలు మహమ్మారిని ఎదుర్కోవడంలో పేదలకు సహకరించాయి. ఈ దృష్ట్యా ప్రజా వైద్య సేవల మౌలిక వసతులను మరింత విస్తరించాల్సిన, బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
18) నాలుగవ పాఠం శాస్త్ర సాంకేతికత గురించి. ఈ మహమ్మారి శాస్త్ర సాంకేతికతల విషయంలో పరిణామాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఎత్తి చూపించింది. లాక్ డౌన్ సమయంలో, ఆ తరువాత అన్ లాకింగ్ సమయంలో పాలన, విద్య, వాణిజ్య, కార్యాలయాల పనులు, సామాజిక సాన్నిహిత్యం వంటి విషయాల్లో సమాచార ప్రసార సాంకేతికత ఒక ప్రభావవంతమైన ఉపకరణంగా నిలిచింది. ప్రాణాలను కాపాడటంలో, కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో ఇది దోహదపడుతుంది.
19) భారత ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వర్చువల్ ఇంటర్ ఫేస్ ను తమ విధుల నిర్వహణలో విస్తృతంగా ఉపయోగిస్తూ వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చెప్పడంలో ఆన్ లైన్ కోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతి భవన్ లోనూ మేము సాంకేతికత ను ఉపయోగించి వర్చువల్ సదస్సులు, ఇతర కార్యక్రమాలను నిర్వహించాం. ఐటీ, ప్రసార సాంకేతికతా సాధనాలు ఈ విద్య, దూర విద్యలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పని చేయడం) ఇప్పుడు పలు రంగాల్లో సర్వసాధారణమైపోయింది. ఆర్ధిక వ్యవస్థ చక్రాలు సజావుగా నడిచేందుకు ప్రభుత్వంలోని పలు రంగాలు, ప్రైవేటు రంగాలు నిరంతం పని చేయడంలో టెక్నాలజీ ఎంతో తోడ్పడింది. కాబట్టి మనం ప్రకృతి సమతౌల్యంతో శాస్త్ర సాంకేతికతలను ఉపయోగించుకుంటే మన మనుగడ, అభివృద్ధి కొనసాగుతాయని నేర్చుకున్నాం.
20) ఈ పాఠాలు మానవాళికి చాలా ఉపయోగపడతాయి. యువతరం ఈ పాఠాలను చాలా బాగా నేర్చుకుంది. వారి చేతుల్లో భారత్ భవిత సురక్షితంగా ఉందని నా నమ్మకం. మనందరికీ, ముఖ్యంగా యువతకు ఇది చాలా కష్టకాలం. మన విద్యా సంస్థల మూసివేత వారిలో ఆందోళన కలిగించి ఉండవచ్చు. తాత్కాలికంగా వారి కలలపై, ఆకాంక్షలపై నీలి నీడలు కమ్ముకుని ఉండవచ్చు. కానీ, కష్టకాలం శాశ్వతంగా ఉండదని గుర్తుంచుకోవాలని, వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించడం మానవద్దని నేను వారికి చెప్పదలచుకున్నాను. మన అతీతంలో ఇలాంటి విధ్వంసాల తరువాత సమాజాన్ని, ఆర్ధిక వ్యవస్థను, దేశాలను పునర్నిర్మాణం చేసిన ప్రేరణాదాయ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన దేశానికి, మన యువతకు మంచి భవిత ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను.
21) మన పిల్లలకు, యువతకు భవిష్యత్తును నిర్మించే విద్యను ఇచ్చేందుకు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే నాణ్యమైన కొత్త విద్యా వ్యవస్థ వికసితమవుతుందని నా విశ్వాసం. ఇది భవిష్యత్తు సవాళ్లను అవకాశాలుగా మార్చి, కొత్త భారతదేశానికి బాటలు వేస్తుందని నేను నమ్ముతున్నాను. మన యువత తమకు నచ్చిన, తమ ప్రతిభకు తగిన విషయాలను స్వేచ్ఛగా ఎంచుకోగలుగుతారు. దీనివల్ల వారి సామర్థ్యాలు వెలుగు చూసే అవకాశం వస్తుంది. మన భవిష్యత్ తరాలు తమ సామర్థ్యాల ఆధారంగా ఉపాధిని పొందుతారు. ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతారు.
22) జాతీయ విద్యా విధానం సుదీర్ఘ ప్రభావం ఉన్న దీర్ఘకాలిక దృక్పథాన్ని సూచిస్తోంది. ఇది విద్యారంగంలో సర్వస్వామ్యం, వినూత్నీకరణ, వ్యవస్థల సంస్కృతిని బలోపేతం చేస్తుంది. యువ మస్తిష్కాలకు స్వతఃస్ఫూర్తమైన ఎదుగుదలను ఇచ్చేందుకు గాను మాతృభాషలో విద్యాబోధన చేసే విషయంపై ప్రత్యేక శ్రద్ధను పెట్టడం జరిగింది. ఇది భారతీయ భాషలను బలోపేతం చేయడమే కాక, దేశ సమైక్యత ను కూడా సుదృఢం చేస్తుంది. ఒక శక్తివంతమైన దేశాన్ని నిర్మాణం చేయడానికి యువ సాధికారిత చాలా అవసరం. ఈ దిశలో జాతీయ విద్యా విధానం ఒక సరైన అడుగుగా భావించాలి.
నా ప్రియమైన తోటి పౌరులారా!
23) కేవలం పది రోజుల క్రితమే అయోధ్యలో శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణం మొదలైంది. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశవాసులు సుదీర్ఘకాలం సంయమనాన్ని, ఓరిమిని ప్రదర్శించారు. మన న్యాయవ్యవస్థపట్ల అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శించారు. రామజన్మభూమి అంశాన్ని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవడం జరిగింది. సంబంధిత పక్షాలన్నిటితో పాటు ప్రజలు కూడా గౌరవపూర్వకంగా సర్వోచ్చ న్యాయస్థానపు తీర్పును ఆమోదించారు. శాంతి, అహింస, ప్రేమ, సామరస్యాల వంటి భారతీయ విలువలను ప్రపంచానికి చూపించారు. ఈ ప్రశంసాయోగ్యమైన ప్రవర్తనను ప్రదర్శించిన పౌరులందరినీ నేను అభినందిస్తున్నాను.
ప్రియమైన తోటి పౌరులారా..
24) దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన ప్రజాస్వామ్య ప్రయోగం ఎక్కువ కాలం నిలవదని చాలా మంది జోస్యం చెప్పారు. మన ప్రాచీన పరంపరలు, మన వైవిధ్యాలు మన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామీకరణకు అవరోధాలవుతాయని భావించారు. కానీ మనం వాటిని ఎల్లప్పుడూ ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం చేసే బలాలుగానే పరిగణించాం. మానవాళి మేలు కోసం భారతదేశం తనదైన ప్రధాన భూమికలను పోసించాల్సిందే.
25) మహమ్మారిని ఎదుర్కోవడంలో మీరందరూ కనబరచిన ఓరిమిని, విజ్ఞతలను ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. మీరంతా జాగరూకతను పాటిస్తారని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారన్న నమ్మకం నాకుంది.
26) మనం ప్రపంచానికి ఇవ్వగలిగేది చాలా ఉంది. మేధోపరమైన, ఆధ్యాత్మికమైన సంపన్నత విషయంలో, ప్రపంచ శాంతిని పెంపొందించే విషయంలో మనం ప్రపంచానికి ఇవ్వగలిగింది చాలా ఉంది. ఈ భావనతోటే నేను అందరి సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాను.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్
అంటే..
అందరూ సంతోషంగా ఉండాలి
అందరూ రోగాలకు దూరంగా ఉండాలి
అందరూ మంగళమయమైనదానినే చూడాలి
ఎవరికీ దుఃఖం కలగకుండా ఉండాలి.
సార్వత్రిక సంక్షేమం కోసం కోసం చేసిన ఈ ప్రార్థనలోని సందేశమే మానవాళికి భారత్ ఇస్తున్న విలక్షణమైన బహుమతి.
27) మరో సారి నేను 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరందరూ చక్కటి ఆరోగ్యంతో, మెరుగైన భవిష్యత్తుతో ఉండాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
జై హింద్
***
(Release ID: 1645900)
Visitor Counter : 351
Read this release in:
Marathi
,
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam