సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

నూతన విధానాల రూపకల్పన కోసం రంగాలు, పరిశ్రమల వారీగా... క్షేత్ర స్థాయి సమస్యల అధ్యయనం నేటి అవసరం: శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 14 AUG 2020 2:49PM by PIB Hyderabad

దేశంలో రంగాల వారీగా, పరిశ్రమల వారీగా క్షేత్ర స్థాయి సమస్యలపై మేధో సంస్థల ద్వారా అధ్యయనం చేయించవలసిన అసవరం ఉందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు- రోడ్డు రవాణా & రహదారుల శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. తద్వారా ఆయా సంస్థల సిఫారసులను పరిగణనలోకి తీసుకొని నూతన విధానాలను రూపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ గడ్కరీ ఓ వెబినార్ లో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎం.ఎస్.ఎం.ఇ. సభ్య సంస్థలు, ‘ఫిక్కీ’లోని వివిధ రంగాలకు చెందిన సంఘాలతో చర్చించారు. ప్లాస్టిక్, గార్మెంట్స్, లెథర్, ఫార్మాస్యూటికల్స్ వంటి అన్ని రంగాలూ.. వాటితో అనుసంధానమైన పరిశ్రమలూ ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమైన రంగాలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమస్యలపై వివిధ మేధో సంస్థల ద్వారా అధ్యయనం చేసి సిఫారసులను సమర్పించాలని శ్రీ గడ్కరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి)కి, ఇతర పరిశ్రమల సంఘాలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయా సమస్యల పరిష్కారానికి తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ కార్యక్రమంతో స్వచ్ఛందంగా అనుసంధానం కావాలని శ్రీ గడ్కరీ పారిశ్రామిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దిగుమతి బిల్లును తగ్గించుకోవచ్చని, అదే సమయంలో దేశం లోపల తయారీ రంగ కార్యకలాపాలను, ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని చెప్పారు.

‘‘దేశ వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, వ్యవసాయాధార ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము’’ అని శ్రీ గడ్కరీ తెలిపారు. ఓ సామాజిక సూక్ష్మ రుణాల సంస్థ ఏర్పాటుకోసం విధానం ఖరారవుతోందని, ఆ సంస్థ చాలా చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు, దుకాణాలకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందుబాటులోకి తెస్తుందని మంత్రి వెల్లడించారు.

భౌతిక దూరం సరికొత్త నియమంగా మారినందున... ఎంఎస్ఎంఇలలో యాంత్రీకరణ, డిజిటలైజేషన్ పెద్ద ఎత్తున జరగాలని మంత్రి సూచించారు.

దేశంలో టాప్ 50,000 ఎంఎస్ఎంఇల అంతర్జాల డిజిటల్ డరెక్టరీని రూపొందించాలని పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు మంత్రికి సూచించారు. దాంతో పాటు మరికొన్ని సూచనలు వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయా సంఘాల ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు.

***


(Release ID: 1645856)