ఉక్కు మంత్రిత్వ శాఖ

"ఆత్మ నిర్భర్ భారత్ : గృహ నిర్మాణం, భవన నిర్మాణం, వైమానిక రంగాల్లో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడం" అనే అంశంపై వెబినార్ నిర్వహించనున్న : ఉక్కు మంత్రిత్వ శాఖ

Posted On: 14 AUG 2020 2:31PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలూ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలతో కలిసి ఉక్కు మంత్రిత్వ శాఖ (సి.ఐ.ఐ) 2020 ఆగష్టు, 18వ తేదీన 'ఆత్మ నిర్భర్ భారత్ :  గృహ నిర్మాణం, భవన నిర్మాణం, వైమానిక రంగాల్లో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడం" అనే అంశంపై వెబినార్ నిర్వహించనుంది.  నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలలో ఉక్కు వాడకంపై వెబి‌నార్ అవగాహన పెంచడంతో పాటు,  ఉక్కు - వినియోగ ఆధారిత నిర్మాణాలను ప్రోత్సహించడానికి వీలుగా వినియోగదారులు మరియు సరఫరాదారుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.   ఈ కార్యక్రమానికి పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలూ, పౌర విమానయాన శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) మరియు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి గౌరవ అతిథిగా పాల్గొంటారు.  ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా ప్రారంభ సమావేశంలో పాల్గొంటారు. 

భవన నిర్మాణం, గృహ నిర్మాణం, విమానాశ్రయ ప్రాజెక్టులలో ఉక్కు వినియోగ ఆధారిత డిజైన్లు మరియు నిర్మాణాలను ప్రోత్సహించడంలో వినియోగదారుల దృక్పథం పై వెబి‌నార్ దృష్టి సారించనుంది.  ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడంలో భారతీయ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ సామర్థ్యాల గురించి ఉక్కు ఉత్పత్తిదారుల దృక్పథం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, తయారీతో పాటు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆర్ అండ్ డి సామర్థ్యాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. 

ఏ దేశమైనా, వేగవంతంగా, స్థిరమైన అభివృద్ధి చెందాలంటే ఉక్కు వినియోగం అనేది ఒక ఆచరణీయ పరిష్కార మార్గం.  ఉక్కు వాడకం భారీగా ఉంటే, అది ఆ దేశ అధిక వృద్ధిని, ముఖ్యంగా భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వృద్ధికి దోహదపడే రంగాలలో అభివృద్ధిని సూచిస్తుంది.  భారతదేశం యొక్క తలసరి ఉక్కు వినియోగం 74.1 కిలోలు కాగా, ఇది ప్రపంచ సగటు (224.5 కిలోలు) లో మూడింట ఒక వంతుగా ఉంది.  రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 103 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికను బట్టి చూస్తే, ఉక్కు వినియోగ ఆధారిత నిర్మాణాల వైపు మారడానికి భారతదేశానికి ఇది సరైన సమయంగా ఉంది. దీనితో పాటు,  వేగవంతమైన నిర్మాణ సమయం, తగ్గిన జీవిత చక్ర వ్యయం, పెరిగిన మన్నిక, నాణ్యత, పునర్వినియోగం, పర్యావరణ స్థిరత్వం వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

*****



(Release ID: 1645854) Visitor Counter : 121