శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొత్త శాస్త్ర&సాంకేతిక విధానం రూపకల్పన కోసం క్షేత్రస్థాయి అభిప్రాయాలు సేకరణ
కొత్త విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న కమ్యూనిటీ రేడియో
Posted On:
13 AUG 2020 2:57PM by PIB Hyderabad
వివిధ కారణాల కారణంగా ఇన్నాళ్లూ తమ భావాలను వెల్లడించలేకపోయిన వ్యక్తుల అభిప్రాయాలను తొలిసారిగా కమ్యూనిటీ రేడియో ద్వారా కేంద్ర ప్రభుత్వం నమోదు చేస్తోంది. కొత్త శాస్త్ర, విజ్ఞాన విధానాన్ని రూపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టింది.
'ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్' (పీఎస్‌ఏ)తో కలిసి, "శాస్త్ర&సాంకేతికత, ఆవిష్కరణ విధానం" (ఎస్‌టీఐపీ)-2020 రూపకల్పన ప్రక్రియను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (డీఎస్‌టీ) చేపట్టింది. అన్ని వర్గాల అభిప్రాయాలు విని, దిగువ స్థాయి నుంచి సమగ్రంగా కొత్త విధానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టింది.
దాదాపు 15 వేల మందిని కలిపే నాలుగు అంతర్గత అనుసంధానాల ద్వారా పాలసీ రూపకల్పన చేపట్టారు. కమ్యూనిటీ రేడియోల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. 'కమ్యూనిటీ రేడియో స్టేషన్ల' (సీఆర్‌ఎస్)ల ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించే మార్గాన్ని 'నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్' (ఎసీఎస్‌టీసీ) రూపొందించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 291 కమ్యూనిటీ రేడియో కేంద్రాలలో.., ప్రాంతీయ భిన్నత్వం, వర్గం, ప్రజల్ని చేరుకోగల సామర్థ్యం ఆధారంగా 25 కేంద్రాలను గుర్తించారు. సామర్థ్యం నిర్మాణం కోసం 'కామన్‌వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా' (సీఈఎంసీఏ) ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.
కొత్త విధానానికి సంబంధించి, రేడియో ద్వారా శ్రోతలు వినే సమాచారాన్ని డీఎస్‌టీ రూపొందించింది. 13 భారతీయ భాషల్లో ఆసక్తికర జింగిల్‌తో పాటు సమాచారాన్ని వినిపిస్తోంది. గుర్తించిన రేడియో కేంద్రాల ద్వారా ఈనెల 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. శ్రోతలతో 'ముఖ్య బృంద చర్చలు' ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విభిన్న శాస్త్రీయ రంగాల అవసరం, ప్రజా ప్రాధాన్య విధానం ప్రకారం 'శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ' వ్యవస్థ ప్రాధాన్యతలను పునర్నిర్మించడం ఈ విధానం లక్ష్యం.
"సంబంధిత సమస్యలను గుర్తించడానికి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభిప్రాయాల ద్వారా 'శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ విధానం' భారీ లబ్ధి పొందుతుంది. వాటిని సమర్థవంతంగా పరిష్కరించడానికి చర్యలు చేపడుతుంది" అని డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అశుతోష్ శర్మ వెల్లడించారు.

*****
(Release ID: 1645520)
Visitor Counter : 166