రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్ష‌ణ శాఖ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ( పిఎస్ యులు), ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ బోర్డు ( ఓ ఎఫ్ బి) ఆవిష్క‌రించిన నూత‌న మౌలిక వ‌స‌తుల్ని, ఆధునీక‌రించిన స‌దుపాయాల్ని ప్రారంభించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్‌

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ వారోత్స‌వాల‌ను కొన‌సాగించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి

Posted On: 10 AUG 2020 7:47PM by PIB Hyderabad

రక్ష‌ణ శాఖ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ( పిఎస్ యులు), ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ బోర్డు ( ఓ ఎఫ్ బి) ఆవిష్క‌రించిన నూత‌న మౌలిక వ‌స‌తుల్ని, ఆధునీక‌రించిన స‌దుపాయాల్ని డిజిట‌ల్ లింకుద్వారా  ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ ప్రారంభించారు. ర‌క్ష‌ణ శాఖ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ వారోత్స‌వాల్లో భాగంగా ఆయ‌న వీటిని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌క్ష‌ణ శాఖ స‌హాయమంత్రి శ్రీపాద్ వై నాయ‌క్‌తోపాటు ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ప‌లువురు ముఖ్య అధికారులు వీడియో కాన్ఫ‌రెన్స్ లింకుల‌ద్వారా పాల్గొన్నారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శ్రీ రాజ్ నాధ్ సింగ్ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ సాధ‌న కోసం ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు గురించి వివ‌రించారు. ప్ర‌ధాని ప్ర‌క‌టించిన ఐదు అంశాల ఫార్ములా గురించి చెప్పారు. ఆకాంక్ష‌, అంద‌రినీ క‌లుపుకునే విధానం, పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాలు, ఆవిష్క‌ర‌ణ అనే ఈ ఐదు అంశాలు దేశ ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెడ‌తాయ‌ని ఈ మ‌ధ్య‌నే ప్ర‌ధాని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న స‌మ‌యోచిత‌ ఆలోచ‌నాత్మ‌క నిర్ణ‌యాల కారణంగా దేశానికి జ‌రిగిన మేలు గురించి వివ‌రించారు. దేశీయంగా అభివృద్ది సాధించ‌డం, ర‌క్ష‌ణ రంగ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో పెట్టుబ‌డులు, ర‌క్ష‌ణ ప‌రిక‌రాల త‌యారీ సామ‌ర్థ్య విస్త‌ర‌ణ మొద‌లైన‌వాటికోసం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి చెప్పారు. ఈ చ‌ర్య‌ల కార‌ణంగా దేశ ర‌క్ష‌ణ రంగ ప‌రిశ్ర‌మ‌ల‌కు భారీ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ సాధన కోసం ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తి విభాగం, ర‌క్ష‌ణ శాఖ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీల బోర్డు నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేశాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ర‌క్ష‌ణ రంగంలో స్వ‌యం స‌మృద్ధి సాధించ‌డం చాలా పెద్ద ప‌ని అని దీనికోసం అంద‌రూ క‌లిసిక‌ట్టుగా చిత్త‌శుద్ధితో ప‌ని చేయాల‌ని ఆయ‌న అన్నారు.దేశంలోని ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌లు భార‌త‌దేశ సైన్యానికి వెన్నుద‌న్నుగా వున్నాయ‌ని అన్నారు. నిరంత‌రం స‌హాయ‌క‌రంగా వున్నాయ‌ని అన్నారు. 
ర‌క్ష‌ణ రంగ స‌దుపాయాల ఆధునీక‌ర‌ణ గురించి ర‌క్ష‌ణ మంత్రి మాట్లాడారు. ర‌క్ష‌ణ రంగ సన్న‌ద్ధ‌త‌లో వాటి ప్రాధాన్య‌త గురించి వివ‌రించారు. 
డిఆర్ డివో రూపొందించిన యాంటీ టార్పెడో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రీచ్ ను త‌యారు చేసే దేశీయ మ‌రీచ్ ఇంటిగ్రేష‌న్ ఫెసిలిటీని బిఇఎల్ ప్రారంభించింది. 
హెచ్ ఏ ఎల్ త‌యారు చేసిన ఏఎల్ 31ఎఫ్ పి ఇంజిన్ ను ఐఏఎఫ్ కు అంద‌జేయ‌డం జ‌రిగింది. దీన్ని కోరాపుట్ డివిజ‌న్ త‌యారు చేసింది. 
నూత‌న మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో భాగంగా బిఇఎంఎల్ సంస్థ బెంగుళూరులో పారిశ్రామిక డిజైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విష‌యంలో ఈ కేంద్రం దేశంలోనే మొద‌టిది. 
రాజా బ‌గ‌న్ డాక్ యార్డు ద‌గ్గ‌ర‌గ‌ల జిఆర్ ఎస్ ఇ స‌దుపాయాల‌ను ఆధునీక‌రించడంతో దాని సామ‌ర్థ్యం పెరిగింది. 
బిడిఎల్ లోని సీక‌ర్ ఫెసిలిటీ సెంట‌ర్ కోసం పునాది వేయ‌డం జ‌రిగింది. దీని ద్వారా నూత‌న మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. 
జిఎస్ ఎల్ వ‌ద్ద స్టీల్ ప్రిప‌రేష‌న్ షాప్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది.
కార్పొరేట్ సామాజిక బాధ్య‌త మ‌రియు సుస్థిర‌మైన అభివృద్ది విధానంలో భాగంగా  అత్యాధునిక‌ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని మిధాని సంస్థ‌ ప్రారంభించింది.  దీని ద్వారా వైమానిక‌, ర‌క్ష‌ణ‌, అణు, అంత‌రిక్ష మ‌రియు ఇత‌ర వ్యూహాత్మ‌క రంగాల్లో ఉప‌యోగించే  ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను త‌యారు చేస్తారు. 
ఈ సౌక‌ర్యాల‌న్నిటినీ రిమోట్ బ‌ట‌న్ ద్వారా ర‌క్ష‌ణ శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి విభాగాన్ని , ర‌క్ష‌ణ రంగ ప్ర‌భుత్వ రంగసంస్థ‌ల‌ను, ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీల బోర్డును కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ ప్ర‌శంసించారు. ఈ ఆధునీక‌ర‌ణ‌, నూత‌న ఏర్పాట్ల కార‌ణంగా దేశానికి చాలా మేలు జ‌రుగుతుంద‌ని విదేశీ వ‌న‌రుల మీద ఆధార‌ప‌డ‌డం త‌గ్గుతుంద‌ని ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు ఇది దారి తీస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 
ఆత్మ‌నిర్భ‌ర్ వారోత్స‌వాల్లో భాగంగా ఆయా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ఆర్ఢినెన్స్ ఫ్యాక్ట‌రీల బోర్డు అనేక వెబినార్ల‌ను నిర్వహించాయి. ప‌లు ప్ర‌ధాన‌మైన అంశాల‌ను వీటి ద్వారా చ‌ర్చించారు. వీటిలో పారిశ్రామిక రంగ నిపుణులు, విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధులు, అమ్మ‌కందార్లు పాల్గొన్నారు. 

 

****


(Release ID: 1645270) Visitor Counter : 183