ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మరణాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలపై దృష్టిపెట్టాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
కోవిడ్ మరణాలు ఎక్కువ నమోదౌతున్న రాష్ట్రాలు క్లినికల్ మేనేజ్‌మెంట్ విషయంలొ పూర్తి స్థాయిలో వనరులను వినియోగించుకోవలసిందిగా సూచన
Posted On:
08 AUG 2020 3:47PM by PIB Hyderabad
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు సమన్వయంతో కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్నసానుకూల చర్యల వల్ల మరణాల రేటు ( కేస్ ఫాటలిటీ రేట్-సిఎఫ్ఆర్) తగ్గుముఖం పట్టింది. కేస్ ఫాటలిటీ రేటు ప్రస్తుతం 2.04 శాతం గా ఉంది. కేంద్ర, రాష్ట్రపాలిత ప్రాంతాలలో కోవిడ్‌నియంత్రణ పరిస్థితులపై నిరంతర సమీక్ష, సహాయంలో భాగంగా2020 ఆగస్టు 7,8 తేదీలలో కేంద్ర ఆరోగ్యకార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ రెండు ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. జాతీయ సగటు కంటే కేసులు ఎక్కువ గా ఉన్న , అలాగే జాతీయ సగటు కంటే సిఎఫ్ఆర్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలతో చర్చించి, కోవిడ్ మరణాలు నిరోధించేందుకు, తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యల విషయంలొ సహాయం అందించేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు .
ఈరోజు నిర్వహించిన సమావేశంలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 13 జిల్లాలపై దృష్టి కేంద్రీకరించారు.అవి, అస్సాంలోని కామరూప్ మెట్రో, బీహార్ లోని పాట్నా, జార్ఖండ్‌లోని రాంచి, కేరళలోని అలప్పుజ, తిరువనంతపురం, ఒడిషాలోని గంజాం, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, పశ్చిమబెంగాల్ లోని 24 పరగణాలు నార్త్, హూగ్లి, హౌరా, కోల్‌కతా, మాల్దా, ఢిల్లీ ఉన్నాయి. ఈ జిల్లాలలో దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 9 శాతం , కోవిడ్ మరణాలలో 14 శాతం ఉన్నాయి. అలాగే ప్రతి పది లక్షలకు తక్కువ పరీక్షలు, నిర్వహించిన పరీక్షలలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అస్సాంలోని కామరూప్ మెట్రో, ఉత్తరప్రదేశ్ లోని లక్నో, కేరళలోని తిరువనంతపురం, అలప్పుజ లలో రోజూ కొత్త కేసులు పెరుగుతుండడం గమనించారు. ఈ వర్చువల్ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్), ఎండి (ఎన్.హెచ్.ఎం)లు, జిల్లా సర్వెలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఛీఫ్ మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ కాలేజీల మెడికల్ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
.
ఈ సమావేశంలో కోవిడ్ మరణాలకు సంబంధించి కేస్ ఫాటలిటీ రేటును తగ్గించడానికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. కోవిడ్ పరీక్షా ల్యాబ్‌ల సామర్ధ్యాన్ని తక్కువగా వినియోగించడం అంటే రోజుకు వందకంటే లోపు ఆర్.టి-పిసిఆర్ పరీక్షలు నిర్వహించడం, ఇతరులైతే పది మందికి నిర్వహించడం, ప్రతి పది లక్షలకు తక్కువ సంఖ్యలో పరీక్షలు, గత వారంతో పోలిస్తే పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడం, పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం,ఆరోగ్య కార్యకర్తలలో ఎక్కువమందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతుండడం, వంటి అంశాలపై రాష్ట్రాలకు తగిన సూచనలు చేశారు. కొన్ని జిల్లాలలో పేషెంట్లను చేర్చిన 48 గంటలలోనే చనిపోతుండడం విషయంలో పేషెంట్లను సకాలంలో రెఫరల్ ఆస్పత్రులకు తరలించాల్సిందిగా సూచించారు. అంబులెన్సు సేవలు అందుబాటులో లేని పరిస్థితి లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్ లక్షణాలు బయటకు కనిపించని హోం ఐసొలేషన్ లోని కేసులపై దృష్టిపెట్టాలని, వ్యక్తిగతంగా పర్యవేక్షణ , ఫోనుద్వారా సలహా సంప్రదింపుల వంటి వాటిని రోజూ చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం వస్తున్న కేసులను బట్టి , కేసుల పెరుగుదల రేటును ఎప్పటికప్పుడు ముందస్తుగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఐసియు బెడ్లు, ఆక్సిజన్ సరఫరా వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచించింది.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ ప్రతివారం మంగళ, శుక్రవారాలలో వర్చువల్ సెషన్‌లు నిర్వహిస్తున్నదని, దీని ద్వారా స్పెషలిస్టు టీమ్ డాక్టర్లు వివిధ రాష్ట్రాలలోని ఆస్పత్రులలో ఐసియులలో ఉన్న కేసుల విషయంలొ మరణాల రేటు తగ్గించేందుకు, కోవిడ్-19 క్లినికల్ మేనేజ్‌మెంట్‌కుసంబంధించి టెలి వీడియో కన్సల్టేషన్ ద్వారా మెరుగైన మార్గదర్శనం చేయనున్నారని కూడా ఈ సమావేశంలో తెలిపారు.
ఆయా రాష్ట్రాలలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర ఆస్పత్రులు ఈ వర్చవల్ కాన్ఫరెన్సులో పాల్గొనేట్టు చూడాలని సూచించారు. అలాగే రాష్ట్రాలు కంటైన్‌మెంట్ జొన్‌లు, బఫర్ జోన్‌లకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరిస్థితి తీవ్రంగా ఉన్న కేసుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని
సూచించారు. రిస్క్ ఎక్కువగా గల వారు , ఇతర రకాల అనారోగ్యాలు కూడా ఉన్నవారు, గర్భిణులు, వయోధికులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సమావేశంలో సూచించారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
****
(Release ID: 1644458)
Visitor Counter : 269