గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ట్రైఫెడ్ 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, గిరిజన సామాజిక ఆర్థిక అభివృద్ధికి స్వంత వర్చువల్ ఆఫీస్ నెట్‌వర్కు ప్రారంభం
Posted On:
07 AUG 2020 4:01PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద గల , గిరిజన సహకార మార్కెటింగ్ డవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్ ) ఆగస్టు 6, 2020న తన 33 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా , గిరిజన జీవితాలలో పరివర్తన తెచ్చేందుకు తన చిత్తశుద్ధిని పునరుద్ఘాటించింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విసిరిన సవాలు సందర్భంలో గిరిజనులకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా సాధికారత కలిపించేందుకు ఈ సంస్థ గట్టి కృషి చేస్తోంది. గిరిజనులకు ఉపాధి, జీవనొపాధి కల్పించడం వంటి వాటిలో ట్రైఫెడ్‌తన కృషిని రెట్టింపు చేసింది.
“ఇటీవలి లాక్‌డౌన్ సమయంలో చాలామంది షాపింగ్, బ్యాంకింగ్, ఇతర పనులకు ఆన్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఈ ధోరణి ఇంకా పెరిగింది. ఇక సరఫరా వైపు చూస్తే, కొవిడ్ -19 కారణంగా పేదలు, అణగారిన వర్గాలు , గిరిజన చేతివృత్తుల వారు, చిన్న అటవీ ఉత్పత్తులు సేకరించే వారి జీవనోపాధిపై బాగా ప్రభావం పడింది. దీనితో ట్రైఫెడ్ వ్యూహాత్మకంగా ప్రస్తుత పరిస్థితికి స్పందించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మేం చేపట్టిన డిజిటైజేషన్ వ్యూహానికి ఎంతో విలువ ఉంది. ” అని ట్రైఫెడ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ప్రవీర్‌కృష్ణ తెలిపారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉండడంతో జీవితంలోని ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్ కార్యకలాపాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీనితో ట్రైఫెడ్ ఆగస్టు 6 ,2020న తన వ్యవస్థాపక దినోత్సవం రోజున స్వంతంగా వర్చువల్ ఆఫీసును ప్రారంభించింది. ట్రైఫెడ్ వర్చువల్ ఆఫీస్ నెట్ వర్క్‌కు 81 ఆన్‌లైన్ వర్క్ స్టేషన్లు , 100 అదనపు రాష్ట్ర, ఏజెన్సీ వర్కు స్టేషన్లు ఉన్నాయి. ఇవి ట్రైఫెడ్ యోధులకు వారి దేశవ్యాప్త భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సహకరిస్తాయి. ఇవి నోడల్ ఏజెన్సీలుగా గానీ లేదా అమలు ఏజెన్సీలుగా గానీ మిషన్ మోడ్‌లో పనిచేస్తూ గిరిజనుల ప్రధానస్రవంతిలోకి తీసుకువచ్చేలా వారి అభివృద్ధికి సత్వర కృషి చేస్తాయి.
ఉద్యోగుల సామర్ధ్యాల స్థాయిని పెంచడానికి, వారి కృషిని క్రమబద్ధీకరించడానికి , డాష్ బోర్డు లింక్ తో ఎంప్లాయీ ఎంగేజ్ మెంట్, వర్క్ డిస్ట్రిబ్యూషన్ మాట్రిక్స్‌ను కూడా ప్రారంభించారు. రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పని కొనసాగించేందుకు వీలు కల్పించే మరో డిజిటల్ సాఫ్ట్‌వేర్ ను కూడా ప్రారంభించారు.
గిరిజన ఉత్పత్తుల వాణిజ్యం, గ్రామ ఆధారిత గిరిజన ఉత్పత్తులు, హస్తకళాకారుల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు పరిచయం చేయడం, ఇందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయడం వంటివి ట్రైఫెడ్ డిజిటైజేషన్ చర్యలలో ఉన్నాయి.
ట్రైఫెడ్ సంస్థ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టం 1984 కింద రిజిస్టర్ అయిన సంస్థ. ఇది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో 1987 నుంచి జాతీయ నోడల్ ఏజెన్సీగా ఉంటూ అన్ని రాష్ట్రాల గిరిజనుల సామాజిక , ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది. ట్రైఫెడ్ 1988నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐఎఎస్ అధికారి ఎస్.కె.చౌహాన్ దీనికి తొలి మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సంస్థ 36 వ మేనేజింగ్ డైరక్టర్‌గా ఐఎఎస్ అధికారి శ్రీ ప్రవీర్ కృష్ణ ఉన్నారు. 2017 జూలై 25న ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన కేంద్ర కార్యాలయంలో, 15 ప్రాంతీయ కార్యాలయాలలో మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గిరిజనులకు సాధికారత కల్పించేందుకు, దేశవ్యాప్తంగా వారి ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు ( మార్కెటింగ్ అభివృద్ది, వారి నైపుణ్యాలను నిరంతరం పెంచడం) ట్రైఫెడ్ గిరిజన హస్తకళా ఉత్పత్తులు, కళాత్మక ఉత్పత్తులను సేకరించి, 1999లో తొలిసారిగా ట్రైబ్స్ ఇండియా పేరుతో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా మార్కెట్ చేస్తున్నది.
*****
(Release ID: 1644378)
Visitor Counter : 145