పర్యటక మంత్రిత్వ శాఖ

స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా, 'దేఖో అప్నా దేశ్‌' సిరీస్‌లో ఐదు వెబినార్లను నిర్వహిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 07 AUG 2020 2:33PM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ప్రజలంతా మరోసారి ఏకతాటిపైకి వచ్చి జాతీయ గీతాన్ని గర్వంగా, శ్రావ్యంగా ఆలపిస్తున్న సమయమిది. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండగా, అదే సమయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విదేశాల్లోని భారత కార్యాలయాల్లో మన జెండా రెపరెపలాడనుంది. 

    74వ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశమంతా సిద్ధమవుతుండగా, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, 'దేఖో అప్నా దేశ్‌' సిరీస్‌లో భాగంగా ఐదు వెబినార్లను నిర్వహిస్తోంది. దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఆగస్టు 15వ తేదీ గౌరవార్ధం ఈ వెబినార్లు తలపెట్టింది. స్వాతంత్ర్య ఉద్యమం, స్ఫూర్తి రగిలించిన ప్రాంతాలు, భారతమాత దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో మార్గదర్శకులైన వ్యక్తుల ఇతివృత్తాలను సృజిస్తూ ఈ వెబినార్లు సాగుతాయి.

వెబినార్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

* ఆగస్టు 8వ తేదీ, శనివారం రోజున... "1857 జ్ఞాపకాలు: స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు బాట". ఇండియా సిటీ వాక్స్‌ & ఇండియా విత్‌ లోకల్స్ సీఈవో నిధి భన్సాల్‌, ఐడబ్ల్యూఎల్‌&ఐహెచ్‌డబ్ల్యూ ఆపరేషన్స్‌ విభాగాధిపతి డా.సౌమి రాయ్‌ పాల్గొంటారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు https://bit.ly/Memoirsof1857 లో పేరు నమోదు చేసుకోవాలి.

* ఆగస్టు 10వ తేదీ, సోమవారం రోజున... "సెల్యులార్‌ జైలు‌: లేఖలు, జ్ఞాపకాలు". ఇండియా సిటీ వాక్స్‌ & ఇండియా విత్‌ లోకల్స్ సీఈవో నిధి భన్సాల్‌, ఐడబ్ల్యూఎల్‌&ఐహెచ్‌డబ్ల్యూ ఆపరేషన్స్‌ విభాగాధిపతి డా.సౌమి రాయ్‌, ఇండియా సిటీ వాక్స్‌ అన్వేషకురాలు సొమ్రిత సేన్‌గుప్తా పాల్గొంటారు. 

* ఆగస్టు 12వ తేదీ, బుధవారం రోజున... "భారత స్వాతంత్ర్యోద్యమంపై కొందరికే  తెలిసిన గాథలు". స్టోరీ ట్రైల్స్‌ నుంచి అఖిల రామన్, నయనతార నాయర్‌ పాల్గొంటారు.

* ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున... "జలియన్‌ వాలాబాగ్‌: స్వాతంత్ర్యోద్యమంలో కీలక మలుపు‌". అమృత్‌సర్‌లోని పార్టిషన్‌ మ్యూజియం ఛైర్‌పర్సన్‌ కిష్వర్‌ దేశాయ్‌ పాల్గొంటారు.

* ఆగస్టు 15వ తేదీ శనివారం రోజున... "సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌-సమైక్య భారత శిల్పి". గుజరాత్‌లోని 'స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ' ముఖ్య మేనేజర్‌, అదనపు కలెక్టర్‌ సంజయ్‌ జోషి పాల్గొంటారు.

* అన్ని వెబినార్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. 

    సామాజిక దూరం, లాక్‌డౌన్‌ మార్గదర్శకాల దృష్ట్యా, ముఖ్యమైన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వర్చువల్‌ మాధ్యమాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంచుకుంది. జాతీయ ఈ-గవర్నెన్స్‌ విభాగానికి చెందిన వెబ్‌ ఆధారిత కాన్ఫరెన్సుల సైట్‌ ద్వారా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. incredibleindia.org, tourism.gov.in సైట్లలో, ఇంక్రెడిబుల్‌ ఇండియా నిర్వహించే సామాజిక మాధ్యమ అకౌంట్లలో పేరు నమోదు వివరాలను చూడవచ్చు.

***



(Release ID: 1644153) Visitor Counter : 157