వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లోని ‘ఆవిష్కరణలు- అగ్రిప్రెన్యూర్ షిప్’ కింద... స్టార్టప్ లకు 2020-21లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిధులు

ఇప్పటికే రూ. 1185.90 లక్షల సాయం పొందిన 112 స్టార్టప్ లకు అదనంగా...

వ్యవసాయ & అనుబంధ రంగాల్లో

మరో 234 ‘స్టార్టప్’లకు రూ. 2485.85 లక్షల మేరకు సాయం

Posted On: 06 AUG 2020 4:59PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి దోహదపడే అవకాశాలను కల్పించడానికి.. యువతకు ఉపాధి చూపించడానికి స్టార్టప్ లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో ఒక భాగంగా ‘ఆవిష్కరణలు, వ్యవసాయ వ్యవస్థాపకత అభివృద్ధి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సాయం అందించడం, ఇంక్యుబేషన్ ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా వినూత్న ఆవిష్కరణలను, వ్యవసాయ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ స్టార్టప్ లు... వ్యవసాయ ప్రాసెసింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యర్ధ్యం నుంచి సంపద, పాల ఉత్పత్తి, మత్య్స సంపద ఉత్పత్తి వంటి వివిధ రకాలుగా ఉన్నాయి.

డి.ఎ.సి&ఎఫ్.డబ్ల్యు ఐదు విజ్ఞాన భాగస్వాములను (కె.పి.లను) అత్యుత్తమ కేంద్రాలుగా ఎంపిక చేసింది. అవి..

  1. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్ మెంట్ (MANAGE), హైదరాబాద్.
  2. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (NIAM), జైపూర్.
  3. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI), పూసా, న్యూఢిల్లీ.
  4. యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్, ధార్వాడ్, కర్నాటక.
  5. అస్సాం అగ్రికల్చర్ యూనివర్శిటీ, జోర్హాట్, అస్సాం.

దేశం మొత్తం మీద 24 ఆర్.కె.వి.వై – ఆర్.ఎ.ఎఫ్.టి.ఎ.ఎ.ఆర్. (రాఫ్టార్) వ్యవసాయ వ్యాపార ఇంక్యుబేటర్ల (ఆర్- ఎబిఐల)ను కూడా నియమించారు.

 

ఈ పథకంలోని భాగాలు కింద విధంగా..

  • అగ్రిప్రెన్యూర్ షిప్ ఓరియంటేషన్ - నెలకు రూ. 10,000 భత్యంతో 2 నెలల కాలం. ఆర్థిక, సాంకేతిక, మేధో సంపత్తి (ఐపి) అంశాలపై మార్గదర్శకత్వం.
  • ఆర్ - ఎబిఐ ఇంక్యుబేటీలకు అంకుర దశలో ఆర్థిక సాయం – రూ. 25 లక్షల వరకు ఆర్థిక సాయం (85 శాతం గ్రాంటు & 15 శాతం ఇంక్యుబేటీ సొంత వాటా).
  • అగ్రిప్రెన్యూర్లకు ఆలోచన దశ/ అంకుర దశకు ముందు ఆర్థిక సాయం – రూ. 5 లక్షల వరకు ఆర్థిక సాయం (90 శాతం గ్రాంటు & 10 శాతం ఇంక్యుబేటీ సొంత వాటా).

సంస్థలు తమ కార్యక్రమాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పిలుపునిస్తాయి. వివిధ దశలలో క్షుణ్ణమైన ఎంపిక ప్రక్రియ, రెండు నెలల శిక్షణ ఆధారంగా.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా నిధులు పొందబోయే స్టార్టప్ ల తుది జాబితాను ఖరారు చేస్తారు. శిక్షణ..  సాంకేతిక, ఆర్థిక, మేధో సంపత్తి తదితర అంశాలపై ఉంటుంది. మైలురాళ్లు, కాలక్రమాలను పర్యవేక్షించడం ద్వారా స్టార్టప్ లకు మార్గదర్శకత్వం వహించడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది.

 

ఇప్పటికే ఆచరణలోకి వచ్చిన కొన్ని స్టార్టప్ లు ఈ కింది పరిష్కారాలను అందిస్తున్నాయి -

  • వెట్ జడ్ జడ్ (VetZZ)గా పేరు పొందిన ‘యాక్టివ్ ఎక్స్ యానిమల్ హెల్త్ టెక్నాలజీస్’ ఒక జంతు వైద్యుల నెట్వర్క్. అది కస్టమర్లతో తక్షణం అనుసంధానం అవుతుంది. అంటే జంతువుల యజమానులకు వాస్తవ సమయంలో టెలీ సంప్రదింపులు, ఇంటి సందర్శనల ద్వారా సేవలు అందుతాయి.
  • ఎస్.ఎన్.ఎల్. ఇన్నొవేషన్స్ –  ‘ఇన్నోఫార్మ్స్’ తమ వద్దనే అభివృద్ధి చేసిన మోనోబ్లాక్ పండ్ల ప్రాసెసింగ్ యంత్రాన్ని (వాహనంపై) ఉపయోగించి నేరుగా పొలం వద్దనే పండ్లు, కూరగాయల గుజ్జును వేరు చేసి అందిస్తుంది. ఇలా తీసిన గుజ్జు ఏడాది పాటు మన్నుతుంది. పొలం నుంచి వినియోగదారు వరకు సరుకు గమనంపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుంది.
  • ఇఎఫ్ పాలిమర్ సంస్థ రైతుల నీటి కొరత సంక్షోభాన్ని అధిగమించే లక్ష్యంతో పర్యావరణ హిత నీటి సంరక్షణ పాలిమర్ ను అభివృద్ధి చేసింది. మట్టిలోపల నీటిని పీల్చుకొని ఎక్కువకాలం నిలిపి ఉంచగల సూపర్ పాలిమర్ ను ఈ స్టార్టప్ తయారు చేసింది. పీల్చుకున్న నీటిని ఈ పాలిమర్ అవసరానికి అనుగుణంగా పంటకు అందిస్తుంది.
  • ఎంపిక చేసిన స్టార్టప్ లలో మహిళల నేతృత్వంలోని పలు సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటి ఎ2పి ఎనర్జీ సొల్యూషన్. ఇది ‘వ్యర్ధ బయో మాస్’ను గుర్తించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ని ఉపయోగిస్తుంది. అనంతరం దాని సేకరణకు రైతులతో కలసి పని చేస్తుంది. ఓవైపు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్న ఎ2పి, మరోవైపు సేకరించిన బయో మాస్ ను ఎనర్జీ పెల్లెట్స్, గ్రీన్ కోల్, బయో ఆయిల్ వంటి భావితరపు బయో ఇంధనాలుగా మారుస్తోంది.
  • ‘క్యారి ఇన్నొవేషన్స్’ ఇండియాలోనూ, అంతర్జాతీయంగానూ మానవ- వన్య ప్రాణుల సంఘర్షణను తగ్గించడం కోసం కృషి చేస్తోంది. యానిమల్ ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ రిపెల్లెంట్ సిస్టమ్ (ANIDERS) పేరిట వారొక సృజనాత్మకత పరికరాన్ని తయారు చేశారు. ఆ పరికరం ఓ యాంత్రిక దిష్టిబొమ్మలా పని చేస్తుంది. జంతువుల చొరబాటు నుంచి పంటలను రక్షిస్తుంది.
  • ‘అగ్స్మార్టిక్ టెక్నాలజీస్’ డేటా ఆధారిత ఆచరణతో కచ్చితమైన నీటిపారుదల, చీడపీడల నిర్వహణ ద్వారా పంటల దిగుబడిని పెంచే విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), కంప్యూటర్ దార్శనికత లను ఉపయోగిస్తారు. వారి ఉత్పత్తి క్రాప్లిటిక్స్® హార్డువేర్, సాఫ్ట్ వేర్ పరిష్కారాల సమ్మిశ్రమం. అది క్షేత్ర స్థాయిలోని సెన్సార్ సమాచారాన్ని, ఉపగ్రహ చిత్రాలను సమీకృతం చేసి ఆ డేటాను తదుపరి చర్య తీసుకోగల సమాచారంగా మలుస్తుంది. అది నీటిపారుదలకు కచ్చితమైన నమూనాను రూపొందిస్తుంది.

 

పైన పేర్కొన్న 6 స్టార్టప్ లకు తోడు, వ్యవసాయ ఆవరణ వ్యవస్థను మెరుగుపరచడానికి.. వ్యవసాయ కుటుంబాల ఆదాయాలను పెంచడానికి సృజనాత్మక పరిష్కారాలతో ముందుకొచ్చిన అనేక సంస్థలు ఉన్నాయి.

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మొత్తం 346 స్టార్టప్ సంస్థలకు ఈ దశలో రూ. 3671.75 లక్షల మేరకు సాయం అందుతోంది. ఈ నిధులు విడతల వారీగా విడుదలవుతాయి. ఈ స్టార్టప్ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న 29 అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రాల (కె.పి.లు & ఆర్.ఎ.బి.ఐ.ల)లో రెండు నెలలపాటు శిక్షణ పొందాయి. ఈ స్టార్టప్ లతో యువతకు ఉపాధి లభిస్తుంది. అదే సమయంలో రైతులకు అవకాశాలు కల్పించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ఆదాయాల పెరుగుదలకు దోహదపడతాయి. వ్యవసాయ వ్యవస్థాపకతపై మరిన్ని వివరాలకు ఆర్.కె.వి.వై. వెబ్ సైట్ https://rkvy.nic.in ను సందర్శించవచ్చు.

*****



(Release ID: 1643974) Visitor Counter : 222