వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండియా- జపాన్ ప్రామాణిక పెట్టుబడిదారుల నుంచి

విశ్వసనీయ భాగస్వాముల కోసం చూస్తున్నాయి: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 06 AUG 2020 3:09PM by PIB Hyderabad

ఇండియా, జపాన్ ప్రామాణిక పెట్టుబడిదారుల నుంచి విశ్వసనీయ భాగస్వాములను పొందాలని చూస్తున్నాయని కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. ప్రత్యేక పెట్టుబడి వేదిక ‘ఇన్వెస్ట్ ఇండియా’ మూడో ఎడిషన్ – జపాన్ ఎడిషన్- లో వీడియో సమావేశం ద్వారా ఆయన ప్రసంగించారు. జపాన్, ఇండియా వాణిజ్య - వ్యాపార సంబంధాలను విస్తరించుకోవడం చాలా ముఖ్యమని జపాన్ కంపెనీల కోసం నిర్వహించిన ఈ డిజిటల్ రోడ్ షోలో శ్రీ పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. ‘‘మనం ఏ ప్రతికూలతనైనా అధిగమించగలమనే విశ్వాసం నాకు ఉంది. భౌగోళిక- రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లోనైనా.. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల అంశాల్లోనైనా.. నిస్సందేహంగా మనం విజయవంతం అవుతాము. మరీ ముఖ్యంగా ఇండియాకు అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన వాణిజ్య భాగస్వాములలో జపాన్ ఒకటి’’ అని మంత్రి చెప్పారు.

 

మంత్రి ఇంకా ‘‘ప్రపంచం కోవిడ్-19 గుప్పిట నుంచి కోలుకున్నందున భారత ప్రభుత్వం వ్యూహాలను, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వ్యాపారాల కొనసాగింపు కోసమూ, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం మాత్రమే కాదు.. తమ పెట్టుబడులకు ఇండియాను ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంచుకోవడాన్ని కొనసాగించేలా ప్రపంచ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తోంది’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని భారీ అవకాశంగా మలుచుకోవడానికి ఈ ప్రభుత్వం చేసిన అతిపెద్ద పనుల్లో ఒకటి అనేక సంస్కరణలను తీసుకురావడం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమలు జరిగిన సంస్కరణలు మన పురోగతిలో ప్రతిబింబిస్తున్నాయని, ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార ర్యాంకులలో ఇండియా గత ఐదేళ్లలో 65 స్థానాలు ముందుకొచ్చిందని చెప్పారు. ఇది జరగడంకోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సానుకూల విధానాలను ప్రవేశపెట్టాయని శ్రీ గోయల్ గుర్తు చేశారు.

 

ఇండో– జపాన్ సన్నిహిత సంబంధాలపై మాట్లాడుతూ.. ఇరు దేశాలూ ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఇండియా, జపాన్ మధ్య ఆర్థిక సంబంధాల వృద్ధికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘భారత దేశ విస్తారమైన, పెరుగుతున్న మార్కెట్ సహా వివిధ కారణాల వల్ల ఈ దేశంపై జపాన్ ఆసక్తి పెరుగుతోంది. భారీ జనాభా, పెరుగుతున్న వినిమయ మార్కెట్ వల్ల ఇండియా జపనీయుల పెట్టుబడులకు ప్రాధాన్య గమ్యస్థానంగా ఉంది. 1400 కు పైగా జపనీయుల కంపెనీలు ఇండియా లోపల పని చేస్తునాయి. మంచి ఆదరణ పొందిన 5000 వ్యాపార సంస్థలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. 10,000 మంది జపనీయ సోదరులు, సోదరీమణులు ఇండియాలో చాలా సంతృప్తికరమైన, మెరుగైన ఉత్పాదక జీవితాన్ని గడుపుతున్నారు.’’ అని శ్రీ గోయల్ వివరించారు.

 

ఆటోమొబైల్స్, రసాయనాలు, వినియోగదారుల వస్తువులు, ఆహార శుద్ధి సహా అనేక రంగాల్లో జపాన్ - ఇండియా సుదీర్ఘ కాలంగా ఫలవంతమైన సంబంధాలను కలిగి ఉన్నాయని, ఇప్పుడు డిజిటల్ ప్రపంచం విస్తారమైన అవకాశాలను కల్పిస్తోందని శ్రీ గోయల్ చెప్పారు. ఇప్పటిదాకా ఇరు దేశాల భాగస్వామ్యాలు సాంకేతిక సహకారంపై దృష్టి సారించాయని.. ఇప్పుడు తాము వ్యూహాత్మక, పెట్టుబడి అభివృద్ధి భాగస్వామిగా జపాన్ వైపు చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జపాన్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలను సహకార ప్రాతిపదికన చేపట్టడానికి ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా అనేక ఒప్పందాలు, చర్చలు జరిగాయని మంత్రి చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన భాగస్వామ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

జపాన్ ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ (మేటి- METI) మంత్రి మిస్టర్ హిరోషి కజియామా మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునే అంశంలో తమ దేశ ఆసక్తిని పునరుద్ఘాటించారు. ‘మేటి’ ఉప మంత్రి మిస్టర్ షిగెహిరో తనాక ‘ఇండియా- జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం’, పురోగమన దిశలపై ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో- JETRO) ఛైర్మన్ మిస్టర్ నోబుహికో ససాకి ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల అనుభవాలపై మాట్లాడారు.

 

ఇండియాలో 13వ జపనీస్ పారిశ్రామిక టౌన్ షిప్ ను అస్సాంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక ఉన్నట్టు కేంద్ర పరిశ్రమలు – అంతర్గత వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర ఈ సందర్భంగా వెల్లడించారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ చర్య లక్ష్యమని ఆయన చెప్పారు. దేశ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, క్లస్టర్లకు సంబంధించి జిఐఎస్ సహిత సమాచార నిధిపై పని చేస్తున్నట్టు గురుప్రసాద్ తెలిపారు.

 

ఈ వెబినార్లో నియంత్రణా వ్యవస్థలు, ‘న్యూ ఇండియా’లో పెట్టుబడి అవకాశాలు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్ట్సైల్స్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ అధికారులు ప్రెజెంటేషన్లు ఇచ్చారు.

 

****

 



(Release ID: 1643971) Visitor Counter : 159