ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
"మైగవ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం"లో చేరిన గోవా; ఇప్పటికే 'మైగవ్ ఫ్లాట్‌ఫాం'లు ప్రారంభించిన 12 రాష్ట్రాలు
పరిపాలన, విధాన నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి "మైగవ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ఫ్లాట్‌ఫాం"ను ప్రారంభించిన గోవా ముఖ్యమంత్రి
పౌరులు www.goa.mygov.in లో పేర్లు నమోదు చేసుకుని, తమ అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలను ప్రభుత్వానికి చెప్పవచ్చు
Posted On:
05 AUG 2020 5:19PM by PIB Hyderabad
రాష్ట్ర పరిపాలనలో పౌరుల పాత్రను పోత్సహించేందుకు "మైగవ్ గోవా" పోర్టల్‌ను గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. దీనిద్వారా "మైగవ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ఫ్లాట్‌పాం"లో గోవా చేరింది. "పరిపాలన ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని 'మైగవ్ గోవా' పోర్టల్ బలోపేతం చేస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పౌరులకు గోవా అనుసంధానమవుతుంది. ప్రభుత్వ విధానాలు, పథకాలపై, వివిధ రంగాల వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు" అని ప్రమోద్ సావంత్ చెప్పారు.
'మైగవ్' (mygov.in) అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రజా భాగస్వామ్య, సమూహ వనరుల ఫ్లాట్‌ఫాం. పరిపాలన, విధాన నిర్ణయాల్లో చురుకైన ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 2014 జులై 26న దీనిని ప్రారంభించినప్పటి నుంచి.., ఇంటర్నెట్, మొబైల్ యాప్స్, ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్, ఔట్‌బౌండ్ డయలింగ్ (ఓబీడీ) సాయంతో చర్చలు, ఆవిష్కరణ సవాళ్లు, సర్వేలు, బ్లాగులు, మాటామంతి, క్విజ్‌లు వంటి వాటిని నిర్వహించారు. 'మైగవ్' యూజర్ల సంఖ్య 1.25 కోట్లను దాటింది. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డిన్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. షేర్‌చాట్, రోపోసో యాప్స్ తరహాలోనే 'మైగవ్' ఇటీవలే ఓ వేదికను ప్రారంభించింది.
రాష్ట్రస్థాయిలో పౌరులకు దగ్గర కావడానికి, సాఫ్ట్‌వేర్-యాజ్-ఏ-సర్వీస్ (ఎస్‌ఏఏఎస్) విధానంలో, రాష్ట్ర ప్రత్యేక కార్యక్రమాల కోసం ప్రజల సలహాలు, సృజనాత్మక ఆలోచనలను సమీకరించడానికి మైగోవ్ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 12 రాష్ట్రాలు.. మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ 'మైగవ్' వేదికలను ప్రారంభించాయి. 'మైగవ్' బృందం ప్రయత్నాలు, రాష్ట్రాల సహకారంతో ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని అందుకుంది. లక్ష్యాలను సాధించేలా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ఆలోచనలు, సలహాలను ప్రజలు ప్రభుత్వంతో పంచుకునేలా 'మైగవ్ గోవా' పోర్టల్ ప్రోత్సహిస్తుందని, గోవా సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీమతి జెన్నిఫర్ మాన్సెరేట్ చెప్పారు.
పాలన, అభివృద్ధిలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించే ప్రాధాన్యత వేదికగా 'మైగవ్' ఎలా మారిందన్న అంశంపై 'మైగవ్ ఇండియా' సీఈవో శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడారు.
ప్రజలు www.goa.mygov.in లో పేరు నమోదు చేసుకుని, తమ అభిప్రయాలు, ఆలోచనలు, సూచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు.
***
(Release ID: 1643605)