ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్ మహమ్మారి సమయంలో అవసరమైన రోగనిరోధక సేవలను నిర్ధారించనున్న - ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఈ-విన్) 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                03 AUG 2020 4:38PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఈ-విన్) అంటే "ఎలక్ట్రానిక్ టీకా మందుల సమాచార యంత్రాంగం" అనేది దేశవ్యాప్తంగా రోగనిరోధకత వస్తువుల / సమాచార వ్యవస్థల సరఫరాను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక వినూత్న సాంకేతిక పరిష్కార ప్రక్రియ.  ఇది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) కింద అమలు జరుగుతోంది.  టీకా నిల్వలు, సరఫరా, మరియు దేశంలోని అన్ని శీతల గిడ్డంగులలో నిల్వ ఉష్ణోగ్రతలపై వాస్తవ సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ఈ-విన్ లక్ష్యం.  అవసరమైన రోగనిరోధకత సేవలను కొనసాగించడాన్ని నిర్ధారించడానికీ, టీకా నివారణ వ్యాధుల నుండి మన పిల్లలు, గర్భిణీ తల్లులను రక్షించడానికీ, కోవిడ్ మహమ్మారి సమయంలో అవసరాలకు అనుగుణంగా రూపొందించి ఈ బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 
దేశవ్యాప్తంగా వివిధప్రాంతాల్లో ఉంచిన టీకా వ్యాక్సిన్ల స్టాక్ మరియు నిల్వ ఉష్ణోగ్రత యొక్క వాస్తవ సమాచారాన్ని పర్యవేక్షించడం కోసం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, బలమైన ఐటి మౌలిక సదుపాయాలు మరియు శిక్షణ పొందిన మానవ వనరులను ఈ-విన్ అనుసంధానం చేస్తుంది. 
ఈ-విన్ ప్రస్తుతం 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (యు.టి) లకు చేరుకుంది.  త్వరలోనే మిగిలిన రాష్ట్రాలతో పాటు, అండమాన్ & నికోబార్ దీవులు, చండీగఢ్, లడఖ్, సిక్కిం వంటి కేంద్రపాలితప్రాంతాలకు కూడా చేరుకోనుంది.  ప్రస్తుతం, 22 రాష్ట్రాలు, 2 కేంద్రపాలితప్రాంతాల్లోని 585 జిల్లాల్లో 23,507 శీతల గిడ్డంగులు టీకా, వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ కోసం ఈ-విన్ సాంకేతికతను సమర్ధవంతంగా ఉపయోగిస్తున్నాయి. 41,420 కి పైగా టీకా, వ్యాక్సిన్లు నిల్వచేసే శీతల గిడ్డంగుల నిర్వాహకులకు ఈ-విన్ ద్వారా డిజిటల్ పద్దతిలో సమాచారాన్ని నమోదుచేసే విధానంలో  శిక్షణ ఇవ్వడం జరిగింది.   వ్యాక్సిన్ల నిల్వలో ఖచ్చితమైన ఉష్ణోగ్రతల సమీక్ష కోసం టీకాలను భద్రపరిచే శీతల పరికరాలపై దాదాపు 23,900 ఎలక్ట్రానిక్ ఉష్ణోగ్రత లాగర్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఒక పెద్ద సమాచార వ్యవస్థను రూపొందించడంలో సహాయపడింది.   ఇది సమాచారం ఆధారంగా నిర్ణయాధికారం, వినియోగం ఆధారంగా ప్రణాళికను ప్రోత్సహించే కార్యాచరణ విశ్లేషణలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఖర్చును తగ్గించే విధంగా వ్యాక్సిన్ల నిల్వలను నియంత్రించడానికి సహాయపడుతుంది.  ఈ విధానం కారణంగా, చాలా ఆరోగ్య కేంద్రాల్లో,  టీకాల  లభ్యత 99 శాతానికి పెరిగింది.  ఈ-విన్ ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం 99 శాతం కంటే ఎక్కువగా ప్రతిబింబిస్తోంది.  నిల్వ లేకుండా పోయే సందర్భాలు 80 శాతం తగ్గాయి. స్టాక్ లను తిరిగి నింపడానికి తీసుకునే సమయం కూడా సగటున సగానికి పైగా తగ్గింది.  రోగనిరోధక టీకాలు ఇచ్చే కేంద్రాలకు చేరుకున్న ప్రతి బిడ్డకు వ్యాక్సిన్ అందే విధంగా ఇది తోడ్పడుతోంది. అదేవిధంగా టీకాలు అందుబాటులో లేని కారణంగా ఎవరూ వెనక్కి తిరిగి వెళ్లకుండా ఇది సహాయపడుతోంది. 
కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, కోవిడ్ ప్రతిస్పందన సామగ్రి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడానికి రాష్ట్రాలు  /  కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ-విన్ ఇండియా సహాయం చేస్తోంది.   2020, ఏప్రిల్ నుండి, ఎనిమిది రాష్ట్రాలు (త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర) తమ రాష్ట్రలకు అవసరమైన కోవిడ్-19 సామాగ్రి నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికీ, లభ్యతను నిర్ధారించడానికీ, 81 రకాల అత్యవసర మందులు, పరికరాల కొరత ఏర్పడినప్పుడు వాటి ఆర్డర్లను పెంచడానికీ, ఈ-విన్ వ్యవస్థను 100 శాతం సంతృప్తితో ఉపయోగిస్తున్నాయి. 
భవిష్యత్తులో కోవిడ్-19 వ్యాక్సిన్‌తో సహా ఏదైనా కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా, ఈ పటిష్టమైన వ్యవస్థ, సమర్ధవంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది.  
*****
 
                
                
                
                
                
                (Release ID: 1643223)
                Visitor Counter : 440