మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతీయ విద్యా విధానం-2020 దేశంలో పాఠశాల, ఉన్నత విద్యా విధానంలో సంస్కరణాత్మక మార్పులు తెస్తుంది: మానవవనరుల శాఖామంత్రి
దేశంలో అతిపెద్ద చర్చోపచర్చల ప్రక్రియ ఫలితమే జాతీయ విద్యావిధానం: శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిశాంక్’

జాతీయ విద్యావిధానం 2020 అత్యంత సమగ్రం, విప్లవాత్మకం, పురోగామి విధాన పత్రం: శ్రీ సంజయ్ ధోత్రే

Posted On: 29 JUL 2020 8:40PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం-2020 దేశంలో పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణాత్మక మార్పులు తెస్తుందని  కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిశాంక్’ అన్నారు. ఈ సరికొత్త విద్యావిధానానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసిన అనంతరం మాయమ న్యూఢిల్లీలో మీడియానుద్దేశించి మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిగిన తరువాత ఈ కొత్త విద్యావిధానానికి తుది మెరుగులు దిద్దినట్టు చెప్పారు. ప్రజాభిప్రాయం కోసం ముసాయిదాను వెబ్ సైట్ లో అందరికీ అందుబాటులో ఉంచగా 2.25  లక్షల సూచనలు వచ్చాయన్నారు.
జాతీయ విద్యా విధానం-2020కి ఆమోదం తెలియజేసినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రిమండలికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ విధానాన్ని అమలు చేసిన తరువాత భారత్ ఒక విజ్ఞాన కేంద్రంగాను, ప్రపంచంలోనే ఒక విద్యాగమ్యస్థానం గాను మారుతుందని శ్రీ రమేశ్ పోఖ్రాల్ ’నిశాంక్’ అభివర్ణించారు.


నవభారత నిర్మాణంలో ఈ జాతీయ విద్యా విధానం-2020 కీలకపాత్ర పోషిస్తుందని శ్రీ నిశాంక్ అన్నారు. దీని రూపకల్పనలో పాలుపంచుకున్న విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. దీన్ని దేశ చరిత్రలో  ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ విధానం దేశంలో పాఠశాల, ఉన్నత విద్యా విధానంలో సంస్కరణాత్మక మార్పులు తెస్తుందన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందటానికి, దేశమంతటా బాల్యం నుంచే విద్య అందటానికి దోహద చేస్తుందన్నారు. సామాజిక సామర్థ్యాలు, సత్ప్రవర్తన, సున్నిత స్వభావం, నైతిక విలువలు, ఉమ్మడి పనితనం, సహకారం లాంటి లక్షణాలను బాల్యం నుంచే నేర్పుతామన్నారు. ఇదంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య సాగుతుందని కూడా తెలియజేశారు.
ఇది 1986 నాటి జాతీయ విద్యావిధానం స్థానంలో రూపుదిద్దుకున్నదని చెబుతూ 21వ శతాబ్దానికి ఇదే తొలి విద్యావిధానమన్నారు. అందుబాటు, సమన్యాయం, నాణ్యత, జవాబుదారీతనం వ్యవస్థాపక స్తంభాలుగా దీని నిర్మాణం జరిగిందన్నారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి అనే ఎజెండాకు అనుగుణంగా రూపొందించామని కూడా చెప్పారు. పాఠశాల, కళాశాల విద్యను సంపూర్ణంగా, బహుళ అంశాలతో 21వ శతాబ్ద అవసరాలకు  తగినట్టు తీర్చిదిద్ది భారతదేశాన్ని ఒక చురుకైన విజ్ఞాన సమాజం గాను, విశ్వ విజ్ఞానంలో ఒక మహత్తర శక్తిగాను మార్చటమే దీని లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రత్యేల సామర్థ్యాలను వెలికి తీయటానికి పనిచేస్తామని చెప్పారు. 


మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, జాతీయ విద్యావిధానం-2020 ఈ దేశ విద్యావిధానంలో అత్యంత సమగ్రం, విప్లవాత్మకం, పురోగామి విధాన పత్రమని  అభివర్ణించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందటంలో ఎలాంటి అవరోధాలకూ తావివ్వకుండా చూస్తుందన్నారు. పిల్లలకు చదువులో పునాదులు పడే 3-5 ఏళ్ళ వయసునుంచే వాళ్ళ రక్షణ, విద్యావసారాలు చూసుకుంటుందని చెప్పారు. పిల్లల్లో క్లిష్టమైన స్థితిలో ఆలోచనావిధానాన్ని, అనుభవాన్ని అమలు చేయటంలో నైపుణ్యాన్ని, ఆచరణాత్మకమైన అధ్యయనాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. జీవన నైపుణ్యాలమీద దృష్టి పెట్టటం, బహుళ అంశాల పట్ల అవగాహన, ఎప్పటికప్పుడు సమీక్ష ఈ విధానపు లక్షణాలుగా ఉంటాయన్నారు, మధ్యలోనే వదువు మానేసిన దాదాపు 2 కోట్ల మంది పిల్లల్ని మళ్ళీ వెనక్కు తీసుకురావటం, మూడేళ్ళనుంచే సార్వత్రిక విద్య అందేలా చూడటం, ఎవరినీ వదిలెయ్యకూడదన్న మూల సూత్రం మన విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తాయని శ్రీ సంజయ్ ధోత్రే ఆకాంక్షించారు.
జాతీయ విద్యావిధానం మీద సవివర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

***(Release ID: 1642221) Visitor Counter : 147