రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం 5వ వర్ధంతి సందర్భంగా, ఆవిష్కర్తలు, అంకుర సంస్థల కోసం "డేర్‌ టు డ్రీమ్‌ 2.0" పోటీని ప్రారంభించిన డీఆర్‌డీవో

Posted On: 27 JUL 2020 8:59PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం 5వ వర్ధంతి సందర్భంగా, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), "డేర్‌ టు డ్రీమ్‌ 2.0" పోటీని ప్రారంభించింది. మిస్సైల్‌ మ్యాన్‌గా డా.కలాం సుపరిచితుడు. స్వావలంబన దృక్పథంతో పనిచేసిన వ్యక్తి. రక్షణ, ఏరో స్పేస్ విజ్ఞానాల్లో నూతన ఆవిష్కరణల కోసం వ్యక్తులు, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఈ పోటీని డీఆర్‌డీవో ప్రారంభించింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన "ఆత్మనిర్భర్‌ భారత్‌"లో భాగంగా దీనికి రూపకల్పన చేసింది.
 
    దేశంలోని ఆవిష్కర్తలు, అంకుర సంస్థలకు 'డేర్‌ టు డ్రీమ్‌ 2.0' ఒక బహిరంగ సవాలు. నిపుణుల కమిటీ నిశిత పరిశీలన తర్వాత విజేతను నిర్ణయిస్తారు. అంకుర సంస్థల విభాగంలో రూ.10 లక్షలు, వ్యక్తుల విభాగంలో రూ.5 లక్షలను విజేతలకు బహుమతిగా ఇస్తారు.
 
    పోటీని ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో వెబ్‌సైట్‌ www.drdo.gov.in లో మరింత సమాచారాన్ని త్వరలోనే అందుబాటులో ఉంచుతారు.

***
   



(Release ID: 1641728) Visitor Counter : 392