ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్-హెల్త్ & వెల్నెస్ కేంద్రాలు (ఏ.బి-హెచ్.డబ్ల్యూ.సి.లు) కోవిడ్ కాలంలో తమ ఉనికిని చాటుకున్నాయి.
ఒక్క వారంలోనే 43,000 కంటే ఎక్కువ కేంద్రాలను 44 లక్షల మందికి పైగా ప్రజలు సందర్శించారు.
Posted On:
27 JUL 2020 4:45PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భారత దేశ ప్రజారోగ్య వ్యవస్థలకు చెందిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు (ఏ.బి-హెచ్.డబ్ల్యూ.సి.లు) నిరంతర కార్యాచరణ ద్వారా తమ ఉనికిని చాటుకున్నాయి. కోవిడ్ కాని ముఖ్యమైన ఆరోగ్య సేవలతో పాటు, కోవిడ్-19 యొక్క నివారణ మరియు నిర్వహణ యొక్క అత్యవసర సేవలను కూడా ఈ కేంద్రాలు అందజేశాయి.
పౌరులకు విస్తారమైన సేవలందించడానికి వీలుగా, కోవిడ్-19 మహమ్మారి కాలంలోనే (2020 జనవరి నుండి 2020 జూలై వరకు) అదనంగా 13,657 హెచ్.డబ్ల్యు.సి.లు కూడా పనిచేస్తున్నాయి. 2020 జూలై 24వ తేదీ నాటికి, దేశంలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 43,022 హెచ్.డబ్ల్యు.సి. లు పనిచేస్తున్నాయి.
2020 జూలై 18వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు వారం రోజుల్లో, మొత్తం 44 లక్షల 26 వేల మంది ప్రజలు ఎ.బి-హెచ్.డబ్ల్యు.సి.లు అందిస్తున్న ఆరోగ్య మరియు సంరక్షణ సేవల ద్వారా లబ్ది పొందారు. ఈ కేంద్రాలు ప్రారంభమైనప్పటి నుండి (అంటే 2018ఏప్రిల్ 14వ తేదీ నుండి) ఇంతవరకు లబ్దిపొందినవారి సంఖ్య 1923.93 లక్షలకు పెరిగింది. ఇది వారి సమాజాలలో హెచ్.డబ్ల్యు.సి.ల ప్రారంభ పనికి నిదర్శనం. కోవిడ్ కాని ముఖ్యమైన సేవలకు ఆటంకం కలగకుండా, నిరంతరాయంగా కొనసాగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారతదేశవ్యాప్తంగా ఎబి-హెచ్.డబ్ల్యు.సి.లలో గత వారంలో 32,000 యోగా తరగతులు నిర్వహించారు. హెచ్.డబ్ల్యు.సి.లు ప్రారంభమైనప్పటి నుండి ఇంతవరకు మొత్తం 14.24 లక్షల యోగా తరగతులు నిర్వహించారు.
వీటితో పాటు, సంక్రమించని వ్యాధుల కోసం భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడంలో హెచ్.డబ్ల్యు.సి.లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కేవలం, గత వారం రోజుల్లోనే, ఈ కేంద్రాల్లో, 3.83 లక్షల మందికి రక్తపోటు పరీక్షలు, 3.14 లక్షల మందికి మధుమేహ వ్యాధి పరీక్షలు, 1.15 లక్షల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 45,000 మందికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 36,000 మందికి గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. హెచ్.డబ్ల్యు.సి.లు ప్రారంభమైనప్పటి నుండి ఇంతవరకు మొత్తం 4.72 కోట్ల మందికి రక్తపోటు పరీక్షలు, 3.14 కోట్ల మందికి మధుమేహం పరీక్షలు, 2.43 కోట్ల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.37 కోట్ల మందికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 91.32 లక్షల మందికి గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాయి.
మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో, జనాభా-ఆధారంగా, సంక్రమణ రహిత వ్యాధుల కోసం పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, దుర్బలులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారి వివరాలను రాష్ట్ర అధికారులకు అందించినందున, కోవిడ్-19 వారికి సోకకుండా ప్రాధాన్యతా క్రమంలో వారికి తగిన వైద్య సహాయం అందించడానికి ఈ ఏ.బి-హెచ్.డబ్ల్యూ.సి.లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులను వేగంగా పరీక్షించగల మరియు సంక్రమణ నుండి రక్షణ కోసం సలహాలను అందించే సామర్థ్యం ఈ కేంద్రాలకు ఉండడంతో అవి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోగలుగుతున్నాయి. హెచ్.డబ్ల్యు.సి. బృందాలు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ టి.బి, కుష్టు వ్యాధి, రక్తపోటు, మధుమేహ వ్యాధి రోగులకు అవసరమైన మందులను పంపిణీ చేయడంతో పాటు, గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
*****
(Release ID: 1641684)
Visitor Counter : 302