భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత వాతావరణ విభాగం రూపొందించిన "మౌసమ్‌" యాప్‌ విడుదల

వాతావరణం, అంచనాలు, రాడార్ చిత్రాలను ప్రజలు చూసే వెసులుబాటు; వాతావరణ పరిస్థితులపై ముందుగానే హెచ్చరికలు

Posted On: 27 JUL 2020 4:08PM by PIB Hyderabad

అత్యాధునిక పరిజ్ఞానం ఆధారంగా, వాతావరణ సూచనలు, హెచ్చరికలను బహుళ వ్యాప్తి చేయడానికి, కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం ఇటీవలి కాలంలో ఎన్నో చర్యలు చేపట్టింది. దీనిని మరింత మెరుగుపరచడానికి "మౌసమ్‌" మొబైల్‌ యాప్‌ను మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది.

ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

    సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ యాప్‌ రూపొందించారు. స్పష్టమైన పద్ధతిలో, సాంకేతిక పదాలు లేకుండా వాతావరణ సమాచారం, హెచ్చరికలను ఈ యాప్‌లో ఉంచుతారు.  

    వాతావరణం, అంచనాలు, రాడార్ చిత్రాలను ఈ యాప్‌లో ప్రజలు వీక్షించవచ్చు. వాతావరణ పరిస్థితులపై ముందుగానే హెచ్చరికలు అందుకునే వెసులుబాటు ఉంది.
       
    మౌసమ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా క్రింది సేవలు లభిస్తాయి:

* ప్రస్తుత వాతావరణం- దేశంలోని 200 నగరాలకు సంబంధించిన ప్రస్తుత ఉష్ణోగ్రత, తేమ శాతం, గాలి వేగం. రోజుకు 8 సార్లు అప్‌డేషన్‌.
*తక్షణ మార్పులు- దేశంలోని 800 ప్రాంతాలు, జిల్లాలకు చెందిన స్థానిక వాతావరణం, తీవ్రత గురించి మూడు గంటలకోసారి హెచ్చరికలు. వాతావరణంలో తీవ్రస్థాయి మార్పులు ఉంటే, ఆ ప్రభావంపైనా హెచ్చరికలు.
*నగరాలకు సూచనలు- దేశంలోని 450 నగరాలకు సంబంధించిన గత రోజు, వచ్చే వారం రోజుల వాతావరణ సమాచారం.
*హెచ్చరికలు- అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం రోజుకు రెండుసార్లు చొప్పున, వచ్చే ఐదు రోజుల వాతావరణంతో హెచ్చరికలు. ప్రజలను అప్రమత్తం చేయడానికి మూడు రంగుల్లో (ఎరుపు, నారింజ, పసుపు) హెచ్చరికలు. ప్రమాదకర వాతావరణాన్ని సూచించడానికి ఎరుపు రంగు హెచ్చరిక. తక్షణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఇది సూచిస్తుంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారింజ రంగు, తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలని పసుపు రంగు సూచిస్తుంది.
* రాడార్‌ సమాచారం- తాజా ప్రాంతం వారీగా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రాడార్ సమాచారం.
    
    ప్రజల అవసరాలకు తగ్గట్లుగా, ఆకర్షణీయమైన, స్నేహపూర్వక పద్ధతిలో వాతావరణ సమాచారం, హెచ్చరికలను ప్రజల్లోకి చేర్చడానికి మౌసమ్‌ యాప్‌ ముఖ్యమైన సాధనం.

    'ఐసీఆర్‌ఐఎస్‌ఏటీ'కి చెందిన డిజిటల్‌ అగ్రికల్చర్‌&యూత్ (డీఏవై) బృందం, పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెట్రాలజీ (ఐఐటీఎం), భారత వాతావరణ విభాగం కలిసి ఈ మొబైల్‌ యాప్‌ను వృద్ధి చేశాయి.

***(Release ID: 1641658) Visitor Counter : 330