కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అన్ని చిన్న పొదుపు పథకాలను బ్రాంచ్ పోస్టాఫీస్ స్థాయికి విస్తరించిన తపాలా శాఖ

తపాలా శాఖ పొదుపు పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లి, గ్రామీణ భారతాన్ని సాధికారం చేయడం లక్ష్యం

Posted On: 24 JUL 2020 7:57PM by PIB Hyderabad

తపాలా శాఖ పరిధిని, గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలను బలోపేతం చేయడానికి; చిన్న పొదుపు పథకాలను గ్రామాల్లోని అధిక శాతం జనాభాకు చేరువ చేయడానికి అన్ని చిన్న పొదుపు పథకాలను బ్రాంచ్ పోస్టాఫీస్ స్థాయికి తపాలా శాఖ విస్తరించింది. 

    భారత గ్రామీణ ప్రాంతాల్లో 1,31,113 బ్రాంచ్‌ పోస్టాఫీసులు పని చేస్తున్నాయి. ఉత్తరాలు, స్పీడ్‌ పోస్టులు, పార్శిళ్లు, ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్లు, గ్రామీణ తపాలా జీవితబీమా వంటివాటితోపాటు, పొదుపు ఖాతాలు, రికరింగ్‌ డిపాజిట్లు‌, కాలపరిమితి డిపాజిట్లు, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు వంటివాటిని ఇప్పటివరకు ఇవి అందిస్తున్నాయి.

    కొత్త ఆదేశాల ప్రకారం, ఇక నుంచి, ప్రజా భవిష్య నిధి, నెలవారీ ఆదాయ పథకం, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలు, సీనియర్‌ సిటిజన్ పొదుపు ఖాతాలు వంటివి కూడా ఇవి అందిస్తాయి. పట్టణ ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల్లో ఏ సౌకర్యాలను అక్కడి ప్రజలు పొందుతున్నారో, ఇక నుంచి గ్రామీణ ప్రాంత తపాలా కార్యాలయాల్లోనూ అవే సౌకర్యాలను పల్లె ప్రజలు పొందుతారు. వారి పల్లెల్లోనే, ప్రజాదరణ పొందిన పథకాల్లో నగదును పొదుపు చేసే అవకాశం వారికి లభిస్తుంది.

    అన్ని పొదుపు పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లి, గ్రామీణ భారతాన్ని సాధికారం చేసే దిశగా తపాలా శాఖ తీసుకున్న చర్యల్లో ఇదొకటి.

***



(Release ID: 1641048) Visitor Counter : 161