ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అవినీతిరహిత భారతం మనందరి లక్ష్యం కావాలి: ఉపరాష్ట్రపతి

- రాజ్యాంగ పవిత్రతను కాపాడటం ప్రజలందరి బాధ్యత
- ప్రజాస్వామ్యానికి జవాబుదారితనం, పారదర్శకత, సుపరిపాలన పట్టుకొమ్మలు
- కాగ్ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 22 JUL 2020 12:15PM by PIB Hyderabad

భారతదేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. 

‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగుండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం‘ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారిచూపిస్తోందన్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు. ‘ఇలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఆయన గుర్తుచేశారు. జవాబుదారీతనం, పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలన్న ఉపరాష్ట్రపతి.. స్వతంత్రత, నిష్పాక్షికత, సమగ్రత, విశ్వసనీయత, శ్రేష్ఠత, పారదర్శకత, సానుకూల దృక్పథం మొదలైన కాగ్ మూలవిలువలకు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితమే ప్రేరణ అని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో కార్యకుశలత, కార్యసాధత వంటివి పెరిగేందుకు.. ప్రభుత్వం యంత్రాంగం లోపాలను సరిదిద్దుకుని మార్పులు, చేర్పులతో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లేందుకు కాగ్ ఇచ్చే నివేదికలు ఎంతగానో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. 

‘2022 కల్లా కాగితరహిత కార్యలాపాలు నిర్వహించాలన్న కాగ్ నిర్ణయం ముదావహం’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ రాజీవ్ మెహర్షి, డిప్యూటీ కాగ్ శ్రీమతి అనితా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

***(Release ID: 1640405) Visitor Counter : 193