పర్యటక మంత్రిత్వ శాఖ

మహేశ్వర్, మండూ, ఓంకారేశ్వర్ క్షేత్రాలపై “ఆధ్యాత్మిక త్రికోణం” పేరిట వెబినార్ నిర్వహణ

“దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద 42వ సదస్సుకు
కేంద్ర పర్యాటక శాఖ శ్రీకారం

Posted On: 20 JUL 2020 12:56PM by PIB Hyderabad

మహేశ్వర్, మండూ, ఓంకారేశ్వర్ క్షేత్రాలపై ఆధ్యాత్మిక త్రికోణం పేరిట వెబినార్.ను కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ 2020 జూలై 18 నిర్వహించింది. “దేఖో అప్నా దేశ్”  పేరిట కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబినార్ కార్యక్రమాల్లో భాగంగా వర్జువల్ సదస్సును చేపట్టారు. ఆధ్యాత్మిక త్రికోణం పేరిటఆయా ఆధ్యాత్మిక పర్యాటక స్థలాల  గొప్పతనాన్ని వివరిస్తూ ఇండోర్ కు చెందిన ఆదాయంపన్ను శాఖ కమిషనర్ అసిమా గుప్తా, సింగపూర్ కు చెందిన మార్కెటింగ్ నిపుణురాలు సరితా అలూర్కర్ వెబినార్ ను నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వర్, మండూ, ఓంకారేశ్వర్ క్షేత్రాల ఆహ్లాదరకరమైన మార్గాలను, నిర్మలమైన ప్రశాంత వాతావరణాన్ని కళ్లకుగట్టినట్టుగా   అభివర్ణించారు. ఏక్ భారత్శ్రేష్ట భారత్ పేరిట దేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాల విభిన్నత్వాన్ని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పడమే లక్ష్యంగా దేఖ్ అప్నా దేశ్ వెబినార్ సిరీస్ కు రూపకల్పన చేశారు. అయా క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు మన కళ్ళముందే ఉన్నట్టుగా చూపించే వర్చువల్ రియాలిటీ స్ఫూర్తిని నిరాటంకంగా కొనసాగించేందుకు ఒక వేదికగా ఏక్ భారత్ శ్రేష్ట భారత్ దోహదపడుతోంది.

   ఆధ్యాత్మిక త్రికోణంలో భాగంలో తొలి పర్యాటక గమ్యస్థానం మహేశ్వర్ లేదా మాహిష్మతి క్షేత్రం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరానికి 90కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మహేశ్వర్. పర్యాటకుల మనసును కట్టిపడేసే ఆకర్షణీయమై నిర్మల వాతావరణం దీని ప్రత్యేకత. శివుడు, మహేశ్వరుడి పేరిట వెలసిన   క్షేత్రం గురించి రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించారు. నర్మదా నది ఉత్తర తీరంలో ఉన్న మాల్వా సామ్రాజ్యపు రాజధానిగా వెలుగందిన మహేశ్వర్ పట్టణం,.. మరాఠా  మహారాణి, రాజమాత అహల్యా దేవి హోల్కర్ గురించి అసిమా గుప్తా, సరితా అరూల్కర్ ఎంతో విపులంగా వివరించారు. 1818 సంవత్సరం జనవరి 6వరకూ మాల్వా సామ్రాజ్యపు రాజధానిగా మహేశ్వర్ పట్టణం విలసిల్లింది. తర్వాత 3 మరాఠా హోల్కర్ మహారాజు అయిన మల్హర్ రావు హోల్కర్ రాజధానిని ఇండోర్ కు బదిలీ చేశారు. 18 శతాబ్దపు చివరి దశలో మహేశ్వర్ పట్టణం మరాఠా రాజమాత అహల్యా దేవి హోల్కర్ కు రాజధాని నగరంగా ఉండేది. రాజధాని ఠీవికి తగినట్టుగా అనేక భవనసముదాయాలతో, పలు దేవాలయాలతో మహేశ్వర్ పట్టణాన్ని అహల్యాదేవి తీర్చిదిద్దారు. చక్కని కోటను, నర్మదా నదీ తీరంలో స్నానఘట్టాలను నిర్మింపజేశారు.

    ఆమె నిరాడంబరత్వానికి కూడా పేరుపొందారు. ప్రజలను కలుసుకునేందుకు ఆమె ఉపయోగించిన రెండస్తుల రాజనివాసం లేదా రాజవాడను పరిశీలించినపుడు ఆమె నిరాడంబరత్వం అర్థమవుతుంది. అప్పటి రాజ్యపరిపాలనా వ్యవస్థ, మహారాణికి సంబంధించిన ఇతర అంశాలను కూడా పర్యాటకులు తెలుసుకోవచ్చు.

  మహారాణి అహల్యాదేవి పూజలు, ప్రార్థనలు చేసిన అహల్యేశ్వర్ ఆలయం, ఆలయానికి సమీపంలోనే ఉన్న విఠల్ దేవాలయం మహేశ్వర్ పట్టణంలో  తప్పనిసరిగా చూడవలసిన స్థలాలు. ఆలయాల వాస్తుశిల్ప నైపుణ్యం కూడా పర్యాటకులను అలరిస్తుంది. రాజమాత అహల్య తన హయాంలో దాదాపు 91 దేవాలయాలను నిర్మించారు

   నర్మదా నదీ తీరంలో ఉన్న ఘాట్ల ఘాట్లపై నిలబడి సూర్యోదయ, సూర్యాస్తమయ సౌందర్యాన్ని తనివితీరా చూడవచ్చు. అహల్యా ఘాట్ నుంచి  అందమైన రాజకోట భవనసముదాయాన్ని కూడా చూడవచ్చునర్మదా నదీ జలాల్లో బోటు షికారు సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సూర్యాస్తమయం తర్వాత అయితే, బోటును నడిపే సరంగులు చిరు దివ్వెలతో నర్మదా మాతకు హారతి పడతారు. ఇక బనేశ్వర్ దేవాలయం మహేశ్వరంలో తప్పనిసరిగా చూడవలసిన దర్శనీయ స్థలాల్లో ఒకటిగా పేరుగాంచింది. ప్రత్యేకించి సూర్యాస్తమయ సమయంలో ఆలయ సౌదర్యం చూపరులను కట్టిపడేస్తుంది. సూర్యాస్తమయ సమయంలో నర్మదా ఘాట్లలో నదీ హారతి నిర్వహిస్తారు.

   మహేశ్వర్.లో రాణీ అహల్యా దేవి అభివృద్ధిచేసిన జవుళి, వస్త్ర పరిశ్రమ ఎంతో ముఖ్యమైనది. ఆమె సూరత్ నుంచి, దక్షిణ భారత ప్రాంతాలనుంచి చేనేత నిపుణులను పిలిపించి, విభిన్నమైన అందమైన చీరలను నేయించారుకోట వాస్తు సౌందర్యం, నర్మదా నది నేపథ్యంగా చీరలపై డిజైన్లను రూపొందించారు. రాజ కుటుంబాన్ని సందర్శించే అతిథులకు చీరలను బహుమానంగా ఇచ్చేవారు. రాజమాత అహల్యా దేవి కళలను ఎంతగానో ఆదరించారు. గొప్ప కళాపోషకురాలుగా పేరుగాంచారుఆమెకు చీరలంటే ఎంతో ఇష్టం. 1760 సంవత్సరంలో సూరత్ నుంచి సుప్రసిద్ధులైన చేనేత కళాకారులను రప్పించి, రాజకుటుంబానికి, తమ సామ్రాజ్యానికి దీటైన రీతిలో చీరలను, వస్త్రాలను నేయించారు. వారి హయాంలో చేనేత కళాకారులు ఎంతో ఆదరణ పొందారు. మహేశ్వర్ వస్త్రం పేరిట నేటికీ ప్రసిద్ధిగాంచిన ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేయడంలో వారు తమ నైపుణ్యాన్ని చాటారు. కాల క్రమేణా 1950లో నూలు వస్త్రాల నేత, తర్వాత, పట్టు వస్త్రాల నేత మొదలైంది. తర్వాత 1979లో నేత కార్మికులకోసం రేవా సొసైటీ ఏర్పాటైంది. మహేశ్వర్ పట్టణంలోని నేతన్నల సంక్షేమం కోసం లాభాపేక్ష లేని సంస్థగా సొసైటీ సేవలందిస్తూ వస్తోంది.

   ఇక. ఆధ్యాత్మిక త్రికోణంలో భాగమైన, ఓంకారేశ్వర్ క్షేత్రంలో 33 దేవుళ్ల, దేవతల ఆలయాలు, 108 పవిత్ర శివలింగాలు ఉన్నాయి. నర్మదానదీ దక్షిణ తీరంలో ఉన్న జ్యీతిర్గింగ క్షేత్రంగా ఓంకారేశ్వర్ ప్రసిద్ధి పొందింది. మధ్యప్రదేశ్ లో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన ఓంకారేశ్వర్ ఇండోర్ కు 78కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఓంకారేశ్వర్ లో మామ్లేశ్వర్ ఆలయాన్ని సందర్శించకపోతే, ఓంకారేశ్వర్ పర్యటన సంపూర్ణంకాదు. మహాశివుడు ప్రతిరోజూ విశ్రాంతికోసం ఇక్కడికి వస్తాడని భక్తుల విశ్వాసం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు ఇక్కడ మహాశివుడికి శయన హారతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాదేవి పార్వతీదేవితో కలసి శివుడి పాచికలాటకు ఏర్పాట్లు చేస్తారు. ఎంతో సుందరమైన సిద్ధాంత్ ఆలయం కూడా ఇక్కడ తప్పనిసరిగా చూడవలసిన ఆధ్యాత్మిక స్థలం.

    ఇక మండూ,.. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉంది. దీన్నే మాండవగఢ్, శాదియాబాద్ (ఆనంద నగరం)గా వ్యవహరిస్తారు. ఇండోర్ కు 98 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండూ 633మీటర్ల ఎత్తులో ఉంది. 124 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్లాం స్టేషన్,.. మండూ ప్రాంతానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. 47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోట నిర్మితమైంది. కోట ప్రాకారం గోడ 64 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంది. మాల్వా సామ్రాజ్యపు చివరి సుల్తాన్ బజ్ బహదూర్, రాణీ రూపమతి ప్రేమ గాథకు మండూ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

  ఒకసారి సుల్తాన్ బజ్ బహదూర్ వేటకు వెళ్లాడు అక్కడ తన స్నేహితురాళ్లతో తుళ్లుతూ ఆటపాటల్లో ఉన్న రూపమతి అనే గొల్లయువతిని చూశాడు. రూపమతి సౌందర్యానికి, గాత్ర మాధుర్యానికి సుల్తాన్ పరవశుడై ఆమెపై మనసు పారేసుకున్నాడు. తనతో కలసి రాజధానికి రావలసిందిగా ఆయన రూపమతిని కోరాడు. అయితే, తాను ఎంతగానో ఇష్టపడే, గౌరవించే నర్మదానది కనపడేలా ఉండే భవనంలో నివసించేందుకు అవకాశం ఇస్తే తాను వస్తానని రూపమతి షరతు విధించింది. షరతుతోనే మండూ ప్రాంతంలో రేవాకుండ్ అనే భవనం నిర్మితమైంది. రూపమతి సౌందర్యం, గాత్రసౌందర్యం గురించి తెలుసుకున్న మొఘలాయీలు మండూ రాజ్యంపై దాడి చేసి, సుల్తాన్.ను, రూపమతిని బంధించాలని నిర్ణయించుకున్నారు. మొఘలాయీల సైన్యం మండూ కోటవైపు సాగుతుండగానే, చాలా సునాయాసంగా మండూ రాజ్యం వారి వశమైపోయింది. శత్రువులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు రూపమతి విషంతీసుకుంది. మండూలో బజ్ బహదూర్ సుల్తాన్ నిర్మించిన రాజప్రాసాదం 16 శతాబ్దంలో నిర్మితమైంది. విశాలమైన సమావేశ మందిరాలతో ఎంతో విస్తారంగా కోటను నిర్మించారు. రూపమతి నివసించిన రాజమందిరానికి దిగువగా ఈకోట ఉంది. రూపమతి మందిరంనుంచి కోటను చూడవచ్చు.

రేవా కుండ్

  రాణీ రూపమతి మందిరానికి నీటి సరఫరా కోసం సుల్తాన్ బజ్ బహదూర్ నిర్మించిన రిజర్వాయర్ ఇది. రూపమతి మందిరానికి దిగువగా నిర్మించిన రిజర్వాయర్ వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.

 

జాజ్ మహల్/నౌకా భవనం

  రెండు కృత్రిమ సరస్సుల మధ్య నిర్మించిన రెండస్తుల భవనం వాస్తు శిల్పకళా అద్భుతం. నీటిపై తేలుతున్న నౌక ఆకృతిలో భవనాన్ని నిర్మించారు. ఘివాస్ ఉద్దీన్ ఖిల్జీ నిర్మించిన భవనాన్ని సుల్తాన్ అంతఃపురంగా ఉపయోగించేవారు.

 

  ప్రాంతంలో  దొరికే స్థానిక ఆహారమైన పోహా, కచోరీ, బాఫ్లా వంటి వాటిని రుచి చూడకుండా వదలడం ఎవరికీ సాద్యంకాదు.

 ఆధ్యాత్మక త్రికోణంపై వెబినార్ ను ముగింపు సందర్భంగా, అదనపు డైరెక్టర్ జనరల్ రూపీందర్ బ్రార్ మాట్లాడుతూ,.. ప్రాంతాల పర్యటన ఎంతో ముఖ్యమైనదని, పర్యటనతో వెలలేని, విలువైన ఆనందాన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చని చెప్పారు.

కింద ఇచ్చిన లింకుల ద్వారా వెబినార్ సెషన్లను తిలకించవచ్చు.

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured

http://tourism.gov.in/dekho-apna-desh-webinar-ministry-tourism

https://www.incredibleindia.org/content/incredible-india-v2/en/events/dekho-apna-desh.html

  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని సామాజిక మీడియా హ్యాండిల్స్ పై కూడా వెబినార్ సెషన్స్ ను తిలకించవచ్చు. విశాఖపై అన్వేషణ పేరిట మరో వెబినార్,.. 2020 జూలై 25 తేదీ ఉదయం 11గంటలకు జరగబోతోంది.

*******



(Release ID: 1639954) Visitor Counter : 268