జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్: 2023 నాటికి నూరు శాతం కుళాయి కనెక్షన్‌లకు అరుణాచల్ ప్రణాళిక
అరుణాచల్ ప్రదేశ్ మారుమూల గిరిజన నివాసాలకు చేరనున్న కుళాయి కనెక్షన్లు
Posted On:
18 JUL 2020 3:12PM by PIB Hyderabad
అరుణాచల్‌ప్రదేశ్‌లో 2,000 అడుగుల ఎత్తులో చుట్టూ పచ్చటి చెట్ల మధ్య ఉన్న అందమైన గ్రామం సెరిన్. ఇప్పుడు ఆ గ్రామస్థులు ఆనందంతో పులకించడానికి ఒక కారణం ఉంది. ఈచిన్న మారుమూల గ్రామానికి చేరుకోవడం అంత సులభం కాదు. కనీసం ఒక రోజంతో గుట్టలు ఎక్కుతూ కాలినడకన ప్రయాణిస్తే కాని దీనిని చేరుకోలేం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని కామ్లేజిల్లా రాగా బ్లాక్‌లోని తామెన్ లో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఇక్కడి ప్రజల జీవనమూ అలాగే ఉంటుంది. సెరిన్ గ్రామానికి , సమీప పక్కా రోడ్డు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో నిషి తెగ వారు ఉంటారు. వీరి జనాభా 130 . వారి ప్రతి ఇంటికీ ఇప్పుడు కుళాయి కనెక్షన్ ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వారి ఇంట్లోనే సురక్షిత తాగునీరు వారికి అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు త్రాగునీరు తెచ్చుకోవడం అంటే ఎంతో కష్టం తో కూడుకున్న పని. సెరిన్ గ్రామంలోని పెద్దవారు సమీపంలోని నీటివనరుల దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చుకోవలసి ఉండేది. కానీ ఇప్పుడు సెరిన్‌కు నీటి సరఫరా పథకం వచ్చింది, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ వచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, భారతప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమమైన జల్ జీవన్ మిషన్ కింద, 2023 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నూరు శాతం త్రాగునీటి కనెక్షన్ అందించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అందరికీ సురక్షిత మంచినీటిని అందిస్తారు. దేశ ప్రజల జీవితాలలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావలన్నది ప్రధానమంత్రి దార్శనికత.
గ్రామీణ ప్రాంతాలలో నివశించే ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
కొండప్రాంతాలలో, దూరప్రాంతాల నుంచి మంచినీళ్ళు మోసుకు రావడం మహిళలకు చాలా కష్టమైన పని. ఇది పెద్ద శ్రమకు కారణమౌతుంది. వారికి ఇలాంటి భారాన్ని తగ్గించేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి సరిపడినంత తాగునీటిని, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన సరఫరాచేస్తారు.ఈ పథకం కింద రాష్ట్రాలు ప్రతి గ్రామంలో ఐదుగురికి ,ప్రత్యేకించి మహిళలకు , స్థానికంగా సరఫరా చేసే నీటిని పరీక్షించేందుకు క్షేత్రస్థాయిలో పరీక్షా కిట్‌లు ఉపయోగించడంలో శిక్షణ ఇప్పించవలసి ఉంటుంది.
సెరిన్ మంచినీటి సరఫరా ప్రాజెక్టును అమలు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నది. దీనికి కారణం, ఈ గ్రామం ఒక కొండపై ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇసుక, గులకరాళ్లు, పెద్ద పెద్ద రాళ్లు ఇవన్నీ కొండ కింద గల నదీప్రాంతం నుంచి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దీనికి తోడు స్టీలు, సిమెంటు, పైపులు వంటి వాటిని భారీ సమీప రోడ్డు మార్గం నుంచి గ్రామంలోని పనిప్రదేశానికి తలపై పెట్టుకుని ఎంతో కష్టంమీద తీసుకెళ్లవలసి ఉంటుంది. దీనితో ప్రాజెక్టు ఖర్చు పెరగడం, నైపుణ్యంగల పనివారు స్థానికంగా అందుబాటులో లేకపోవడం వంటివి ఈ సవాలును మరింత రెట్టింపు చేశాయి. అయితే ఇందుకు సంబంధించిన పనిని ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని పిహెచ్ఇ డిపార్టమెంటు అమలు చేసింది.
ఇది కొండలు గల రాష్ట్రం కావడంతో, గురుత్వాకర్షణ శక్తి ఆధారిత నీటి సరఫరా వ్యవస్థను అరుణాచల్ ప్రదేశ్‌లో వినియోగిస్తున్నారు. అంటే నీటి వనరు నుంచి నీటిని వాలుఆధారంగా గ్రామానికి తరలిస్తారు. ఉపరితల నీటి వనరు నుంచి నీటిని సేకరించడానికి ఒక నిర్మాణం చేపడతారు. అక్కడి నుంచి పైపు ద్వారా గ్రామానికి నీటిని చేరవేస్తారు. పాతరోజులలో నీటిశుద్ధి ప్లాంటులు పరిగణనలోకి తీసుకునే వారు కాదు. దీనికి కారణం తలసరి ఖర్చు నిబంధనలే.కానీ ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ తో నీటి శుద్ధి ప్లాంటులను ఈ పథకంలో అంతర్భాగంగా చేసి, నాణ్యమైన నీటిని అందిస్తున్నారు. నీటి శుద్ది అనంతరం, నీటిని గ్రామానికి ఎగువన నిర్మించిన రిజర్వాయర్‌లోకి పంపి అక్కడినుంచి పైపులతో పంపిణీ నెట్‌వర్కు ద్వారా నీటిని పంపిణీ చేస్తారు. నీటిని సమానంగా పంపిణీ చేసేందుకు వీలు కల్పించడానికి పెద్ద గ్రామాలలో పంపిణీ ట్యాంకులను గ్రామాలలోనే ఏర్పాటు చేయడం జరుగుతోంది.
సరిహద్దు రాష్ట్రంలో సెరిన్ గ్రామం ఒక్కటే ఇందుకు ఉదాహరణ కాదు. దాల్‌బింగ్, మరోగ్రామం . ఇది ఎగువ సియాంగ్ జిల్లాలో 3,300 అడుగుల ఎత్తులో ఉన్న గ్రామం. ఇక్కడ 79 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 380 మంది. ప్రజలను సంఘటితం చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ గ్రామం ఆది గిరిజన తెగకు చెందినది. కొండపై ఉన్న గ్రామం. జల్ జీవన్ మిషన్ వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత, కమ్యూనిటీ నిర్వహించే నీటిపథకం కావడంతో దాల్‌బింగ్ గ్రామస్తులు శ్రమదానం ద్వారా తమవంతు సేవ చేశారు. ఇలాంటి పనులే అంతర్జాతీయ సరిహద్దు వద్దగల ఎగువ కార్కొ గ్రామంలో జరిగాయి. కుళాయి కనెక్షన్లు అమర్చే పనులు జరిగే సమయంలో గ్రామస్థులు పైపులు ఇతర నిర్మాణ సామగ్రిని మోసుకువెళ్లి నిర్మాణప్రదేశానికి చేర్చారు. వారు ప్లంబింగ్ పనులలో కూడా తమవంతు సహాయం అందించారు.
మరోగ్రామం పుమావో. ఇది లాంగ్ డింగ్ జిల్లాలో 3,900 అడుగుల ఎత్తున ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు కొసన ఉన్న జిల్లా. ఈ గ్రామంలో స్వచ్ఛభారత్ కింద నిర్మించిన టాయిలెట్లు ఉన్నాయి. అయితే రోజువారీ నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్థులు వాటిని వాడడానికి ఆసక్తి కనబరచకుందా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి ఇంటికి నీటి సరఫరా జరగడంతో ఇంటి అవసరాలకు నీటిని వాడడంతోపాటు టాయిలెట్లు వినియోగిస్తూ సంతోషంగా ఉన్నారు.
జల్ జీవన్ మిషన్ ను ఈ కఠిన ప్రదేశాలలో , ఎత్తైన ప్రదేశాలలో అమలు చేయడం సవాలుతో కూడినది. కఠిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు ఇంకా ఎక్కువ. అలాగే తమ విశ్వాసాలు, జీవన విధానాన్ని వదిలించుకొవడానికి ఆసక్తి చూపని గ్రామస్థుల లో పరివర్తన తీసుకు రావడం కూడా సవాలుతో కూడినదే. కాని ఈ గ్రామాల విజయగాథలు , ప్రజల జీవనాన్ని, ప్రత్యేకించి మహిళల జీవితాలను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు , మెరుగైన భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తాయి.


(Release ID: 1639666)
Visitor Counter : 261