జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్: రోజుకు లక్ష కుళాయి కనెక్షన్లు

లాక్ డౌన్ తొలి సడలింపుల తరువాత 45 లక్షల కుళాయిలు పూర్తి

Posted On: 16 JUL 2020 6:24PM by PIB Hyderabad

 

2019 ఆగస్టులో మొదలైన జల్ జీవన్ మిషన్ 2019-20 లో ఏడు నెలల కాలంలోనే 84.83 లక్షల గ్రామీణ గృహాలకు నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగింది. పైగా, కోవిడ్ సంక్షోభం లాక్ డౌన్ తొలి సడలింపులు మొదలయ్యాక 2020-21 లోనే దాదాపు 45 లక్షల కనెక్షన్లు ఇవ్వటం మరో విశేషం. ఆ విధంగా రోజుకు లక్ష ఇళ్ళకు కుళాయి కనెక్షన్లు ఇవ్వటం దీని వేగానికి నిదర్శనంగా మారింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి కనెక్షన్ నూ జియో టాగింగ్ చేస్తున్నారు. పైగా కనెక్షన్లను ఇంటి యజమాని ఆధార్ తో అనుసంధానం చేస్తున్నారు.


ఈ కార్యక్రమం పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేసే డాష్ బోర్డ్ జిల్లా స్థాయి వరకూ ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో కనిపించేలా చూస్తున్నారు.  
ఈ మిషన్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాలను ప్రాథమిక సమాచారం సరిచూడవలసిందిగా కోరారు. దాని ప్రకారం దేశంలో 19.04 కోట్ల గ్రామీణ గృహాలున్నాయి. వాటిలో 3.23 కోట్ల ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లున్నాయి. మిగిలిన 15.81 కోట్ల ఇళ్ళకు కుళాయిలు సమకూర్చాల్సి ఉంది. అంటే, మొత్తం దాదాపు 16 కోట్ల ఇళ్లను ఈ పథకం కింద పూర్తి చేయాలి. పైగా, పాత కనెక్షన్లు అన్నీ పని చేసేట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే ఏడాదికి 3.2 కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలి. దాన్నే మరోలా చెబితే,  రోజుకు సుమారు 88,000 కనెక్షన్ల చొప్పున ఇస్తూ ముందుకు సాగాలి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కృషి చేస్తున్నాయి. ఈ విషయంలో బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
జల్ జీవన్ మిషన్ అమలుకోసం 2020-21 లో రూ. 23,500 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం రూ.8,000  కోట్లకు పైగా కేంద్ర నిధులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఉన్నాయి.  ఇవి కాకుండా 2020-21 లో గ్రామీణ స్థానిక సంస్థలకు నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులలో  50% , అంటే రూ. 30,375 కోట్లు కేటాయించింది.  ఇందులో 50%  మొత్తాన్ని 2020 జులై  15 న రాష్ట్రాలకు విడుదల చేసింది. దీనివలన గ్రామాలలో త్రాగునీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ, యాజమాన్యం మెరుగ్గా జరిగి దీర్ఘకాలంలో క్రమం తప్పకుండా త్రాగు నీరు అందుతుంది.
ఈ కార్యక్రమంలో పేరు మోసిన జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను కూదా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాటిలో ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, స్వచ్చంద సంస్థలు, సిఎస్ ఆర్ సంస్థలు, ట్రస్టులు, ఫౌండేషన్లు ఉన్నాయి. నీరే తరువాత ప్రజా ఉద్యమం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటిదాకా ఇది కేవలం ప్రభుత్వ రంగపు బాధ్యతగానే చూడగా ఇకముందు అందరి దృష్టీ దీనిమీదే ఉంటుందని భావిస్తోంది. నీరు అనేది అందరి బాధ్యత అయ్యేలా ఈ మిషన్ కొన్ని భాగస్వామ్యాలను కూడా లెక్కలోకి తీసుకుంటూ  వివిధ సంస్థలు, వ్యక్తుల తోడ్పాటుతో ప్రతి ఒక్కరికీ త్రాగునీటి రక్షణ కల్పించాలని అనుకుంటోంది. 
జల శక్తి మంత్రిత్వశాఖ ఈ జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రాల సహకారంతో అమలు చేయాలనుకుంటోంది. అప్పుడే 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాల్లో తగినంత నాణ్యమైన త్రాగునీటిని నిర్ణీత పరిమాణంలో  కుళాయిల ద్వారా క్రమం తప్పకుండా,  దీర్ఘకాలం అందించటానికి వీలవుతుంది. ఈ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి ప్రకటించారు. నిర్వహణా మార్గదర్శకాలు ఆ ఏడాది డిసెంబర్ 25 న విడుదలయ్యాయి.
జల్ శక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ మిషన్ ఈ పథకం అమలులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ అండగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ ఏడాది మార్చి-మే మధ్య కాలంలో గ్రామాల వారీగా విశ్లేషణ చేపట్టారు. వాటి ఆధారంగా రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశాయి. కేంద్ర జల శక్తి శాఖామంత్రి క్రమం తప్పకుండా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు జరుపుతూ ఈ పథకం అమలు పురోగతిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రాలు నూటికి నూరుశాతం గ్రామాల్లో. బ్లాక్స్ లో, జిల్లాల్లోనూ మొత్తంగా అన్నిచోట్లా పనిచేసే ఇంటి కుళాయి కనెక్షన్ ఉండేలా చూస్తున్నారు. అప్పుడే సంతృప్త స్థాయిలో రాష్ట్రాల్లో ఇంటింటా జలరాజ్యం వాస్తవ రూపం ధరిస్తుందని భావిస్తున్నారు.
అనేక రాష్ట్రాలు ఈ మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత 2024 కంటే ముందుగానే చేరుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. 2021లో బీహార్, గోవా, పుదుచ్చేరి, తెలంగాణ పూర్తి స్థాయిలో ముగించటానికి సిద్ధమవుతున్నాయి. అదే విధంగా 2022 లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాలలో గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం,  ఉత్తరప్రదేశ్ ఉండగా 2023 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో అరుణాచల ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, చత్తీస్ గఢ్ పనిచేస్తున్నాయి. ఇక అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిసా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మాత్రం 2024 నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాయి. 


ఏ ఒక్క ఇంటినీ వదలకుండా అందరికీ త్రాగునీటి సౌకర్యం కల్పించటమే పథకం లక్ష్యం. ప్రతి కుటుంబానికీ ఇంటిదగ్గరికే త్రాగు నీరు చేరుతుంది. ఎవరినీ ఈ సౌకర్యం చేరకుండా వదిలేసే ప్రసక్తే లేదు. ఆ విధంగా రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల జనాభా మెజారిటీ ఉన్న గ్రామాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కరవు బారిన పడే అవకాశమున్న గ్రామాలు, జిల్లాలకు, ఎడారి ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం దక్కుతోంది. నాణ్యమైన నీటి సౌకర్యం లేని జనావాసాలకు త్రాగు నీరందించటంలోనూ జల్ జీవన్ మిషన్ ముందుంటుంది. ఫ్లోరోసిస్ బారి నుంచి జనాన్ని కాపాడటానికి కృషిచేస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రాలు ఫ్లోరైడ్ బారిన పడిన అన్ని జనావాసాలకూ 2020 డిసెంబర్ లోగా రక్షిత మంచినీరు అందించాల్సిన  అవసరముంది. 


వికేంద్రీకృత కార్యక్రమం అయినందున ఇందుకోసం గ్రామ స్థాయిలో నీరు, పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు చేస్తారు, ఇవి గ్రామ పంచాయితీలలో ఉపసంఘాలుగా ఉంటాయి. కనీసం సగం మంది మహిళలు ఉండేలా ఈ కమిటీలు వేస్తారు. గ్రామ కార్యాచరణ పథకం రూపకల్పనలో వీరు భాగస్వాములవుతారు. నీటి వనరుల అందుబాటు, సరఫరా, నిర్వహణ వంటి అంశాలు అందులో చేరుస్తారు. గ్రామ పంచాయితీ సభ్యుల, ఉపసంఘం సభ్యుల సామర్థ్యాన్ని పెంచటంలో కూదా జల్ జీవన్ మిషన్ కృషి ఉంటుంది. ఆ విధంగా నాయకత్వ లక్షణాలను నేర్పి గ్రామ స్థాయిలో  నీటి సరఫరా మౌలిక వసతులను నిర్వహించటానికి సహకరిస్తుంది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే జల సమితి సభ్యులకు ఆన్ లైన్ శిక్షణ ప్రారంభించాయి. 
జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణులకు బేల్దారీ పని, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మోటార్ మరమ్మతులు తదితర అంశాల్లో కూడా నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఇలా సుశిక్షుతులైన,  పాక్షిక శిక్షణ పొందిన, నైపుణ్యం లేని శ్రామికుల అందుబాటును దృష్టిలో ఉంచుకొని గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనలో జల్ జీవన్ మిషన్ కూడా భాగస్వామి అయింది. ఆ విధంగా ప్రజా మౌలిక సదుపాయాల రూపకల్పనలో వలస కార్మికులకు ఉపాధి కల్పించే పనిలో భాగస్వామి కావాలనుకుంటోంది. తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఈ పథకం అమలవుతున్న 6 రాష్ట్రాలలోని 25,000 గ్రామాల్లో పనులు చేపట్టాలనుకుంటోంది. 
సరఫరా చేసే నీటి నాణ్యతను టెస్టింగ్ లేబరేటరీల ద్వారా పరీక్షిస్తూ ఉండటమన్నది చాలా ముఖ్యమైన అంశం. ఈ లాబ్ లను బలోపేతం చేయటానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఎన్ ఎ బి ఎల్ ద్వారా అక్రిడిటేషన్ పొందేలా చూస్తున్నారు. రాష్ట్రాలు నీటి నాణ్యతా పరీక్షల లాబ్ లను ప్రజల సందర్శనకు వీలుగా తెరచి ఉంచాలి. అప్పుడే మహిళలు వచ్చి తమకు ఇళ్ళకు అందే నీటిని పరీక్షించుకోగలుగుతారు.
నీటి నాణ్యత మీద నిఘా పెట్టే బాధ్యతను కూడా స్థానికులకే అప్పగిస్తున్నారు. గ్రామాల్లో ఐదేసి మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఆడవాళ్ళకే పెద్దపీట వేస్తారు. గ్రామాలకు సరఫరా చేసే నీళ్లను స్థానికంగానే పరీక్షిస్తారు. దీనివలన  విశ్వసనీయమైన, నమ్మదగిన త్రాగు నీరు అందుతుంది.
ప్రతి నీటి వనరునూ రసాయనాల పరంగా పరీక్షించాలి. రెండో విడత బాక్టీరియా వల్ల కలుషితమైనదేమో చూడాలి. ఇందుకోసం ఏడాదిలో రెండు సార్లు, అంటే రుతుపవనాలకు ముందు, తరువాత కూడా పరీక్షించాలి. నీటి నాణ్యతా సమీక్షలో ఇదొక భాగం. 


గ్రామీణ ప్రాంతాల జీవితం సుఖమయం చేయటానికి ఆర్థికంగా మమేకం చేయటం, ఇళ్ళు, రోడ్డు, శుభ్రమైన ఇంధనం, విద్యుత్, టాయిలెట్స్ ఉండేలా చూడాలన్న ప్రధాని పిలుపు మేరకు జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామీణ గృహానికీ త్రాగు నీటి సౌకర్యం కల్పిస్తోంది. దీనివలన గ్రామీణ ప్రజల జీవితాలలో పెనుమార్పు కనబడుతుంది.  నీళ్ళు తీసుకురావటమనే ప్రాథమిక బాధ్యత మోస్తున్న మహిళలకు, బాలికలకు ఆ బాధ్యత నుంచి వినుక్తి లభిస్తుంది

***


(Release ID: 1639199) Visitor Counter : 268