మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
జాతీయ మత్స్య రైతు దినోత్సవం 2020 నిర్వహణ.
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ మత్స్యరైతులు, శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యుయర్లతో వెబ్‌నార్ ద్వారా మత్స్యరైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సాంకేతిక పరిజ్ఞానం , ఉత్తమ సాగు పద్ధతుల ద్వారా మత్స్య వనరుల సుస్థిరంగా ఉపయోగించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
నాణ్యమైన విత్తనం, వాటి ఆహారం, జాతుల వైవిద్యీకరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు కానున్న“చేపల క్రయో బ్యాంక్”లు.
Posted On:
10 JUL 2020 8:24PM by PIB Hyderabad
జాతీయ మత్స్యరైతుల దినోత్సవం సందర్భంగా మత్స్య, పశుసంవర్ధక,పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖకు చెందిన మత్స్యవిభాగం, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి) సహకారంతో ఒకరోజు వెబినార్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పి.సి. సారంగి, మత్స్య, పశు సంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి , భారత ప్రభుత్వ మత్స్యవిభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్, మత్స్య విభాగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూలై 10 వ తేదీన జరుపుకుంటారు. శాస్త్రవేత్తలు డాక్టర్ కె.హెచ్. అలికున్‌హి, డాక్టర్ హెచ్ ఎల్ చౌదరిల సంస్మరణార్థం దీనిని నిర్వహిస్తారు. 1957 జూలై 10న వీరు సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమంగా చేపపిల్లల వృద్దిని విజయవంతంగా ఒకనాటి సిఎఎఫ్ఆర్ ఐ డివిజన్ అయిన ఒడిషాలోని కటక్ లోగల పాండ్ కల్చర్‌డివిజన్ లో ప్రదర్శించారు.(ప్రస్తుతం అది సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, సిఐఎఫ్ఐ ,భువనేశ్వర్). దేశంలోమత్స్యవనరులను నిర్వహిస్తున్న తీరులో మార్పులు తీసుకువచ్చి వాటి సుస్థిర నిల్వలు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చేయడం ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం.
ప్రతి సంవత్సరం ఈ మత్స్యరైతు దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో, దేశంలో మత్స్య రంగంలో విశేషకృషి చేసిన మత్స్యరైతులు, మత్స్యపారిశ్రామిక వేత్తలు, మత్స్యకారుల సేవలకు గుర్తింపుగా వారిని సన్మానించుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా గల మత్స్యకారులు, మత్స్యరైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్సు, వ్యాపారవేత్తలు , ఈరంగంతో సంబంధం ఉన్న వివిద భాగస్వామ్య పక్షాల వారు పాల్గొంటారు.
ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గల మత్స్యకారులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలతో కేంద్ర మత్స్య,పశుగణాభివృద్ది, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. నీలి విప్లవం ద్వారా సాధించిన విజయాలను సంఘటితం చేస్తూ , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నీలి క్రాంతి నుంచి అర్థక్రాంతికి మార్గం సుగమం చేసేందుకు, రైతుల రాబడిని రెట్టింపు చేసేందుకు మున్నెన్నడూ లేని రీతిలో రాగల 5 సంవత్సరాలలో 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రధానమంత్ర మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) ను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు.
ఈ పథకం , చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతికత, సాగు అనంతర మౌలిక సదుపాయాలు, యాజమాన్యం, ఆదునీకరణ, వాల్యూ చెయిన్‌ను బలోపేతం చేయడం, అద్బుతమైన మత్స్యయాజమాన్య ఫ్రేమ్ వర్కును ఏర్పాటు చేయడం, మత్స్యకారుల సంక్షేమం తదితర విషయాలలొ గల కీలక అంతరాలను తొలగిస్తుందని మంత్రి చెప్పారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఉత్తమ సాగు పద్దతుల అమలు ద్వారా మత్స్యవనరుల సుస్థిర సాగుకుగల ప్రాధాన్యతను మంత్రి నొక్కిచెప్పారు. నాణ్యమైన విత్తనం, ఆహారం, జాతుల వైవిధ్యీకరణ, నూతన వాణి్జ్య పద్దతులు, బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ లింకేజ్ తో మార్కెటింగ్ మౌలికసదుపాయాల ప్రాధాన్యతను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
దేశంలో మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు నాణ్యమైన మత్స్య విత్తనం అత్యంత కీలకమైనదని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు. జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా ఆయన , దేశంలోని వివిధ ప్రాంతాలలోఎన్.ఎఫ్.డి.బి సంస్థ, ఎన్‌బిఎఫ్.జి.ఆర్ సహకారంతో మత్స్య క్రయో బ్యాంకులు ఏర్పాటు చేసే పని చేపడుతుందని అన్నారు. ఇది మత్స్యరైతులకు అన్నివేళలా వారు కోరుకున్న మత్స్య జాతులకు సంబంధించిన ఫిష్ స్పెర్మ్ అందుబాటులొ ఉండేట్టు చూస్తుందన్నారు. ఫిష్ క్రయోబ్యాంక్ ఏర్పాటు చేయనుండడం ప్రపంచంలోనే తొలిసారి అని మంత్రి చెప్పారు. ఇది దేశంలో మత్స్య రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నదని, తద్వారా మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకత పెరగనున్నదని చెప్పారు. దీని ఫలితంగా మత్స్యరైతులు సుసంపన్నం కానున్నారని గిరిరాజ్ సింగ్ తెలిపారు.
ఎన్.బి.ఎఫ్.జి.ఆర్ డైరక్టర్ డాక్టర్ కుల్‌దీప్ కె. లాల్ మాట్లాడుతూ, ఎన్.బి.ఎఫ్.జి.ఆర్ సంస్థ ఎన్ఎఫ్‌డిబి సహకారంతో అభివృద్ధి చేసిన “క్రయోమిల్ట్” సాంకేతిక పరిజ్ఞానం ఫిష్ క్రయోబ్యాంకుల ఏర్పాటుకు సహాయపడగలదని, ఇది ఏ సమయంలో అయినా మంచి నాణ్యమైన ఫిష్ స్పెర్మును హేచరీస్‌లో అందించేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్ వెబినార్‌లో స్వాగతోపన్యాసం చేస్తూ , పిఎంఎంఎస్‌వై కింద సాధించదలచిన అద్భుత లక్ష్యాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ భాగస్వామ్య పక్షాలు, ప్రైవేటు రంగం క్రియాశీలక సహకారం అవసరమని ఆయన తెలిపారు.
భారత ప్రభుత్వ మత్స్యవిభాగం సీనియర్ అధికారులు, ఎన్.ఎఫ్.డి.బి ఛీప్ ఎగ్జిక్యుటివ్ డాక్టర్ సి. సువర్ణ, వారి బృందం ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల మత్స్యవిభాగాల అధికారులు, ఐసిఎఆర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డైరక్టర్లు, శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యుయర్లు, ఒడిషా, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి 150మంది అభ్యుతయ మత్స్య రైతులు ఈ వెబినార్‌లొ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
***
(Release ID: 1637969)
Visitor Counter : 310