వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్- ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం- 2020 జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల పాటు ఉచితంగా శనగల పంపిణీ
Posted On:
08 JUL 2020 4:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, కోవిడ్ -19 కు ఆర్థిక స్పందనలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)ను మరో 5 నెలల పాటు ,అంటే 2020 జూలై నుంచి నవంబర్ వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద 9.7 లక్షల మెట్రిక్ టన్నుల శుద్ధి చేసిన శనగలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లబ్ధిదారు కుటుంబాలన్నింటికీ పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. వీటిని నెలకు ఒక కేజీ వంతున 2020 జూలై నుంచి నవంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకు అయ్యే మొత్తం అంచనా వ్యయం రూ 6,849.24 కోట్ల రూపాయలు.
ఈ పథకం పరిధి కింద 19.4 కోట్ల కుటుంబాలు వస్తాయి. పొడిగించిన పిఎంజికెఎవై పథకానికి సంబంధించిన అన్ని ఖర్చులనూ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాగల ఐదు నెలల కాలంలో ఆహార ధాన్యాలు అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ యోజనను పొడిగించడం జరిగింది. ఉచితంగా శనగలు పంపిణీ చేయడం వల్ల ఈ 5 నెలల కాలం పాటు పైన పేర్కొన్న లబ్ధిదారులకు తగినంతగా ప్రోటీన్లు అందడానికి వీలు కలుగుతుంది.
2015-16లో పప్పుల నిల్వలు ఏర్పాటు చేయడం ప్రారంభించడం వల్ల , దేశంలో పప్పుల నిల్వలు గణనీయంగా ఉన్నాయి. వాటి నుంచి ఈ ప్యాకేజ్‌కి శనగలు పంపిణీ చేయడం జరుగుతున్నది. పి.ఎం.జికెఎవై పథకం పొడిగించినందువల్ల దానికి అవసరాల మేరకు పంపిణీకి తగినతంగా ప్రభుత్వం వద్ద నిల్వలు ఉన్నాయి. తొలి దశ పిఎంజికెఎవై కింద ( 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు) 4.63 లక్షల మెట్రికల్ టన్నుల పప్పులను ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది.దీనివల్ల దేశవ్యాప్తంగా 18.2 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది.
నేపథ్యం:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 30-06-2020న, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ని 2020 నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కారణంగా నిరుపేదలు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేందుకు దీనిని పొడిగించారు.
****
(Release ID: 1637407)
Visitor Counter : 191