సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖద్దరు ఫేస్‌ మాస్కులను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న కేవీఐసీ

Posted On: 08 JUL 2020 3:14PM by PIB Hyderabad

ప్రసిద్ధి పొందిన ఖద్దరు ఫేసు మాస్కులు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చాయి. వివిధ అవరోధాల కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగపడనుంది. http://www.kviconline.gov.in/khadimask  ద్వారా ఆన్‌లైన్‌లో ఖాదీ ఫేస్‌ మాస్కులను ఆర్డర్‌ చేయవచ్చు. 

ఖద్దరుతోపాటు, పట్టు మాస్కులను కూడా కేవీఐసీ విక్రయిస్తోంది. ఖద్దరు మాస్క్‌ ధర రూ.30 కాగా, పట్టు మాస్క్‌ ధర రూ.100 రూపాయలు. కనీసం రూ.500 విలువగల మాస్కులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయాలి. నాలుగు రకాల మాస్కులు.. నలుపురంగు అంచుతో ఉన్న తెల్లటి కాటన్‌ మాస్కులు, తివర్ణ అంచుతో ఉన్న తెల్లటి కాటన్‌ మాస్కులు, వివిధ రంగుల్లో ఉన్న పట్టు మాస్కులు, ప్రింటుతో వివిధ రంగుల్లో ఉన్న పట్టు మాస్కులు అందుబాటులో ఉన్నాయి. డెలివరీ రుసుము లేకుండా, ఆర్డర్‌ తేదీ నుంచి ఐదు రోజుల్లో మాస్కులను కేవీఐసీ అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం మనదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్‌ ద్వారా ఖద్దరు ఫేస్‌ మాస్కులను విక్రయిస్తున్నాం కాబట్టి, ప్రజలు నిజమైన ఖద్దరు మాస్కులను పొందుతారని కేవీఐసీ ఛైర్మన్‌ శ్రీ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. "మోసాల నుంచి ప్రజలను రక్షించడం కూడా ఆన్‌లైన్ విక్రయాల లక్ష్యం. చాలా ఆన్‌లైన్ పోర్టళ్లు ఖద్దరు పేరిట మాస్కులు అమ్ముతున్నాయి. అవి నిజమైన ఖద్దరు కాదు, చేనేత అసలే కాదు. అలాంటి ప్రకటనలు చూసి చాలామంది ప్రజలు మోసపోతున్నారు" అని చెప్పారు.

ఖద్దరు ఫేస్ మాస్కులు రెండు పొరలతో వంద శాతం కాటన్‌ వస్త్రంతో తయారవుతాయి. చిన్నవి, మధ్యస్థం, పెద్దవి వంటి మూడు పరిమాణాల్లో లభ్యమవుతాయి. పట్టు మాస్కులను మూడు పొరలుగా తయారు చేస్తారు. లోపలి రెండు పొరలు కాటన్‌తో, పైపొరను పట్టుతో తయారు చేస్తారు. వివిధ రంగులతో, ప్రింటు చేసినవి, ప్రింటు లేని రకాలుగా ఇవి లభ్యమవుతున్నాయి. ఇవి ఒకే పరిమాణంలో, చెవుల దగ్గర సరిచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

*****



(Release ID: 1637341) Visitor Counter : 237