ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉన్నతమైన సమాజం, ఉత్తమ గురు-శిష్య సంబంధం ద్వారా సాకారమౌతుంది - ఉపరాష్ట్రపతి
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల గురుశిష్య సంబంధం యువతకు ఆదర్శనీయం
గురుపౌర్ణమి సందర్భంగా సామాజిక మాధ్యమం (ఫేస్ బుక్) ద్వారా మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి
చిన్ననాటి స్మృతులను గుర్తు తెచ్చుకున్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
ప్రాథమిక స్థాయి నుంచి రాజకీయ జీవితం వరకూ స్ఫూర్తిగా నిలిచిన గురువుల పేర్ల స్మరణ
చదువు సంస్కారాన్ని ఇనుమడింపజేసేదిగా ఉండాలని సూచన
సాంకేతిక యుగంలోనూ సంస్కారాన్ని పెంచేది గురువులు మాత్రమేనని ఉద్బోధ
Posted On:
04 JUL 2020 4:07PM by PIB Hyderabad
ప్రస్తుతం సమాజంలో నెలకొన్న అనేక సమస్యలకు సరైన గురు శిష్య సంబంధాలు లేకపోవడం కూడా ఒక కారణమని, ఉత్తమమైన గురు-శిష్య సంబంధం ద్వారానే ఉన్నతమైన సమాజం సాకారమౌతుందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం (ఫేస్ బుక్) ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి గురువును ప్రత్యక్ష దైవంగా మన పెద్దలు చెప్పారని, తన దృష్టిలో గురువు దేవుడు మాత్రమే కాదని, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు భగవంతునికి మించిన వారని, అందుకే తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని భగవంతుడి కంటే ముందు గురువుకే ఇచ్చి భారతీయులు గురువును గౌరవించారని తెలిపారు.
15 నెలలలకే తల్లిని కోల్పోయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి తమ అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ, తాతయ్య శ్రీ నరసయ్య నాయుడు గారు తొలి గురువులుగా నిలిచారని, తాను న్యాయ శాస్త్రం చదవాలని తలంచిన తమ మాతృమూర్తి శ్రీమతి రమణమ్మ, తనకు జన్మను అందించిన తండ్రి శ్రీ రంగయ్య నాయుడు సహా తమ గురువులందరికీ ఉపరాష్ట్రపతి సాదర ప్రణామాలు తెలిపారు. పాఠశాల, కళాశాలల్లో శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామ శర్మ, న్యాయ కళాశాలలో ఆచార్య భాగవతుల సత్యనారాయణ మూర్తి తన పట్ల పుత్రవాత్యల్యం చూపిన విషయాన్ని గుర్తు చేస్కున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని, న్యాయశాస్త్రంలో పట్టభద్రులు అయ్యే వరకూ తనకు చదువు చెప్పిన వారందరి పేర్లు ఉపరాష్ట్రపతి ఈ పోస్టు ద్వారా పంచుకున్నారు. అలాగే తమలోని నాయకత్వ లక్షణాలకు సానబెట్టి ప్రజా సేవ దిశగా పురిగొల్పిన శ్రీ సోంపల్లి సోమయ్య, శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ లను, రాజకీయ జీవితం తొలి నాళ్ళలో ఆయనకు స్ఫూర్తిని పంచిన శ్రీ తెన్నేటి విశ్వనాథం, జాతీయ స్థాయిలో శ్రీ లాల్ కృష్ణ అద్వానీ పేర్లను ఉపరాష్ట్రపతి స్మరించుకుని, అందరికీ పేరుపేరునా ప్రణామాలు తెలిపారు.
గురువు అంటే కేవలం చదువు నేర్పిన వారే కాదని, మనకు జీవితానికి అవసరమైన అనేక అంశాలను నేర్పిన ప్రతి ఒక్కరినీ గురువుగానే భావించాలన్న ఉపరాష్ట్రపతి, మాట్లాడ్డం దగ్గర్నుంచి పోట్లాడ్డం వరకూ సమాజం నుంచే నేర్చుకుంటున్నామని చమత్కరించారు. తల్లిదండ్రుల అనురాగం గారంగా మారితే బిడ్డ భవిష్యత్ పాడవుతుందని, కానీ గురువు పెంచుకునే అనురాగం వారిని వృద్ధిలోకి తీసుకువస్తుందన్న ఆయన, గురువు దృష్టిలో రాజు కొడుకైనా, సేవకుడి కొడుకైనా సమానులే అని, విద్య నేర్పిన గురువుల పట్ల జీవితమంతా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటంతో పాటు, గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలని సూచించారు.
విశ్వగురువుగా ప్రఖ్యాతి గాంచిన భారతదేశంలో సనాతన కాలం నుంచి ఉన్న విద్యావ్యవస్థ ఘనతను వివరించిన ఉపరాష్ట్రపతి, పరమేశ్వరుని దక్షిణామూర్తి స్వరూపం గురించి, కుమార గురువైన గణపతి గురించి, గురువు శుశ్రూషలు చేసిన పురాణ పురుషుల గురించి, గురు భక్తిని చాటుకున్న మహనీయుల గురించి, ఆచార్య త్రయం గురించి, వివిధ శాస్త్రాలకు సంబంధించిన గురు పరంపరను గురించి అనేక విషయాలను కళ్ళకు కట్టారు. ఈ సందర్భంగా భారతీయ యువశక్తిని మేల్కొలిపిన స్వామి వివేకానంద, వారి గురువు శ్రీరామకృష్ణ పరమహంసల గురు శిష్య సంబంధం గురించి వివరించిన ఆయన, వారి గురు శిష్య సంబంధం నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు.
సంస్కారం ఇవ్వని చదువు నిరుపయోగమైనదన్న మహాత్మా గాంధీ సూక్తిని ఉదహరించిన ఉపరాష్ట్రపతి, గురువులు జ్ఞానంతో పాటు పిల్లలకు సంస్కారాన్ని కూడా బోధించాలని, సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా, సంస్కారాన్ని మాత్రం తల్లిదండ్రులు, గురువులే నేర్పిస్తారన్న ఆయన, గురుపౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకుని వారు చూపిన మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు.
*****
(Release ID: 1636543)
Visitor Counter : 496