నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సముద్ర విమానాల నిర్వహణ ప్రాజెక్టులను సమీక్షించిన - శ్రీ మన్ సుఖ్ మాండవీయ


త్వరలో వాస్తవరూపం దాల్చనున్న 16 సముద్ర విమానాల ప్రాజెక్టులు

Posted On: 23 JUN 2020 5:01PM by PIB Hyderabad

        భారత సముద్ర రంగంలో మార్పును తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అధికారుల ప్రత్యేకమైన మరియు వినూత్నమైన ఒక సమావేశ వేదిక " చాయ్ పే చర్చా" కార్యక్రమంలో కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ (ఇంచార్జ్) మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా ఈ రోజు భారత సముద్ర జలాలపై సముద్ర విమానాల ప్రాజెక్టులను సమీక్షించారు.

        దేశంలోని సుదీర్ఘమైన, ఇబ్బందికరమైన మరియు కొండ ప్రాంతాలకు ఈ సముద్ర విమానాల ప్రాజెక్టులు వేగంగా మరియు ఇబ్బంది లేని ప్రయాణ ఎంపికను అందిస్తాయి.  ఉడాన్ పథకం కింద, ప్రాంతీయ అనుసంధాన మార్గాల కింద  ఇప్పటివరకు, 16 సముద్ర విమాన  మార్గాలను గుర్తించారు.  సబర్మతి మరియు సర్దార్ సరోవర్ - ఐక్యతా విగ్రహం మార్గం ఈ 16  సముద్ర మార్గాల్లో చేర్చబడింది మార్గం యొక్క భూ జల అధ్యయన సర్వేలు పూర్తయ్యాయి.

        సబర్మతి మరియు నర్మదా నది - ఐక్యతా విగ్రహం సముద్ర విమాన మార్గం సమయాన్ని ఆదా చేస్తుంది మరియు పర్యాటకాన్ని పెంచుతుందని  శ్రీ మాండవీయా అభిప్రాయపడ్డారు, ఎందుకంటే ఇది నర్మదా లోయనూ మరియు ఐక్యతా విగ్రహాన్నీ విహంగ వీక్షణం ద్వారా చూసే అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు.  సముద్ర విమానం నిర్వహణ కోసం అమెరికా, కెనడా, మాల్దీవులు మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల వాటర్ డ్రోమ్ (టెర్మినల్) మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత, భారత నియమ నిబంధనలకు అనుగుణంగా, భారత దేశానికి తగిన వాటర్  డ్రోమ్ (టెర్మినల్)  నమూనా రూపొందించాలని శ్రీ మాండవీయ అధికారులను ఆదేశించారు.

        2020 అక్టోబర్ నాటికి, సబర్మతి మరియు ఐక్యతా విగ్రహం మార్గం యొక్క సముద్ర విమాన సర్వీసు ప్రారంభించడానికి, సాగర్ మాలా అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ (ఎస్.డి.సి.ఎల్) మరియు భారత దేశీయ జల మార్గాల సాధికార సంస్థ (ఐ.డబ్ల్యు.ఐ.ఐ) రెండూ చేతులు కలపాలని సవివరమైన చర్చల అనంతరం, ఆయన ఆదేశించారు.  సముద్ర విమాన మార్గాలకు సంబంధించి సముద్ర లోతులను, నేలలను పరీక్షించే (బాతిమెట్రిక్) మరియు భూ, జల అధ్యయనం (హైడ్రోగ్రాఫిక్)  సర్వేలను,  భారత విమానాశ్రయాల సాధికార కమిటీ తరఫున,  ఐ.డబ్ల్యు.ఎ.ఐ.  చేపట్టి, 2020 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయవలసి ఉంది.

        స్వదేశీ జల మార్గాల్లో సముద్ర విమానాల ప్రాజెక్టులను ఐ.డబ్ల్యు.ఎ.ఐ. నిర్వహిస్తుంది మరియు తీరప్రాంతాలలో సముద్ర విమానాల  ప్రాజెక్టులను ఎస్.డి.సి.ఎల్. నిర్వహిస్తుంది.  ఈ విషయంలో, ఐ.డబ్ల్యు.ఎ.ఐ. మరియు ఎస్.డి.సి.ఎల్. సంస్థలు,  షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విమానాల నిర్వాహకులు, పర్యాటక మంత్రిత్వ శాఖతో పాటు డి.జి.సి.ఎ. లతో సమన్వయంతో పనిచేస్తారు.

 

*****



(Release ID: 1633775) Visitor Counter : 201