ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


కఠిన నివారణ చర్యలతోబాటు దీర్ఘకాల వ్యాధులున్నవారిమీద దృష్టి:కోవిడ్-19 నుంచి కోలుకోవటానికి పంజాబ్ మంత్రం

Posted On: 22 JUN 2020 7:58PM by PIB Hyderabad

దేశవ్యాప్తంహా సంక్షోభానికి కారణమైన కరోనామీద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరులో భాగంగా పంజాబ్ ఈ వైరస్ ను అడ్డుకోవటంలో మెరుగైన పురోగతి కనబరచింది. వివిధ రాష్ట్రాల ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలోను, వ్యాధి నియంత్రణ చర్యలమీద కేంద్రం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పంజాబ్ మాత్రం మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా కోలుకుంటున్నవారి శాతం ఎక్కువగా నమోదు చేయగలుగుతోంది.


ప్రభుత్వ క్వారంటైన్

పంజాబ్ ప్రభుత్వం తాను అనుసరిస్తున్న బహుముఖ వ్యూహంలో భాగంగా కంటెయిన్మెంట్ జోన్లలో వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నవారిని ప్రభుత్వక్వారంటైన్ కు తరలించింది. మరణాలు తగ్గించే క్రమంలొ రిస్క్ ఉన్నవారిలో 60 ఏళ్ళు పైబడ్డ వారిని, గుండె, మూత్రపిండాల జబ్బులున్నవారిని, బీపీ, చక్కెర వ్యాధి ఉన్నవారిని చేర్చింది.  అలాంటి వాళ్ళు కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న పక్షంలో వాళ్లకు ప్రభుత్వ క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పించింది. ఆ ప్రాంతం కంటెయిన్మెంట్ జోన్ నుమ్చి బైటపడేవరకూ వాళ్లను క్వారంటైన్ లో ఉంచింది. ఇందుకోసం హోటళ్ళు, లాడ్జీలు లాంటి తగిన ప్రదేశాలను కూడా వాడుకుంది. అలాంటివాళ్లతో ఒక సహాయకుణ్ణి కూడా ఉండటానికి అనుమతించింది. అలా ఉన్న సమయంలో అన్ని త్రకాల వైద్య సదుపాయాలూ కల్పించింది. రోజుకు రెండు సార్లు ఒక వైద్యాధికారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించే ఏర్పాటు కూడా చేసింది. 

కంటెయిన్మెంట్ కు కఠిన వ్యూహం

కంటెయిన్మెంట్ విషయంలో పంజాబ్ కఠిన వ్యూహాన్ని అమలు చేసింది. ఒక వీధి లేదా పక్క వీధులను కూడా కలిపి ఒక మొహల్లా లేదా ఒక రెసిడెన్షియల్ సొసైటీని కచ్చితమైన కంటెయిన్మెంట్ జోన్ గా పరిధిని నిర్దేశించింది.  అక్కడి పరిస్థితిని బట్టి పూర్తి ప్రాంతమా, పాక్షికమా అనేది నిర్ణయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పూర్తి గ్రామమా, పాక్షికమా అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. దీని వెనుక ఉన్న మూల సూత్రం ఏంటంటే ఆ కొద్ది ప్రాంతం మీద దృష్టి సారించి సమర్థంగా వైరస్ ను అరికట్టటం. ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా వైరస్ వ్యాపించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 8 జిల్లాల్లో దాదాపు 25000 జనాభా ఉండే 19 కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసారు. అక్కడ అత్యవసర సేవలు తప్ప ప్రజల కదలికలను, కార్యకలాపాలను సమర్థంగా నియంత్రించారు. ఇంటింటికీ తిరిగి కోవిడ్ లక్షణాలున్నవారిని గుర్తించి సకాలంలో పరీక్షలు జరిపి నిర్థారణ అయిన వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు. ఆ విధంగా కంటెయిన్మెంట్ జోన్ లో ఉన్నవాళ్ళందరికీ పరీక్షలు జరపటం సులువయింది.

ఇంటింటి సర్వే ద్వారా నిఘా

పంజాబ్ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తిని నివారించటానికి " ఘర్ ఘర్ నిగ్రాణి "  పేరుతో ఒక మొబైల్ యాప్ విడుదల చేసింది. బాధితులను త్వరగా గుర్తించటం కోసం, పరీక్షలు జరిపించటం కోసం  ఆశా వర్కర్ల సాయంతో ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ యాప్ సాయంతో 30 ఏళ్ళు పైబడ్డ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను సర్వే చేశారు. అదే సమయంలో దీర్ఘకాల వ్యాధులున్నవారిని కూడా గుర్తించారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లను నిర్థారించారు. దీనివలన ఎవరికి చికిత్స అవసరమో తెలిసింది. జూన్ 22 నాటికి 8,40,223 మందిని సర్వే చేశారు. వాళ్లలో  836829  మందికి లక్షణాలు కనబడలేదు. 3997 మందికి దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులున్నట్టు గుర్తించారు.
ఇంకా ఈ సర్వే కొనసాగుతుండగా ఇప్పటివరకూ 5512 గ్రామాల్లోనూ, 1112 పట్టణప్రాంత వార్డుల్లోనూ పూర్తయింది. 

నిర్థారణ పరీక్షలు

పంజాబ్ పరీక్షల సామర్థ్యాన్ని బాగా పెంచింది. ప్రస్తుతం రోజుకు సగటున 8000 పరీక్షలు జరుపుతోంది. ఈ పరీక్షల సంఖ్య మరింతగా పెంచటానికి వీలుగా మొబైల్ వాహనాలను కూడా రంగంలో దించింది. ఏప్రిల్ 10న ప్రతి పదిలక్షల మందిలో 71  మంది చొప్పున పరీక్షలు చేయగా ఇప్పుడు పది లక్షలమందిలో 5,953 మందికి చేస్తున్నారు. దీంతో పంజాబ్ లో పరీక్షల వేగం 83 రెట్లు పెరిగినట్టయింది. 

వైరస్ వ్యాపించకుండా నిరోధించటానికి పంజాబ్ ప్రభుత్వం వారాంతపు సెలవులు, ఇతర సెలవులమీద ఆంక్షలు విధించింది. అన్ని నియమనిబంధనలూ కఠినంగా అమలు చేస్తూ వస్తోంది.
 
****


(Release ID: 1633471) Visitor Counter : 203