రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వేల కోవిడ్ రక్షణ కోచ్ ల వాడకం ప్రారంభం


ఉత్తరప్రదేశ్ లో 59 మంది అనుమానితులు

వారణాసి డివిజన్ మావూ జంక్షన్ లో చేరిక, 8 మంది డిశ్చార్జ్

కరోనాపై పోరాటానికి అంకితభావంతో సహకరిస్తామన్న భారతీయ రైల్వేలు

ఐదు రాష్ట్రాల్లో 960 కోవిడ్ రక్షణ కోచ్ లు ఏర్పాటు చేసిన భారతీయ రైల్వేలు

ఉత్తరప్రదేశ్ లో 23 చోట్ల 372 కోవిడ్ రక్షణ కోచ్ లు ఏర్పాటు

ఢిల్లీ లో 9 చోట్ల 503 కోచ్ లు ఏర్పాటు

దేశ శ్రేయస్సు కోసం రైలు బోగీలను కోవిడ్ రక్షణ కేంద్రాలుగా మార్చిన భారతీయ రైల్వేలు

మే 6న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇచ్చిన మార్గదర్శాకలకనుగుణంగా వైద్య సిబ్బంది బాధ్యత రాష్ట్రాలది

రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహాయం చేయటానికి ఒక్కో ప్రదేశానికి ఇద్దరు లయజన్ అధికారులు

ప్రస్తుత వాతావరణంలో బోగీ లోపల ఉష్ణోగ్రతలు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని రకాల చర్యలు

కోవిడ్ బాధితులకు సహాయం చేసే రాష్ట్రప్రభుత్వాలకు రైల్వేల అండ

Posted On: 22 JUN 2020 6:50PM by PIB Hyderabad

కోవిడ్ 19 పై సుస్థిరమైన పోరు కొనసాగించేలా భారతీయ రైల్వేలు కరోనా బాధితుల చికిత్సకు అనువైన పరిస్థితులు కల్పించటంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. వివిధ రాష్ట్రాలలో చికిత్స కోసం నిర్దేశించిన కోవిడ్ బాధితులకు రక్షణ కేంద్రాలు సమకూర్చుతోంది. వారణాసి లోని మావూ జంక్షన్ కోవిడ్ రక్షణ కేంద్రంలో ఈ నెల 20న 42 మంది అనుమానితులను చేర్చుకోగా 21న మరో 17మంది చేరారు. వీరిలో 8మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా ఉండేందుకు భారతీయ రైల్వేలు తనవంతు పాత్ర పోషిస్తోంది. మొత్తం 5231  కోవిడ్ రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్రాలకు ఇచ్చింది. జోనల్ రైల్వే అధికారులు ఆయా ప్రాంతాల్లో కోచ్ లను ఇందుకు అనుగుణంగా సిద్ధం చేసి స్వల్పంగా, ఒక మోస్తరుగా లక్షణాలున్న కేసులను చేర్చుకోవటానికి వీలు కల్పించారు.  

ఇప్పటివరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 960 కోవిడ్ రక్షణ బోగీలు సిద్ధం చేశారు, వీటిలో 503 ఢిల్లీలో, 20 ఆంధ్రప్రదేశ్ లో, 60 తెలంగాణలో, 372 ఉత్తరప్రదేశ్ లో, 5 మధ్యప్రదేశ్ లో ఏర్పాటయ్యాయి.

ఢిల్లీలోని 503 కోవిడ్ రక్షణ బోగీలు 9 కేంద్రాల్లో ఉన్నాయి.  వాటిలో 50 బోగీలు షకూర్ బస్తి లో, 267ఆనంద వుహార్ లో, 21 సఫ్దర్ గంజ్ లో, 50 సడై రోహిల్లాలో, 33 ఢిల్లీ కంటోన్మెంట్ లో 30ఆదర్శ్ నగర్ లో, 13 ఢిల్లీ షహాద్రాలో, 13 తుగ్లకాబాద్ లో, 26 పటేల్ నగర్ లో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 372 కోవిడ్ రక్షణ బోగీలు 23  కేంద్రాల్లో ఉన్నాయి.  పండిట్ దీన్ దయాఆళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, లక్నో, వారణాసి, భదోహీ, ఫైజాబాద్, సహరన్ పూర్, మీర్జాపూర్, సుబేదార్ గంజ్, కాన్పూర్, ఝాన్సీ, ఝాన్సీ వర్క్ షాప్, ఆగ్రా, నఖా జంగిల్, గోండా, నౌతన్వా, బహ్రైచ్, వారణాసి సిటీ, మాందువాధి, మౌ, భట్ని, ఫరూకాబాద్, కాస్గంజ్ కేంద్రాల్లో ఈ బోగీలున్నాయి.

మధ్యప్రదేశ్ లో మొత్తం 5 కోవిడ్ రక్షణ బోగీలు ఏర్పాటు చేయగా అవి గ్వాలియర్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 కోవిడ్ రక్షణ బోగీలు ఉండగా అవి విజయవాడలోను, తెలంగాణలోని 60 కోవిడ్ బోగీలను సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ కేంద్రాల్లోను ఏర్పాటు చేశారు.

భారత ప్రభుత్వపు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న అవసరాలను భారతీయ రైల్వేలకు తెలియజేయగా రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. ఆయా రాష్ట్రాలకు కోచ్ లు కేటాయించి, కరోనా అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దింది.

దేశ అవసరాల నేపథ్యంలో తన వంతు కృషిగా భారతీయ రైల్వేలు స్వచ్ఛందంగా ఈ బాధ్యత భుజానికెత్తుకోవటం గమనార్హం. అయితే, ఈ కేంద్రాలకు డాక్టర్లను,  ఇతర వైద్య సిబ్బందిని ఆయా రాష్ట్రాలే ఏర్పాటు చేసుకుంటాయి. ఇది కూడా మే 6న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తీసుకున్న నిర్ణయం. 


కోచ్ లు ఏర్పాటు చేసిన ఒక్కో కేంద్రం దగ్గర రైల్వే వారు ఇద్దరేసి లయజన్ అధికారులను నియమించారు. వీరు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కోచ్ లలో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కోవిడ్ బాధితులకు అవసరమైన సేవలందించే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రైల్వేలు ప్రకటించాయి.

తేలికపాటి లక్షణాలున్నవారికి వైద్య పరంగా సాయం అందించాల్సిన పరిస్థితుల్లో వాడుకోవటానికి ఈ బోగీలు పనికొస్తాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించారు.  రాష్ట్రాలు తమ వసతులు పూర్తిగా నిండుకున్నాయనుకున్న సమయంలో వీటిని వాడుకోవచ్చు. వీరిలో అనుమానితులతోబాటు ధ్రువపడినవారు కూడా ఉండవచ్చు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ , నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన సమీకృత కోవిడ్ పథకంలో భాగమే ఈ ఏర్పాట్లు.

 

*******


(Release ID: 1633448) Visitor Counter : 252