రైల్వే మంత్రిత్వ శాఖ

సులభతర వ్యాపార వృద్ధి కోసం సేకరణ నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న రైల్వేలు


ఒక వస్తువు సరఫరాకు, రైల్వేలకు చెందిన ఏ వ్యాపార అనుమతి ఏజెన్సీ నుంచి సరఫరాదారు అనుమతి తెచ్చుకున్నా, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే విభాగాలన్నీ ఆ వస్తువుకు సంబంధించి అతన్ని అధీకృత సరఫరాదారుగా గుర్తిస్తాయి.

ఈ నిర్ణయం విక్రేతలకు లబ్ధి చేకూర్చడంతోపాటు, వస్తు విక్రయ అనుమతుల కోసం వివిధ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయాన్ని ఆదా చేస్తుంది.

Posted On: 21 JUN 2020 4:02PM by PIB Hyderabad


    పారదర్శకత, సామర్థ్యం, వ్యాపార సౌలభ్యం పెంపు కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్న రైల్వేలు, మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక వస్తువును ఏదైనా వ్యాపారి నుంచి రైల్వేలు సేకరించాలంటే, రైల్వేలకు చెందిన అనుమతులు మంజూరు చేసే ఏజెన్సీ ఆ వస్తువుకు సంబంధించి, ఆ వ్యాపారికి అనుమతి ఇవ్వాల్సివుంటుంది.

    ఈ నిబంధనలో మార్పు చేస్తూ కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. రైల్వేలకు ఏదైనా వస్తువు సరఫరా చేయడానికి, రైల్వేలకు చెందిన ఏ వ్యాపార అనుమతి ఏజెన్సీ నుంచి సరఫరాదారు అనుమతి తెచ్చుకున్నా, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే విభాగాలన్నీ ఆ వస్తువుకు సంబంధించి అతన్ని అధీకృత విక్రేతగా గుర్తిస్తాయి.

    వస్తు సరఫరా కోసం టెండర్లు వేసేందుకు వివిధ అనుమతి ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం విక్రేతలకు లబ్ధి చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా సరఫరాదారుల మధ్య పోటీ పెరిగి, ప్రభుత్వానికి వస్తు సేకరణ వ్యయం తగ్గుతుంది. వస్తోత్పత్తి రంగం సామర్థ్యాన్ని మరింత చక్కగా ఉపయోగించుకునే వెసులుబాటు కలిగి, 'మేక్ ఇన్ ఇండియా'కు సాయపడుతుంది.

    గతంలో, ఒక వస్తువును రైల్వేలకు సరఫరా చేయడానికి ఒక అనుమతి ఏజెన్సీ నుంచి సరఫరాదారు అనుమతి తీసుకుంటే, అది ఆ ఏజెన్సీ పరిధిలోనే చెల్లుబాటు అవుతుంది. మరో అనుమతి ఏజెన్సీ పరిధిలో చెల్లుబాటు కాదు. దీనివల్ల అదే వస్తువు సరఫరా అనుమతి కోసం ఆ సరఫరాదారు వివిధ ఏజెన్సీలకు దరఖాస్తు చేసుకోవలసి వచ్చేది. కొత్త నిర్ణయం వల్ల, పారదర్శక పద్థతిలో ఒక సరఫరాదారుడిని ఎంచుకోవడానికి రైల్వేలకు కూడా అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. 



(Release ID: 1633203) Visitor Counter : 239